అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్ తీసుకున్నారు.
నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.
ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే..
నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment