c.sudarshan reddy
-
12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ఈనెల 12న కర్నూలు శివారులోని సెయింట్ బాలికల జూనియర్ కళాశాల జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13న కర్నూలు డివిజన్లో అన్ని మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్)లోను జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్‌కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోందని వివరించారు. వీటికి కూడా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. -
ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం
కర్నూలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడి బ్యాలెట్ యూనిట్లో శోభానాగిరెడ్డి పేరు, పార్టీ గుర్తు ఆమె గెలిస్తే ఏం చేయాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక యథాతథంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు మరణిస్తే ఎన్నిక వాయిదా పడదని ఇప్పుడున్న చట్టాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ పూర్తయి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా కూడా ప్రకటించినందున వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ బ్యాలెట్ యూనిట్లో ఆమె పేరు, గుర్తు యథావిధిగా ఉంటాయని వివరించారు. ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలూ రానందున ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకారమే ఎన్నిక జరుగుతుందని, ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి విజయం సాధిస్తే ఏం చేయాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని వివరించారు. -
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి, ఉగాది పండుగల నేపథ్యంలో ప్రధానంగా శ్రీశైలం, ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. దెబ్బతిన్న రహదారుల్లో ఇబ్బందులు పడకుండా తగిన మరమ్మతులు చేయాలని వివరించారు. కర్నూలు నుంచి కోడుమూరు, కోడుమూరు నుంచి దేవనకొండ రోడ్లు గుంతలుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు రోడ్ల మరమ్మతు పనులపై దృష్టి సారించాలని వివరించారు. కర్నూలు-శ్రీశైలం, నంద్యాల, శ్రీశైలం రోడ్ల మరమ్మతులు సత్వరం చేపట్టాలని పేర్కొన్నారు. బొమ్మలసత్రం దగ్గర రోడ్డు అధ్వానంగా ఉందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాల రోడ్ల అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.46 కోట్లు మంజూరు అయ్యాయని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. బేతంచెర్ల-డోన్, రామళ్లకోట-బేతంచెర్ల, ఆళ్లగడ్డ-అహోబి లం రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనా పనులు జరగకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ఆదోని డివిజన్లో పంచాయతీరాజ్‌కు రోడ్ల అభివృద్ధి పనులు ఆర్అండ్బీ అధికారులు తీసుకుని చేపట్టాలని సూచించారు. అన్ని పనులను వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
మహాప్రభో..మా కష్టాలు తీర్చండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అధికారుల చుట్టూ తిరిగేకంటే ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి సమస్యలు పరిష్కారమయ్యే ఏమో. ఒకటి..రెండు..మూడు.. ఐదు..పది.. ఇరవై.. ఇలా వందల సార్లు ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చినా సమస్యలకు మోక్షం లభించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజాదర్బార్‌కు వస్తున్న బాధితులకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు వివిధ వర్గాల ప్రజలు ఇచ్చే వినతులను పైపైనే చదివి ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తున్నారు. వారు వాటిని కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కాక వివిధ వర్గాల ప్రజలు ఇటు ప్రజాదర్బార్, అటు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ-ఐకేపీ పీడీ నజీర్‌సాహెబ్ తమకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో వినతులు వెల్లువెత్తాయి. అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పోటీ పడ్డారు. సునయన ఆడిటోరియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగింది. ప్రజాదర్బార్‌కు వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. -
ఓటు.. చేటు!
ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన 65 మంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం డోన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఇప్పటికీ అదే గ్రామంలో ఓటర్లుగా కొనసాగుతున్నారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనూ ఓటు హక్కును పొందారు. ఎన్నికల సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి ఓ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. జిల్లాలో ఇలాంటి బోగస్ ఓట్లు కోకొల్లలు. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. గెలుపుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియను నాయకులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గత నెల 18న జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్లు 14,12,688.. మహిళా ఓటర్లు 14,27,036 మంది ఉన్నారు. అధికార లెక్కల ప్రకారమే జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,83,180 బోగస్ ఓటర్లను గుర్తించారు. వీటి తొలగింపునకు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టినా ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది ప్రశ్నార్థకమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపును ఈ బోగస్ ఓట్లే నిర్ణయిస్తున్నాయి. 2014లో పార్లమెంట్లు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బోగస్ ఓటర్లను చేర్పించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, నంద్యాల, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలు చూపుతున్నా నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో తొలగించేందుకు స్థానిక అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారికంగా 4,833 మంది బోగస్ ఓటర్లు ఉండగా.. వివిధ వర్గాల సమచారం మేరకు ఈ సంఖ్య 10వేల పైమాటే. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం నగరంలో ఓటు హక్కు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన వందలాది మంది కర్నూలులోని మద్దూరు నగర్, లక్ష్మినగర్లలోని 72, 73 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 5వ వార్డులోని 4వ పేటలో 100 శాతం ముస్లింలే నివసిస్తున్నారు. ఇక్కడ 80 మంది హిందువుల పేర్లతో ఓట్లు ఉండటం గమనార్హం. 100వ పోలింగ్ కేంద్రంలో 1,020 మంది ఓటర్లు ఉంటే.. ఆ వార్డుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు 482 ఉండటం బోగస్ ఓట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది. ఓ కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ ఇంట్లో 72 మంది ఓటర్లు ఉన్నారు. మరో మాజీ మేయర్ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా.. 16 బోగస్ ఓట్లు ఉన్న విషయం అధికారులకు తెలిసినా తొలగించే సాహసం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వీరంతా కీలకంగా మారిపోతున్నారు. అయ్యప్పస్వామి గుడి పరిసరాలు, ఎల్బీజీ నగర్ వాసులు అదే కాలనీ లేదా పక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉండాలి. కానీ వీరికి ఏ మాత్రం సంబంధం లేని గౌరీ గోపాల్ ఆసుపత్రి వద్దనున్న పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ నేత భారీ ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు అందింది. జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
మధ్యాహ్న భోజనం అంత అధ్వానమా?
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ‘‘పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంత అధ్వానంగా ఉందా.. ఎందుకు ఈ విధంగా ఉంటోంది. ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఏమి చేస్తున్నారు.. పాఠశాలలకు వెళ్లి చూడటం లేదా’’ అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం అమలు, కిచెన్ షెడ్ల నిర్మాణంలో జాప్యం తదితర వాటిపై సాక్షి ఇటీవల సమరసాక్షి శీర్షికన ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక డీఈఓ, డిప్యూటీ డీఈఓలు నీళ్లు నమిలారు. ఈ నెలలో ఎన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.. భోజనం నాణ్యత బాగుందా.. ఏఏ లోపాలు గుర్తించారు.. వాటిపై డీఈఓకు రిపోర్టులు ఇచ్చారా అనే దానిపై డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎంఈఓలు ప్రతినెలా కనీసం 20 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలలో ఇంత వరకు పలువురు ఎంఈఓలు నాలుగు, ఐదుసార్లు మాత్రమే తనిఖీ చేసినట్లు చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలో భోజనం నాణ్యత బాగా లేకపోతే ఏజెన్సీకి మెమోలు ఇవ్వండి.. ఇలా మూడు సార్లు మెమోలు ఇచ్చినా మార్పు రాకపోతే సంబంధిత ఏజెన్సీని తొలగించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, ఇతర ఏర్పాట్లపై తాను తనిఖీ చేసి చెబితే తప్ప స్పందించడం లేదని ఎంఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వివరాలతో రిపోర్టులు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అంధుల కంప్యూటర్ శిక్షణకు సంపూర్ణ సహకారం
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: అంధుల కంప్యూటర్ శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్రిష్ణానగర్లో జాతీయ అంధుల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంధులైన ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థుల కోసం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అంధులు ఉపయోగిస్తున్న కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ను వివరాలను అంధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఆర్ విశ్వనాథరెడ్డి నుంచి తెలుసుకున్నారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అయ్యిందన్నారు. చూపు లేదనే నిరాశను వదలి పెట్టి ఉజ్వల భవిష్యత్తు కోసం అంధులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అంధులు కళ్లు ఉన్న వారికి ఏమాత్రం తీసి పోరని ప్రస్తుతం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రమే నిదర్శనమన్నారు. జాతీయ అంధుల సమాఖ్య కర్ణాటక ప్రధాన కార్యదర్శి గౌతం అగర్వాల్, ఎన్‌ఎఫ్‌బీ సౌత్ జోన్ ఉపాధ్యక్షులు గోపాలక్రిష్ణ మాట్లాడుతూ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించవచ్చన్నారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అంధులకు చేయూతను ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఈ శిక్షణను పొంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు ఇమ్మానియేల్ వరప్రసాద్, డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ సిద్దారెడ్డి, ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.