
బాబూ.. అంత ఆర్భాటం అవసరమా?
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి: పద్మరాజు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేంటని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుణాలమాఫీ కోసం భారీగా వెచ్చించాల్సిన సమయంలో ఈ హంగులెందుకన్నారు. నిరాడంబరంగా ముగించాల్సిన కార్యక్రమం హడావుడి, ఆర్భాటాల మధ్య నిర్వహించనుండడం శోచనీయమన్నారు.
రుణమాఫీ విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు రైతులకు స్పష్టత ఇవ్వాలని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మాఫీ అమలు చేయాల్సిన అవసరం ఉందని పద్మరాజు అన్నారు. కాగా, సరైన మౌలిక సదుపాయాలు లేవన్న కారణంగా సుమారు 700 వైద్య సీట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్న విషయమై ఎంసీఐ పునరాలోచించాలని పద్మరాజు విజ్ఞప్తి చేశారు. సీట్లు రద్దయితే విద్యార్థులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందని, వాళ్లకు ఉపశమనం కల్పించేందుకు ఎంసీఐ మరోమారు పరిశీలించాలని, ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలన్నారు.