తొలి వంచన! | Chandrababu naidu not signed on Debt waiver loans scheme | Sakshi
Sakshi News home page

తొలి వంచన!

Published Tue, Jun 10 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

Chandrababu naidu not signed on Debt waiver loans scheme

సంపాదకీయం: తనకూ, విశ్వసనీయతకూ... తనకూ, నిజాయితీకీ... తనకూ, ఇచ్చిన మాటకూ సహస్రయోజనాల దూరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. తరలివచ్చిన అతిరథమహారథుల సాక్షిగా, వేలాదిమంది పార్టీ కార్యక ర్తల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా ఆదివారంనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బాబు.... ఇంతమంది ఉన్నారు కదానన్న వెరపైనా లేకుండా ఇచ్చిన మాటేమిటో, చేసిన బాసేమిటో మరచి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీ ఫైలుపై కాకుండా అందుగురించిన విధివిధానాల కమిటీ ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాదు... ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టే తొలి సంతకం చేశానని నదురు బెదురూ లేకుండా నిండు పేరోలగంలో స్వోత్కర్షకు పోయారు. రుణమాఫీకీ, రుణమాఫీపై విధివిధానాల కమిటీ ఏర్పాటుకూ మధ్య ఉన్న తేడాను జనం పోల్చలేరన్న భరోసానన్నమాట... ఎంత వంచన! ‘వస్తున్నా... మీకోసం’ అంటూ రెండేళ్లనాడు చేసిన పాదయాత్రలో ఆయన తొలి సారి రైతు రుణాలు, ఇతర రుణాల మాఫీపై ప్రకటనచేశారు.
 
  ‘వ్యవ సాయం దండగ’న్న నోటినుంచి ఇలాంటి మాట వచ్చేసరికి రైతులె వరూ నమ్మలేదు. అందువల్లే ఆయన పదే పదే అదే మాటను వల్లెవే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం దానికి చోటిచ్చారు. రుణ మాఫీని ఖచ్చితంగా అమలు చేసితీరుతామని, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని నమ్మబలికారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిననాటినుంచీ ఆయన స్వరం మారిం ది. పాదయాత్ర సమయంలో ప్రజల బాధలు చూసి రుణ మాఫీ హామీ ఇచ్చానని నసిగారు. అప్పటికింకా రాష్ట్ర విభజన నిర్ణయం జరగలేద న్నారు. ‘ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు... ఎవరికీ తెలియని పరిస్థితి’ అంటూ తన నిజరూపం బయటపెట్టారు.
 
 రాష్ట్ర విభజనకు అనుకూలంగా గత ఏడాది జూలైలో సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానంచేశారు. అటు తర్వాత అంచెలంచెలుగా తదుపరి పరిణామాలు సంభవించాయి. చివరకు పార్లమెంటు తుది సమావేశాల్లో విభజన నిర్ణయానికి ఆమోద ముద్రపడింది. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ కాల మంతటా ఎక్కడా, ఎప్పుడూ బాబు తన రుణమాఫీ వాగ్దానాన్ని సవ రించుకోలేదు. విభజన అయిపోయింది గనుక దానికి ఫలానా మార్పు లు తెస్తామని చెప్పలేదు. పైగా ఆ ఫైలు పైనే తొలి సంతకం పెడతానని హోరె త్తారు. బంగారం రుణాలతో సహా వ్యవసాయ రుణాల్లో ఒక్క పైసా కూడా చెల్లించవద్దని ప్రచారం చేశారు. వాటన్నిటినీ అణాపైస లతో సహా రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పారు. పార్టీ తరఫున ఎలక్ట్రా నిక్ మీడియాలో మోత మోగించిన వాణిజ్య ప్రకటనల్లో కూడా ఇల్లాళ్ల పుస్తెలు, పొలం దస్తావేజులు వెనక్కొస్తాయని ఆశపెట్టారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి లక్ష లోపు రుణాలు రద్దుచేస్తామని పరిమితైనా పెట్టుకున్నారు. బాబు ఆ పనీ చేయలేదు.
 
 బాధ్యతగల నాయకుడెవరూ ఉత్తుత్తి హామీలివ్వరు. ప్రజలను వంచించి పబ్బం గడుపుకోవాలనుకోరు. ఒకపక్క ఖరీఫ్ సీజన్ వచ్చే సింది. రైతులు కొత్తగా రుణాలు తీసుకునే సమయమిది. బాబు వాగ్దా నాలు నమ్మి ఈ ఏడాది రైతన్నలెవరూ బ్యాంకు బకాయిలు చెల్లించ లేదు గనుక కొత్తగా వారికి రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. సమస్య ఇంత జటిలంగా మారిందని తెలిసికూడా బాబు బాధ్యత మరిచారు. కనీసం తాను జూన్ మొదటివారంలో ప్రమాణస్వీకారం చేసి, బ్యాంకులను ఒప్పించే బాధ్యతనైనా స్వీకరించివుంటే ఈపాటికి కొంతైనా కదలిక ఉండేది.
 
 కానీ, వారంరోజుల సమయాన్ని వృథా చేసి ఇప్పుడు ఎందుకూ కొరగాని కమిటీ  ఏర్పాటు ఫైలుపై సంతకం చేయ డంలో ఆంతర్యం ఏమిటి? ఆ కమిటీ కూడా పక్షం రోజుల్లో ప్రాథమిక నివేదికను, మరో 45 రోజుల్లో తుది నివేదికనూ అందిస్తుందట. అంత వరకూ ఖరీఫ్ సీజన్ ఆగుతుందా? ఆ కమిటీ సిఫార్సుల తర్వాత బ్యాంకులు రుణాలిచ్చేవరకూ అది వేచిచూస్తుందా? ఇది రైతాంగానికి మాత్రమే కాదు...మొత్తంగా వ్యవసాయానికి, పల్లెసీమలకూ, ఆహార భద్రతకూ జరుగుతున్న దగా. అన్నం పెట్టే చేతులకు ఆసరా కల్పిస్తే ఆ రంగంపై ఆధారపడిన లక్షలమందికి పని దొరుకుతుంది. రైతును సకాలంలో పంట వేయనిస్తే ప్రతి మనిషికీ ఇంత అన్నం ముద్ద దొరుకు తుంది.
 
  అసలే ఎల్‌నినో పొంచివున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానలు సరిగా పడక కరువు రాజ్యమేలవచ్చునని భయపెడుతున్నారు. ఈ తరుణంలో కమిటీల పేరుతో కాలయాపన చేయడం క్షమార్హం కాదు. బాబు రుణమాఫీ పథకం ఆచరణ సాధ్యంకాదని ఎన్నికల ప్ర చార సమయంలోనే నిపుణులు చెప్పివున్నారు. చాలా పార్టీలు ఓటర్లను తప్పుడు వాగ్దానాలతో వంచిస్తున్నాయన్న కారణంతో ఎన్నికల సం ఘం ఈసారి మేనిఫెస్టోల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్దేశిం చింది. చేసే వాగ్దానాలకు హేతుబద్ధత లేకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో చాలామంది విభేదిం చారు.
 
  మేనిఫెస్టోలు సక్రమంగా లేకపోతే, అందులోని వాగ్దానాలను గాలికొదిలేస్తే ప్రజలే తగిన చర్య తీసుకుంటారని చెప్పారు. అది ఎలాగూ జరుగుతుంది. కానీ, ఇప్పుడు బాబు చేసిన వాగ్దానం పర్యవ సానంగా రాష్ట్రంలో సాగు మొత్తం తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. అందువల్ల కమిటీల పేరుతో కాలయాపనకు స్వస్తిచెప్పి తన వాగ్దా నాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టడమే బాబు తక్షణ కర్తవ్యం. అందుకోసం కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించాలి. ఈ విషయంలో ఏ కొంచెం జాప్యంచేసినా రైతాంగానికే కాదు... మొత్తం రాష్ట్ర ప్రజలకే ద్రోహంచేసినట్టవుతుందని గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement