రావెల కార్యక్రమం రసాభాస
- బోనబోయిన వర్సెస్ గింజుపల్లి వర్గీయులు ఘర్షణ
- రెండు వర్గాల వీరంగం
- మంత్రి కాన్వాయ్‌ను నిలిపిన ప్రత్తిపాడు కార్యకర్తలు
- సర్దుబాటు చేసిన మంత్రి
విద్యానగర్/కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వచ్చిన రావెల కిషోర్ బాబుకు స్వాగతం పలికే సందర్బంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కిషోర్ బాబుకు నగరశివారులోని నాగార్జున యూనివర్సిటీనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు.
నగంరలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే మంత్రి కాన్వాయ్‌లో మా వాహనం ముందుండాలంటే, మా వాహనం ముందుండాలనే విషయంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరారామప్రసాద్ తనయుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అది క్రమంగా శృతి మించి ఘర్షణకు దారితీసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులను వెంకటేశ్వరరావు అనుచరులు ప్రశ్నించి మంత్రి కాన్వాయ్ ముందు ఘర్షణకు దిగారు. ఒక దశలో మంత్రి కాన్వాయ్‌ను నిలిపి కార్ల బాయినెట్‌పైకి ఎక్కి రచ్చరచ్చ చేశారు. ఇరువర్గాలు ఆగ్రహావేశాలలో మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి, మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఘర్షణ ఎంతకీ సమసిపోకపోవడంతో మంత్రి రావెల కారు దిగి వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన వివాదంతో ఆర్టీసి బస్టాండ్ నుంచి ఇటు ఆటోనగర్‌కు, ఇటు పొన్నూరు రోడ్డు వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.