
టీడీపీ లేఖ వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘మమ్మల్ని ఎన్నయినా తిట్టండి, ఎన్ని సార్లయినా విమర్శించండి. సమైక్య రాష్ట్రంకోసం సహిస్తాం.. భరిస్తాం. కానీ విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసేందుకు చంద్రబాబు ఏం చేయడానికి సిద్ధమైతే మా నాయకుడు జగన్ కూడా అందుకు సిద్ధమే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బెయిల్ డీల్ అంటూ ఆరోపించడం కాదనీ, చేతనైతే ఆధారాలు చూపించాలని టీడీపీనేత సీఎం రమేష్‌కు శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. వాటిని రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. లేదా తప్పుడు ఆరోపణలు చేశానని ప్రజల ముందు జగన్‌కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడం మానకపోతే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విభజన లేఖ గురించి అడుగుతారనే: తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ప్రజలు, జేఏసీ నేతలు ఎక్కడ అడుగుతారోననే భయంతో... ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు తమ పార్టీపై బురద చల్లుతున్నారని శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన విషయాన్ని పట్టుకొని తాము ఇన్వెస్టిగేషన్ చేశామంటూ ఎల్లోమీడియా శివాలెత్తుతోందని దుయ్యబట్టారు. సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు విజయమ్మ వెళితే... దాన్ని ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారంటూ ఎల్లో ఛానల్‌లో ప్రసారం చేయడం, ఆ తర్వాత టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి అవే ఆరోపణలు గుప్పించడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్న టీడీపీ నేతల తెలివితేటలను అంగీకరిస్తున్నాం. అవే తెలివితేటలను రాష్ట్ర విభజన జరగకుండా ఉపయోగిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు’’ అని ఆమె సూచించారు.