'పార్టీలో నష్టనివారణ చర్యలు ప్రారంభించాం'
విశాఖ: పార్టీలో నష్ట నివారణ చర్యల ప్రారంభించామని వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి నష్టం కలిగించిన వారిపై పార్టీ పెద్దలు లోతుగా దృష్టిపెట్టారన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ధర్మాన..త్రిసభ్య కమిటీ నివేదికను బట్టే పార్టీకి నష్టం కలిగించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాజధాని విషయంలో తెరచాటు వ్యవహార మంచిది కాదన్నారు. విశాల దృక్పధంతో రాజధాని ప్రాంతం గుర్తించాలన్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాన సూచించారు.
విశాఖ రూరల్‌జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
ప్రస్తుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు.