మైలవరం,న్యూస్‌లైన్,విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చినమాటకు కట్టుబడే వ్యక్తి జగన్ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. జయభేరిలో భాగంగా దొమ్మరనంద్యాల నుంచి వేపరాల వరకు శుక్రవారం సాయంత్రం రోడ్‌షో జరిగింది. ఈ సందర్భంగా దొమ్మరనంద్యాల గ్రామ చావిడి దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అధిక శాతం ఉన్న చేనేత కార్మికులను రాబోయే తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. జనతావస్త్రాలను పునరుధ్ధరీకరించి, సబ్సిడీపై చేనేతలకు నూలును అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
నేతన్నల అత్మహత్యలకు అడ్డుకట్ట వేసి అన్నివిధాల ఆదుకుంటామన్నారు. చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను ఇస్తామన్నారు. గతంలో చేనేతలు తీసుకున్న రుణాలు పూర్తిస్తాయిలో రుణమాఫీ కాలేదని బడ్జెట్‌లో రూ. 316 కోట్లు కేటాయించగా అందులో రూ. 96 కోట్లతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ సరిపెట్టిందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. సభలో కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బిరామిరెడ్డి(భూపేష్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేపరాల వరకు రోడ్‌షో జరిగింది.