
మంత్రులెవరో?
డిప్యూటీగా నారాయణ, యనమల
గవర్నర్ పదవిపై యనమల ఆసక్తి
నారాయణ పట్ల పార్టీలో వ్యతిరేకత
చినరాజప్ప, కేఈ పేర్లు ప్రచారంలో
స్పీకర్‌గా గొల్లపల్లి సూర్యారావు?
మంత్రులుగా అచ్చన్నాయుడు, పతివాడ, మృణాళిని
హైదరాబాద్: చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఉప ముఖ్యమంత్రులుగా నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్లు తొలుత ఖరారయ్యాయి. అయితే యనమల మాత్రం తనకు డిప్యూటీ వద్దని, ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని కోరుతున్నారు. ఇక ఏ సభలోనూ సభ్యుడు కాని నారాయణకు ఏకంగా డిప్యూటీ ఏమిటన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచే వస్తుండటంతో ఆయన్ను మంత్రి పదవికి పరిమితం చేస్తారని కూడా వినిపిస్తోంది. అదే జరిగితే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కాపు వర్గం నుంచి డిప్యూటీగా అవకాశమిస్తారు. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కూడా డిప్యూటీ రేసులో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కింజారపు అచ్చన్నాయుడు, గౌతు శ్యామసుందర శివాజీ, విజయనగరం నుంచి పతివాడ నారాయణస్వామి, కిమిడి మృణాళిని పేర్లు తుది జాబితాలో ఉన్నాయంటున్నారు. ఈమె శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావుకు స్వయానా మరదలు. ఈమెకు పదవిస్తే ఎర్రన్నాయుడు, కళా గ్రూపులను సంతృప్తి పరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి గంటాకు నో చాన్స్
విశాఖ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి ఖాయమైంది. గంటా శ్రీనివాసరావుకు తొలి దశలో అవకాశం లేదని తెలిసింది. తూర్పు గోదావరి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలిసింది. జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావును స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి నుంచి ఎస్సీ కోటాలో పీతల సుజాత, కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావులకు మంత్రి పదవి ఖాయమైంది. కాగిత వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్‌లలో ఒకరికి స్థానం దక్కనుంది. గుంటూరు నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నది బాబుకు కత్తిమీద సాములా మారింది. అక్కడి నుంచి తాము చెప్పిన వారికే అవకాశమివ్వాలని టీడీపీ కార్పొరేట్ కోటరీ బాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
గుంటూరు నుంచి కమ్మ వర్గానికి చెందిన కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవీఎస్ ఆంజనేయులు ఆశావహుల్లో ఉన్నా రు. మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనంద బాబు, రావెల కిశోర్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా రేసులో ఉన్నారు. తొలి విడతలో ప్రత్తిపాటికి చాన్స్ దక్కొచ్చంటున్నారు. ప్రకాశం నుంచి సిద్ధా రాఘవ రావు, నెల్లూరు నుంచి నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ, చిత్తూరు నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కర్నూలు నుంచి కేఈ పేర్లు ఖరారయ్యాయి. అనంతపురం నుంచి పరిటాల సునీతతో పాటు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘనాథరెడ్డి, బీకే పార్థసారథిల్లో ఒకరికి స్థానం లభిస్తుంది.
అక్టోబర్‌లో విస్తరణ!
తొలి విడతలో తనతో పాటు 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించినా, చివరి నిమిషంలో ఈ సంఖ్యను కుదించే అవకాశముందంటున్నారు. ఎక్కువ పదవులు ఇప్పుడే ఇచ్చేస్తే రానివారిలో తీవ్ర అసంతృప్తి రాజుకుంటుందనే ఈ యోచన చేస్తున్నారని, సెప్టెంబర్-అక్టోబర్‌లలో పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాల తర్వాతే విస్తరణ ఉండొచ్చని బాబు ఇప్పటికే సంకేతాలిచ్చారు.
చేరకుంటేనే మంచిదేమో: బీజేపీ
బాబు మంత్రివర్గంలో బీజేపీ చేరకపోవడమే మంచిదన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైనట్టు సమాచారం. ప్రస్తుతానికి తన కేబినెట్‌లో ఒకరికి అవకాశం కల్పిస్తానని బాబు చెప్పారు. అయితే దీనిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ హామీలపై ప్రమాణ స్వీకారం రోజునే సంతకం చేస్తానన్న బాబు, ఇప్పుడు దానిపై కమిటీ వేయడానికే పరిమితం కావడం తదితరాల నేపథ్యంలో బీజేపీ వెనకాముందాడుతోంది. ఎన్నికల హామీలను అమ లు చేయలేకపోతే దాని ప్రభావం మంత్రివర్గంలో చేరినందుకు తమపైనా తీవ్రంగా ఉంటుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక కేంద్రంలో బీజేపీ సహకరించని కారణంగానే హామీలను అమలు చేయలేకపోయానని బాబు చెబితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మథనపడుతున్నట్టు సమాచారం.