వైఎస్ జగన్ మీద బురదజల్లే బదులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు, రాజగురువులకు వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి కోరారు. సమైక్యం కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా... సంతకం పెట్టడానికి వైఎస్ జగన్ సిద్ధమని ఆమె ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ లేదా జేఏసీ ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని సూటిగా అడిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో వైఎస్సార్‌సీపీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారని, ఎవరు దొంగలో తేల్చాల్సిన సమయం వచ్చిందని శోభానాగిరెడ్డి అన్నారు. సమైక్యకోసం రాసిన లేఖపై సంతకానికి... చంద్రబాబు, కిరణ్, బొత్స సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీని దెబ్బతీయడానికి ఎవరో కుట్రచేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి ఆలోచిస్తున్నారు... అందుకే దెబ్బతింటున్నారన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా అని నిలదీశారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక సోనియా నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన... చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు. సోనియాతో డీల్ కుదరలేదంటే చంద్రబాబు లేఖను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోమని రామోజీరావు, తోక పత్రికలు ఎందుకు అడగడంలేదన్నారు. సీమాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడే బదులు ఆరుకోట్ల తెలుగు ప్రజలగురించి ఆలోచించాలని హితవు పలికారు. తమని సోనియా వదిలిన బాణాలు అని వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంపశయ్యపై ఉన్నారని గుర్తించాలని శోభానాగిరెడ్డి చురక అంటించారు. సబ్బం హరి వ్యాఖ్యలు బాధించాయి రాష్ట్ర విభజనపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా తామందరినీ బాధించాయని తెలిపారు.
Published Sun, Sep 29 2013 1:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement