నేడు కొలువుదీరనున్న కొత్త సభ
* ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
* ఉదయం 11:50కి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు.. తర్వాత తంగిరాలకు సంతాపం
* శోభానాగిరెడ్డి పేరును విస్మరించడంపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
* ఎట్టకేలకు ఎజెండాలో చేర్చిన అసెంబ్లీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ కొలువుదీరనుంది. నిజాం హయాంలో నిర్మితమైన ఈ కట్టడం ప్రస్తుతం వారసత్వ కట్టడంగా ఉంది. 1956లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసిన తరువాత అయ్యదేవర కాలేశ్వరరావు అధ్యక్షతన తొలి అసెంబ్లీ సమావేశం(1956 డిసెంబర్ 4న) ఈ భవనంలోనే జరిగింది. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక ఈ భవనం వెనుకనే కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించడంతో ఆ తరువాత నుంచి సభా కార్యక్రమాలు అక్కడికి మారాయి. అప్పట్నుంచి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించినప్పుడు మాత్రమే ఈ పాత భవనాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనతో ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పాత అసెంబ్లీ భవనం మళ్లీ వేదికగా మారుతోంది.
ప్రొటెం స్పీకర్‌గా పతివాడ..
అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ అయిన పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 29, 30లు విడుదల చేశారు. ఉదయం 9.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో పతివాడ నారాయణస్వామితో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముందుగా సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఇతర సభ్యులందరితోనూ ప్రమాణాలు చేయించనున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు ఫలితాలు ప్రకటించిన నెలా మూడు రోజుల తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
సంతాప తీర్మానాలు: సభ్యుల ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటీవల మరణించిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు (నందిగామ), వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ)లకు సభ సంతాపం తెలపనుంది. తొలుత విడుదల చేసిన ఎజెండాలో శోభా నాగిరెడ్డికి సంతాపం తెలిపే తీర్మానం ప్రస్తావన లేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణను కలసి తమ అభ్యంతరం తెలిపారు. శోభానాగిరెడ్డి గెలిచినా ఎన్నికకు ముందే ఆమె మరణించడంతో సాంకేతికంగా ఈ సభ సభ్యురాలిగా పరిగణించాలా? లేదా? అన్న సంశయం అధికారుల్లో ఏర్పడింది. దీంతో ఆమె పేరును సంతాప తీర్మానాల్లో చేర్చలేదని అసెంబ్లీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో పొరపాటును సరిచేసుకున్నారు. శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం అంశాన్ని చివరి నిమిషంలో అసెంబ్లీ ఎజెండాలో చేర్చారు.
ఐదు రోజుల సభ..
ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు 19వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు, మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22న సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఉంటుంది. శాసన మండలి ఈ నెల 23, 24 తేదీల్లో సమావేశమవుతుంది. అక్కడ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.