మార్మోగిన జనభేరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనను వినూత్నంగా రూపొందించారు. పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఇక టెక్కలి బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయంగా వైరుధ్యమైన ఈ రెండింటికీ జిల్లా ప్రజలు నీరాజనం పలికారు.
సాధారణంగా పార్టీ అధినేత అంటే ఎక్కడో ఓ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు... తాము దూరం నుంచి చూసి రావాలని అని అంతా అనుకుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా జగన్ నేరుగా ప్రజల వద్దకే వెళ్లిపోయారు. రోడ్‌షోల్లో భాగంగా పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాఫురం మున్సిపాలిటీలను దాదాపుగా చుట్టివచ్చేశారు. అత్యంత ప్రజాదారణ ఉన్న పార్టీ అధినేత ఇలా తమ గడప ముంగిటకే రావడంతో ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
జగన్‌ను చూస్తే చాలని భావించినవారు నేరుగా ఆయన తమ వద్దకే వచ్చారన్న నిజంతో ఉరకలెత్తారు. ఆయన్ని సమీపం నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు, రెండు మాటలు మాట్లాడేందుకు పోటీపడ్డారు. జగన్ కూడా ఒక్కొక్కరినీ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అందర్నీ అబ్బురపరిచింది. ఆయన ప్రసంగాల్లో అన్నట్లుగానే ప్రతి అవ్వను... ప్రతి తాతను... ప్రతి సోదరుడిని... ప్రతి స్నేహితుడినీ పేరుపేరున పలకించారు.
అందరితో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ అజెండాను వారికి వివరించారు. వృద్ధాప్య పింఛన్‌ను రూ.700కుపెంచడం, వికలాంగ పింఛన్‌ను రూ.1,000 చేయడం, డ్వాక్రా రుణాల రద్దు, అందరికీ ఇళ్లు...ఇలా తమ మ్యానిఫెస్టోకు ఆయనే ప్రధాన ప్రచారకర్తగా గడప గడపకు తీసుకువెళ్లారు.ఇక టెక్కలి బహిరంగ సభకు జనం వెల్లువెత్తారు. ఈ సభలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ జిల్లాపై వరాల వర్షం కురిపించారు.
జిల్లాలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల రద్దు చేస్తానని పునరుద్ఘాటించారు. మత్స్యకారులను ఎస్టీలలో, కళింగ కోమట్లను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇచ్ఛాపురంలో రోడ్‌షోలో మాట్లాడుతూ కండ్ర కులస్తులను ఎస్సీలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పా రు. ఈ విధంగా ఓ వైపు సం క్షేమం మరోవైపు సామాజిక న్యాయానికి సమప్రాధాన్యమిస్తూజగన్ జిల్లావాసుల మనసులను గెలుచుకున్నారు.
వ్యూహలకు పదును
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. తద్వారా ప్రత్యర్థి పార్టీలకంటే తాము ఒక అడుగు ముందున్నామని నిరూపించారు. టెక్కలి బహిరంగ సభలో ప్రసంగిస్తూ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి శాంతిల పేర్లను ప్రకటించారు. అదే విధంగా పలాసలో గురువారం ఉదయం జిల్లా పార్టీ ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించారు.
పార్టీ నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, పాలవలస రాజశేఖరం, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, వి.కళావతి, గొర్లె కిరణ్ తదితరులతో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించారు. శుక్రవారం ఉదయం ఇచ్ఛాపురంలో కూడా పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహాలపై మా ట్లాడారు. ప్రధానంగా ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో పార్టీ పనితీరును సమీక్షించారు. పార్టీ ఎన్నికల కార్యాచరణపై జిల్లా పార్టీ నేతలకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించారు. సాధారణ ఎన్నికలకు ముందుగా ప్రాదేశిక ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించారు.
ద్వితీయశ్రేణి నేతలకు కీలకమైన ఈ ప్రాదేశిక ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి నేతలు బాధ్యత తీసుకోవాలని స్పష్టంగా తేల్చిచెప్పారు. ‘వారి ఎన్నికలకు మనం పనిచేస్తేనే... మన ఎన్నికలకు వారు కూడా పనిచేస్తారు. అది మన ధర్మం... బాధ్యత’అని సూటిగా చెప్పారు. తద్వారా పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు, కిందిస్థాయి కార్యకర్తలకు అధినేతగా తానెంత ప్రాధాన్యమిస్తున్నానో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
అదేవిధంగా పార్టీ నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ విధంగా జగన్‌మోహన్‌రెడ్డి తన రెండు రోజుల జిల్లా పర్యటనలో ఓ వైపు ప్రజలతో మమేకమై ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు.
ఆయన ద్విముఖ వ్యూహంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలకు మరింత చేరువైంది. అదే విధంగా ఎన్నికల దిశగా సంస్థాగతంగా బలోపేతమైంది. పార్టీ అధినేత పర్యటన విజయవంతం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల దిశగా కదం తొక్కనున్నాయని స్పష్టమైంది.
కాగా శుక్రవారం కార్యక్రమాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.వి.కృష్ణారావు, పిరియా సాయిరాజ్, జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి, పార్టీ నేతలు నర్తు రామారావు, నర్తు నరేంద్ర, ఎస్.శ్యాం ప్రసాద్‌రెడ్డి, హనుమంతు కిరణ్, దుప్పల రవీంద్ర, కూన మంగమ్మ, బల్లాడ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.