కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ‘‘పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంత అధ్వానంగా ఉందా.. ఎందుకు ఈ విధంగా ఉంటోంది. ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఏమి చేస్తున్నారు.. పాఠశాలలకు వెళ్లి చూడటం లేదా’’ అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం అమలు, కిచెన్ షెడ్ల నిర్మాణంలో జాప్యం తదితర వాటిపై సాక్షి ఇటీవల సమరసాక్షి శీర్షికన ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక డీఈఓ, డిప్యూటీ డీఈఓలు నీళ్లు నమిలారు.
ఈ నెలలో ఎన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.. భోజనం నాణ్యత బాగుందా.. ఏఏ లోపాలు గుర్తించారు.. వాటిపై డీఈఓకు రిపోర్టులు ఇచ్చారా అనే దానిపై డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎంఈఓలు ప్రతినెలా కనీసం 20 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలలో ఇంత వరకు పలువురు ఎంఈఓలు నాలుగు, ఐదుసార్లు మాత్రమే తనిఖీ చేసినట్లు చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలో భోజనం నాణ్యత బాగా లేకపోతే ఏజెన్సీకి మెమోలు ఇవ్వండి.. ఇలా మూడు సార్లు మెమోలు ఇచ్చినా మార్పు రాకపోతే సంబంధిత ఏజెన్సీని తొలగించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, ఇతర ఏర్పాట్లపై తాను తనిఖీ చేసి చెబితే తప్ప స్పందించడం లేదని ఎంఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వివరాలతో రిపోర్టులు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనం అంత అధ్వానమా?
Published Sat, Dec 21 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement