ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన 65 మంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం డోన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఇప్పటికీ అదే గ్రామంలో ఓటర్లుగా కొనసాగుతున్నారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనూ ఓటు హక్కును పొందారు. ఎన్నికల సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి ఓ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. జిల్లాలో ఇలాంటి బోగస్ ఓట్లు కోకొల్లలు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. గెలుపుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియను నాయకులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గత నెల 18న జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్లు 14,12,688.. మహిళా ఓటర్లు 14,27,036 మంది ఉన్నారు. అధికార లెక్కల ప్రకారమే జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,83,180 బోగస్ ఓటర్లను గుర్తించారు.
వీటి తొలగింపునకు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టినా ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది ప్రశ్నార్థకమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపును ఈ బోగస్ ఓట్లే నిర్ణయిస్తున్నాయి. 2014లో పార్లమెంట్‌లు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బోగస్ ఓటర్లను చేర్పించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, నంద్యాల, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలు చూపుతున్నా నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో తొలగించేందుకు స్థానిక అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారికంగా 4,833 మంది బోగస్ ఓటర్లు ఉండగా.. వివిధ వర్గాల సమచారం మేరకు ఈ సంఖ్య 10వేల పైమాటే. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం నగరంలో ఓటు హక్కు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన వందలాది మంది కర్నూలులోని మద్దూరు నగర్, లక్ష్మినగర్‌లలోని 72, 73 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 5వ వార్డులోని 4వ పేటలో 100 శాతం ముస్లింలే నివసిస్తున్నారు. ఇక్కడ 80 మంది హిందువుల పేర్లతో ఓట్లు ఉండటం గమనార్హం. 100వ పోలింగ్ కేంద్రంలో 1,020 మంది ఓటర్లు ఉంటే.. ఆ వార్డుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు 482 ఉండటం బోగస్ ఓట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది. ఓ కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ ఇంట్లో 72 మంది ఓటర్లు ఉన్నారు.
మరో మాజీ మేయర్ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా.. 16 బోగస్ ఓట్లు ఉన్న విషయం అధికారులకు తెలిసినా తొలగించే సాహసం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వీరంతా కీలకంగా మారిపోతున్నారు. అయ్యప్పస్వామి గుడి పరిసరాలు, ఎల్‌బీజీ నగర్ వాసులు అదే కాలనీ లేదా పక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉండాలి. కానీ వీరికి ఏ మాత్రం సంబంధం లేని గౌరీ గోపాల్ ఆసుపత్రి వద్దనున్న పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ నేత భారీ ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు అందింది. జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ఓటు.. చేటు!
Published Sun, Dec 22 2013 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement