గెలుపోటములు సహజం
- పార్టీకి ఆదరణ ఉంది
- కార్యకర్తలూ.. నిరుత్సాహం వద్దు
- మాజీ మంత్రి ధర్మాన
- 9 నియోజవర్గాలపై సమీక్ష
మునగపాక, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, లోపాలను సరిదిద్దుకొని పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, త్రిసభ్యకమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. అనకాపల్లిలో పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా మునగపాక వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ ఉందన్నారు. మోసపూరిత హామీలు, డబ్బు ప్రభావంతో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ రూరల్‌జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైనప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు.
నియోజకవర్గాలవారీ సమీక్ష
అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు. ధర్మాన ప్రసాద్‌రావు, జోగి రమేష్, సాయి రాజులతో కూడిన బృదం పట్టణంలోని న్యూకాలని రోటరీ కల్యాణమండపంలో ఆదివారం గ్రామీణ జిల్లాలోని చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, నర్సిపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు. కార్యకర్తలు, నాయకులతో సమీక్షించారు. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించారు.
సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరావు, గిడ్డ ఈశ్వరి,అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ పార్టీ నాయకులు గండి బాబ్జి, కరణం ధర్మశ్రీ, చెంగల వెంకట్రావు, ప్రగడ నాగేశ్వరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు మళ్ల సంజీవరావు,పిన్నమరాజు వెంకటపతిరాజు(చంటిరాజు),మళ్ల బుల్లిబాబు, పెంటకోట శ్రీనివాసరావు, భీశెట్టి జగన్, టెక్కలి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.