shoba nagi reddy
-
కన్నీటి సంద్రం.. సంగమేశ్వరం
దివంగత ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను సోమవారం కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమమైన సంగమేశ్వరంలో కలిపారు. కొత్తపల్లి: సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమం సంగమేశ్వరంలో కలిపారు. ఈ కార్యక్రమంతో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మాలాభరణి, భీమరతి, భవనాశి నదులు ఒక్కటై ప్రవహించే కృష్ణానదీ తీరం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోయింది. సోమవారం ఉదయాన్నే శోభా నాగిరెడ్డి భర్త, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి, కూతుళ్లు అఖిల ప్రియారెడ్డి, నాగమౌనిక రెడ్డి, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, సోదరుడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, సోదరి పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు భూమా నారాయణరెడ్డి, బి.వి.రామిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రం చేరుకున్నారు. ముందుగా ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు విలువింటి విశ్వమూర్తిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది ఒడ్డున శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఉంచి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేశారు. అనంతరం మూడు ఇంజిన్ బోట్లలో కృష్ణా నదిలో ప్రయాణిస్తూ వేద పండితులు కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతుల మీదుగా శోభా నాగిరెడ్డి అస్థికలను సప్తనదుల సంగమంలో కలిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కొలనుభారతి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేశారు. కార్యక్రమంలో శివపురం సర్పంచ్ సంతోషమ్మ, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్కాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త సభ
* ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు * ఉదయం 11:50కి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు.. తర్వాత తంగిరాలకు సంతాపం * శోభానాగిరెడ్డి పేరును విస్మరించడంపై వైఎస్సార్సీపీ మండిపాటు * ఎట్టకేలకు ఎజెండాలో చేర్చిన అసెంబ్లీ అధికారులు సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ కొలువుదీరనుంది. నిజాం హయాంలో నిర్మితమైన ఈ కట్టడం ప్రస్తుతం వారసత్వ కట్టడంగా ఉంది. 1956లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసిన తరువాత అయ్యదేవర కాలేశ్వరరావు అధ్యక్షతన తొలి అసెంబ్లీ సమావేశం(1956 డిసెంబర్ 4న) ఈ భవనంలోనే జరిగింది. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక ఈ భవనం వెనుకనే కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించడంతో ఆ తరువాత నుంచి సభా కార్యక్రమాలు అక్కడికి మారాయి. అప్పట్నుంచి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించినప్పుడు మాత్రమే ఈ పాత భవనాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనతో ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పాత అసెంబ్లీ భవనం మళ్లీ వేదికగా మారుతోంది. ప్రొటెం స్పీకర్‌గా పతివాడ.. అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ అయిన పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 29, 30లు విడుదల చేశారు. ఉదయం 9.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో పతివాడ నారాయణస్వామితో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముందుగా సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఇతర సభ్యులందరితోనూ ప్రమాణాలు చేయించనున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు ఫలితాలు ప్రకటించిన నెలా మూడు రోజుల తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సంతాప తీర్మానాలు: సభ్యుల ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటీవల మరణించిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు (నందిగామ), వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ)లకు సభ సంతాపం తెలపనుంది. తొలుత విడుదల చేసిన ఎజెండాలో శోభా నాగిరెడ్డికి సంతాపం తెలిపే తీర్మానం ప్రస్తావన లేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణను కలసి తమ అభ్యంతరం తెలిపారు. శోభానాగిరెడ్డి గెలిచినా ఎన్నికకు ముందే ఆమె మరణించడంతో సాంకేతికంగా ఈ సభ సభ్యురాలిగా పరిగణించాలా? లేదా? అన్న సంశయం అధికారుల్లో ఏర్పడింది. దీంతో ఆమె పేరును సంతాప తీర్మానాల్లో చేర్చలేదని అసెంబ్లీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో పొరపాటును సరిచేసుకున్నారు. శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం అంశాన్ని చివరి నిమిషంలో అసెంబ్లీ ఎజెండాలో చేర్చారు. ఐదు రోజుల సభ.. ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు 19వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు, మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22న సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఉంటుంది. శాసన మండలి ఈ నెల 23, 24 తేదీల్లో సమావేశమవుతుంది. అక్కడ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. -
గుండె ల నిండా శోభమ్మ జ్ఞాపకాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుండె గది నిండా అమ్మ జ్ఞాపకాలు.. కళ్లలో కదలాడుతున్న అమ్మ స్వరూపం..జనంతోఅమ్మచేసిన కరచాలనం..పలుకరింపులు. అదే ప్రేమను.. ఆప్యాయతను.. ఆత్మీయతను గుండెల్లో నింపుకుని అమ్మ గెలుపు బాధ్యతను భుజాన మోస్తూ ఊరూ.. వాడా సాగిపోతున్నారు వారు. తల్లి జ్ఞాపకాలు తరుముకొస్తున్నా... బాధ్యతను పిడికిల్లోదాచుకుని ముందుకు సాగుతున్న ఆపిల్లల రాజకీయ స్థైర్యాన్ని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చ్యర్యం వేయకమానదు. ఆళ్లగడ్డలో అమ్మకోసం.. నంద్యాలలో నాన్నకోసం.. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా జనంతో కలసి సాగుతున్నారు. ఆమ్మా.. నాన్నలను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి మీ ముంగిట చేరుతుందంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. మరోవైపు సతీమణి వీడిపోయిన దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని.. ఆ లావాగ్నిని భరిస్తూ.. తన ముందున్న బాధ్యతను నెరవేరుస్తూ.. ధీమాతో ముందుకు కదులుతున్నారు భూమా. పత్తికొండలో అక్క నాగరత్నమ్మ ప్రచారం.... చెల్లెలు శోభమ్మను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి విజయం కోసం ఊరూ.. వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెల్లెలు ఇక పత్తికొండకు రాదని.. ఆ చిరునవ్వు లేదని తెలిసి బాధను గుండెల్లో దాచుకుని కోట్ల చక్రపాణిరెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా సోదరిని పోగొట్టుకున్న బాధను గుండెల్లో దాచుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు కూడా ఆమె లేరనే బాధను మదిలో దాచుకుని విజయమే లక్ష్యంగా సాగుతున్నారు. నంద్యాలలో మౌనిక ఆళ్లగడ్డలో ఆ ఇద్దరు అమ్మ కోసం ప్రచారం చేస్తుంటే.. నంద్యాలలో భూమా నాగిరెడ్డి, తన రెండో కుమార్తె మౌనిక ప్రచారం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభారాణి, జీవితాంతం కలిసుంటుందని బాస చేసిన ఆమె ఇక లేరని తెలిసి భర్త భూమా నాగిరెడ్డి హృదయం గాయమైంది. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగి.. మదిలో బాధను బయటకు చెప్పుకోలేక.. సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ప్రచారంలో సాగుతున్నారు. ‘జగనన్న సీఎం కావాలంటే నాన్నను గెలిపించండి..ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి’ అంటూ మౌనిక ప్రచారం చేస్తున్నారు. అమ్మను పోగొట్టుకున్న దుఃఖం, నాన్నను ఈ స్థితిలో చూస్తున్న బాధను లోలోపల దిగమింగుతూ ఆ ముగ్గురు ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి జనం కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఈ స్థితిలో మీరెందుకు వచ్చారమ్మా. పార్టీని గెలిపించటం మా బాధ్యత కాదా’ అంటూ వారికి భరోసానిచ్చి పంపుతున్నారు. ఆళ్లగడ్డలో అమ్మ కోసం ఆ ఇద్దరు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దుఃఖాన్ని దిగమింగి ఆళ్లగడ్డలో అమ్మ విజయం కోసం భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘అమ్మను గెలిపించండి.. జగనన్నను సీఎంను చేయండి. మీరు ఓటే వేసే అమ్మకు నివాళి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారంలో సాగుతున్నారు. అమ్మ కోసం ఆ పసి హృదయాలు పడే తపన నియోజకవర్గ ప్రజలను కలచివేస్తోంది. శోభమ్మను అఖిల ప్రియలో చూసుకుంటూ.. ‘అచ్చం మా శోభమ్మలా ఉన్నావమ్మా’ అంటూ కన్నీరు పెడుతున్నారు. ‘చల్లగుండాలమ్మా’ అంటూ అందరూ వారిని దీవించి పంపుతున్నారు. -
ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం
కర్నూలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడి బ్యాలెట్ యూనిట్లో శోభానాగిరెడ్డి పేరు, పార్టీ గుర్తు ఆమె గెలిస్తే ఏం చేయాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక యథాతథంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు మరణిస్తే ఎన్నిక వాయిదా పడదని ఇప్పుడున్న చట్టాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ పూర్తయి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా కూడా ప్రకటించినందున వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ బ్యాలెట్ యూనిట్లో ఆమె పేరు, గుర్తు యథావిధిగా ఉంటాయని వివరించారు. ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలూ రానందున ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకారమే ఎన్నిక జరుగుతుందని, ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి విజయం సాధిస్తే ఏం చేయాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని వివరించారు. -
జననేతను సీఎం చేద్దాం
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: సువర్ణయుగం రావాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డ కోరారు. దొర్నిపాడు మండలం ఉమాపతినగర్, గుండుపాపల, క్రిష్టిపాడు, చాకరాజువేముల గ్రామాల్లో శుక్రవారం ఆమె ప్రచారం చేశారు. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ.. వారియోగక్షేమాలు తెలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.. అవ్వా జగనన్న సీఎం అయితే నీ పింఛన్ 700 రూపాయలు అవుతుంది...అక్కా మీ డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు చేస్తారు..అన్నా జూన్ నుంచి మీ ఇంటి కరెంట్ బిల్లు 100 రూపాయలు మాత్రమే వస్తుంది. తాత మనువడిని బడికి పంపు..జగనన్న నెలకు 500 రూపాయలు చదువుల కోసం బ్యాంక్‌లో జమ చేస్తారు అంటూ.. ఆమె వివరించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని శోభానాగిరెడ్డి తెలిపారు. ఉమాపతినగర్‌లో మహిళలు శోభానాగిరెడ్డికి మంగళహారులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వనించారు. చర్చిపై భాగం నుంచి మహిళలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. గుండుపాపల గ్రామంలో యువకులు, మహిళలు..శోభ రోడ్డుషోలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రిష్టిపాడు గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు, ముస్లింలు, యువకులు తరలి వచ్చి శోభకు సంఘీభావం తెలిపారు. మెయిన్ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చడానికి గతంలో రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు నీరాజనాలు పలికారు. ఎస్సీ కాలనీలో 10 లక్షల సీసీ రోడ్లు వేశారని ఎస్సీ కాలనీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొత్తపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ మహిళా కూలీల సమస్యలను శోభానాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు స్థానిక ఎలక్షన్లు ఫ్రీ ఫైనల్ లాంటివని, అందులో సత్తా చాటాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆమె చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను బరిలో దింపేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ బలం ప్రత్యర్థులకు చూపించాలన్నారు. మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టేబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ముఖ్యంగా అమ్మఒడి, పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే వైఎస్ఆర్ హయాంలో లబ్ధిపొందిన కుటుంబాలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వారి గురించి ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు పడిన కష్టాలు,ై వెఎస్ఆర్ హయంలో ప్రజలకు అందిన పథకాలను అర్థమయ్యేరీతిలో ప్రజలకు వివరించాలన్నారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏకమయ్యారని, అయినా తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో రుద్రవరం మండల నాయకులు సత్యనారాయణ, రంగనాయకులు, ప్రతాపరెడ్డి, చాగలమర్రి నాయకులు నిజాముద్దీన్, రఘునాథ్‌రెడ్డి, రామగురివిరెడ్డి, అన్సర్‌బాషా, జగద్వీశర్రెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రాముయాదవ్, శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా గడ్డం వెంకటేష్ నాయక్ కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా గిరిజనుడైన గడ్డం వెంకటేష్ నాయక్‌ను నియమించడంతో గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా రెండు సంవత్సరాల కాల వ్యవధితో కూడిన నామినేటెడ్ పదవి ఎస్టీ వ్యక్తికి కేటాయించడం అభినందనీయమన్నారు. 19వ తేదీన ఢిల్లీ నుండి కర్నూలుకు వస్తున్న వెంకటేష్ నాయక్‌కు ఘన స్వాగతం పలుకనున్నట్లు చెప్పారు. సమావేశంలో గిరిజన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్ణానాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడు హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని రాయలసీమ గంగపుత్ర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బి.శివనవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు లక్ష్మీనివాస్ లాడ్జీలో సోమవారం ఆయన ఆయన అధ్యక్షతన వివిధ కుల సంఘాలు, ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివనవీన్‌కుమార్ మాట్లాడుతూ బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఎంబీసీ నాయకులను (ఆనాడు కప్పట్రాళ్ల వెంటప్పనాయుడు, దళ్వాయి రామయ్య, జింకల వెంకటేశ్వర్లు, ఆళ్లడ్డ నాయకులు ఆచారి సోదరులు, నేడు సాయిఈశ్వరుడు) కడతేరుస్తున్నారని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వాల్మీకి ఐక్యపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జె.శ్రీనివాసనాయుడు, తెలుగు సంఘం నాయకులు పుల్లయ్య, మైనారిటీ నాయకులు ఆరిఫ్, శివ పాల్గొన్నారు. -
బాబు 'సమైక్య' లేఖపై జగన్ సంతకం: శోభ
-
టీడీపీ లేఖ వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘మమ్మల్ని ఎన్నయినా తిట్టండి, ఎన్ని సార్లయినా విమర్శించండి. సమైక్య రాష్ట్రంకోసం సహిస్తాం.. భరిస్తాం. కానీ విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసేందుకు చంద్రబాబు ఏం చేయడానికి సిద్ధమైతే మా నాయకుడు జగన్ కూడా అందుకు సిద్ధమే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బెయిల్ డీల్ అంటూ ఆరోపించడం కాదనీ, చేతనైతే ఆధారాలు చూపించాలని టీడీపీనేత సీఎం రమేష్‌కు శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. వాటిని రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. లేదా తప్పుడు ఆరోపణలు చేశానని ప్రజల ముందు జగన్కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడం మానకపోతే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన లేఖ గురించి అడుగుతారనే: తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ప్రజలు, జేఏసీ నేతలు ఎక్కడ అడుగుతారోననే భయంతో... ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు తమ పార్టీపై బురద చల్లుతున్నారని శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన విషయాన్ని పట్టుకొని తాము ఇన్వెస్టిగేషన్ చేశామంటూ ఎల్లోమీడియా శివాలెత్తుతోందని దుయ్యబట్టారు. సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు విజయమ్మ వెళితే... దాన్ని ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారంటూ ఎల్లో ఛానల్లో ప్రసారం చేయడం, ఆ తర్వాత టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి అవే ఆరోపణలు గుప్పించడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్న టీడీపీ నేతల తెలివితేటలను అంగీకరిస్తున్నాం. అవే తెలివితేటలను రాష్ట్ర విభజన జరగకుండా ఉపయోగిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు’’ అని ఆమె సూచించారు.