గుండె ల నిండా శోభమ్మ జ్ఞాపకాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుండె గది నిండా అమ్మ జ్ఞాపకాలు.. కళ్లలో కదలాడుతున్న అమ్మ స్వరూపం..జనంతోఅమ్మచేసిన కరచాలనం..పలుకరింపులు. అదే ప్రేమను.. ఆప్యాయతను.. ఆత్మీయతను గుండెల్లో నింపుకుని అమ్మ గెలుపు బాధ్యతను భుజాన మోస్తూ ఊరూ.. వాడా సాగిపోతున్నారు వారు. తల్లి జ్ఞాపకాలు తరుముకొస్తున్నా... బాధ్యతను పిడికిల్లోదాచుకుని ముందుకు సాగుతున్న ఆపిల్లల రాజకీయ స్థైర్యాన్ని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చ్యర్యం వేయకమానదు. ఆళ్లగడ్డలో అమ్మకోసం.. నంద్యాలలో నాన్నకోసం.. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా జనంతో కలసి సాగుతున్నారు. ఆమ్మా.. నాన్నలను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి మీ ముంగిట చేరుతుందంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. మరోవైపు సతీమణి వీడిపోయిన దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని.. ఆ లావాగ్నిని భరిస్తూ.. తన ముందున్న బాధ్యతను నెరవేరుస్తూ.. ధీమాతో ముందుకు కదులుతున్నారు భూమా.
పత్తికొండలో అక్క నాగరత్నమ్మ ప్రచారం....
చెల్లెలు శోభమ్మను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి విజయం కోసం ఊరూ.. వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెల్లెలు ఇక పత్తికొండకు రాదని.. ఆ చిరునవ్వు లేదని తెలిసి బాధను గుండెల్లో దాచుకుని కోట్ల చక్రపాణిరెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా సోదరిని పోగొట్టుకున్న బాధను గుండెల్లో దాచుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు కూడా ఆమె లేరనే బాధను మదిలో దాచుకుని విజయమే లక్ష్యంగా సాగుతున్నారు.
నంద్యాలలో మౌనిక
ఆళ్లగడ్డలో ఆ ఇద్దరు అమ్మ కోసం ప్రచారం చేస్తుంటే.. నంద్యాలలో భూమా నాగిరెడ్డి, తన రెండో కుమార్తె మౌనిక ప్రచారం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభారాణి, జీవితాంతం కలిసుంటుందని బాస చేసిన ఆమె ఇక లేరని తెలిసి భర్త భూమా నాగిరెడ్డి హృదయం గాయమైంది. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగి.. మదిలో బాధను బయటకు చెప్పుకోలేక.. సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ప్రచారంలో సాగుతున్నారు. ‘జగనన్న సీఎం కావాలంటే నాన్నను గెలిపించండి..ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి’ అంటూ మౌనిక ప్రచారం చేస్తున్నారు. అమ్మను పోగొట్టుకున్న దుఃఖం, నాన్నను ఈ స్థితిలో చూస్తున్న బాధను లోలోపల దిగమింగుతూ ఆ ముగ్గురు ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి జనం కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఈ స్థితిలో మీరెందుకు వచ్చారమ్మా. పార్టీని గెలిపించటం మా బాధ్యత కాదా’ అంటూ వారికి భరోసానిచ్చి పంపుతున్నారు.
ఆళ్లగడ్డలో అమ్మ కోసం ఆ ఇద్దరు...
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దుఃఖాన్ని దిగమింగి ఆళ్లగడ్డలో అమ్మ విజయం కోసం భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘అమ్మను గెలిపించండి.. జగనన్నను సీఎంను చేయండి. మీరు ఓటే వేసే అమ్మకు నివాళి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారంలో సాగుతున్నారు. అమ్మ కోసం ఆ పసి హృదయాలు పడే తపన నియోజకవర్గ ప్రజలను కలచివేస్తోంది. శోభమ్మను అఖిల ప్రియలో చూసుకుంటూ.. ‘అచ్చం మా శోభమ్మలా ఉన్నావమ్మా’ అంటూ కన్నీరు పెడుతున్నారు. ‘చల్లగుండాలమ్మా’ అంటూ అందరూ వారిని దీవించి పంపుతున్నారు.