కన్నీటి సంద్రం.. సంగమేశ్వరం
దివంగత ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను సోమవారం కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమమైన సంగమేశ్వరంలో కలిపారు.
కొత్తపల్లి: సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమం సంగమేశ్వరంలో కలిపారు. ఈ కార్యక్రమంతో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మాలాభరణి, భీమరతి, భవనాశి నదులు ఒక్కటై ప్రవహించే కృష్ణానదీ తీరం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోయింది.
సోమవారం ఉదయాన్నే శోభా నాగిరెడ్డి భర్త, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి, కూతుళ్లు అఖిల ప్రియారెడ్డి, నాగమౌనిక రెడ్డి, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, సోదరుడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, సోదరి పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు భూమా నారాయణరెడ్డి, బి.వి.రామిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రం చేరుకున్నారు. ముందుగా ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు విలువింటి విశ్వమూర్తిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది ఒడ్డున శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఉంచి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేశారు.
అనంతరం మూడు ఇంజిన్ బోట్లలో కృష్ణా నదిలో ప్రయాణిస్తూ వేద పండితులు కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతుల మీదుగా శోభా నాగిరెడ్డి అస్థికలను సప్తనదుల సంగమంలో కలిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కొలనుభారతి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేశారు. కార్యక్రమంలో శివపురం సర్పంచ్ సంతోషమ్మ, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్కాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.