సువర్ణయుగం రావాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగి రెడ్డి కోరారు.
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: సువర్ణయుగం రావాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డ కోరారు. దొర్నిపాడు మండలం ఉమాపతినగర్, గుండుపాపల, క్రిష్టిపాడు, చాకరాజువేముల గ్రామాల్లో శుక్రవారం ఆమె ప్రచారం చేశారు.
ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ.. వారియోగక్షేమాలు తెలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.. అవ్వా జగనన్న సీఎం అయితే నీ పింఛన్ 700 రూపాయలు అవుతుంది...అక్కా మీ డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు చేస్తారు..అన్నా జూన్ నుంచి మీ ఇంటి కరెంట్ బిల్లు 100 రూపాయలు మాత్రమే వస్తుంది.
తాత మనువడిని బడికి పంపు..జగనన్న నెలకు 500 రూపాయలు చదువుల కోసం బ్యాంక్‌లో జమ చేస్తారు అంటూ.. ఆమె వివరించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని శోభానాగిరెడ్డి తెలిపారు. ఉమాపతినగర్‌లో మహిళలు శోభానాగిరెడ్డికి మంగళహారులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వనించారు. చర్చిపై భాగం నుంచి మహిళలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. గుండుపాపల గ్రామంలో యువకులు, మహిళలు..శోభ రోడ్డుషోలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్రిష్టిపాడు గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు, ముస్లింలు, యువకులు తరలి వచ్చి శోభకు సంఘీభావం తెలిపారు. మెయిన్ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చడానికి గతంలో రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు నీరాజనాలు పలికారు. ఎస్సీ కాలనీలో 10 లక్షల సీసీ రోడ్లు వేశారని ఎస్సీ కాలనీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొత్తపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ మహిళా కూలీల సమస్యలను శోభానాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.