
నేడే కేసీఆర్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ముహూర్తం ఉదయం 8.15
- కేసీఆర్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులెవరనే దానిపై స్పష్టత కరువు
- ఆయనతో పాటు ఆరుగురితో తొలి మంత్రివర్గం!
- మిగతా ఖాళీలను కొద్దిరోజుల్లో పూరించే యోచనలో టీఆర్‌ఎస్ అధినేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 8.15కు గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ కేబినెట్‌తో కూడా ఆయన ప్రమాణస్వీకా రం చేయిస్తారు. అనంతరం కేబినెట్ బృందానికి గవర్నర్ తేనీటి విందు ఇస్తారు. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పరేడ్ మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా జరిగే ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, తెలంగాణ పునర్నిర్మాణం తదితరాలపై తన మనోగతాన్ని వివరిస్తారు.
ఖరారు కాని మంత్రుల జాబితా...
కేసీఆర్‌తో పాటు సోమవారం ఉదయం ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేస్తారనే విషయంలో ఆదివారం అర్ధరాత్రి దాటినా స్పష్టత రాలేదు. ఆదివారం రాత్రి 12 గంటలకు కూడా తాను తీసుకోబోయే మంత్రులెవరనే జాబితాను కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు పంపలేదు. తొలివిడత మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకుంటారనే విషయంలో రెండురకాలుగా వినిపిస్తోంది. కేసీఆర్ లక్కీనంబర్ 6 కాబట్టి ఆయనతో పాటు సోమవారం మరో ఐదుగురితో మాత్రమే మంత్రివర్గం ఏర్పాటవుతుందనేది కేసీఆర్ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.
ఐదుగురినే తీసుకొనే పక్షంలో ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అలాకాకుండా పదిమందికి అవకాశం కల్పిస్తే... పై ఐదుగురితో పాటు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.రాజయ్య, హరీష్‌రావు, కె.తారక రామారావులను తీసుకునే అవకాశాలున్నాయి. సి.లక్ష్మారెడ్డి లేదా పద్మారావులలో ఒకరికి అవకాశం ఇవ్వడం ద్వారా పదిమంది కోటా పూర్తవుతుందని సమాచారం. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీలను రాబోయే నాలుగైదు రోజుల్లోనే భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తు ప్రకారం రూటు మార్పు
ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్ వెళ్లే దారిని పండితుల సూచనల మేరకు కేసీఆర్ మార్చుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి వెళ్లడం లేదు. దానికి బదులు వాస్తుకు అనుగుణంగా ఉంటుందని పండితులు సూచించిన మరో దారిలో రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 7.20కి కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరతారు. భార్య శోభ ఆయనకు హారతిచ్చి, తిలకం దిద్ది సాగనంపుతారు. కుమార్తె కవిత ముందు నడవగా కేసీఆర్ కాన్వాయ్ ఎక్కుతారు. నందినగర్ గ్రౌండ్, జహిరానగర్ చౌరస్తా, కార్వీ చౌరస్తా, రెయిన్‌బో ఆస్పత్రి, సిటీసెంటర్ మాల్ చౌరస్తా, తాజ్‌కృష్ణా చౌరస్తా, ఎర్రమంజిల్ కాలనీ, ఆర్టీఏ చౌరస్తా, ప్రెస్ క్లబ్ మీదుగా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లక్డీకాపూల్ రవీంద్రభారతి నుంచి గన్‌పార్కుకు చేరుకుంటారు. అనంతరం రాజ్‌భవన్ వెళ్తారు.
రాజ్‌భవన్ వద్ద గట్టి బందోబస్తు
కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసరాలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు ఏకంగా 1500 మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర జాయింట్ కమిషనర్ (కో ఆర్డినేషన్) సంజయ్‌కుమార్ జైన్, పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పాసులు ఉన్న వారిని మినహా రాజ్‌భవన్‌లోకి మరెవ్వరినీ అనుమతించరాదని ఆదేశాలు జారీ చేశారు.
నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేశ్ భగవత్ భద్రతను పరిశీలించారు. ఇక ప్రమాణం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభకు కేసీఆర్ హాజరు కానుండటంతో అక్కడ కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పరేడ్‌గ్రౌండ్స్ పరిసరాల్లో దాదాపు రెండున్నర వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.