కర్నూలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడి
బ్యాలెట్ యూనిట్‌లో శోభానాగిరెడ్డి పేరు, పార్టీ గుర్తు
ఆమె గెలిస్తే ఏం చేయాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక యథాతథంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు మరణిస్తే ఎన్నిక వాయిదా పడదని ఇప్పుడున్న చట్టాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ పూర్తయి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా కూడా ప్రకటించినందున వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ బ్యాలెట్ యూనిట్‌లో ఆమె పేరు, గుర్తు యథావిధిగా ఉంటాయని వివరించారు. ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలూ రానందున ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకారమే ఎన్నిక జరుగుతుందని, ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి విజయం సాధిస్తే ఏం చేయాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని వివరించారు.