గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు.. | Construction Glass Bridge On River Krishna At Sangameswaram Nandyal District | Sakshi
Sakshi News home page

గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు..

Published Sat, Jul 9 2022 1:15 PM | Last Updated on Sat, Jul 9 2022 4:55 PM

Construction Glass Bridge On River Krishna At Sangameswaram Nandyal District - Sakshi

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకసిగలో మరో కలికితురాయి చేరనుంది. పర్యాటక ప్రియులకు గాల్లో తేలుతున్నట్లు..నీటిలో నడయాడుతున్నట్లనిపించేలా.. అద్భుత అనుభూతిని కలిగించే ‘గాజు వంతెన’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎంతో ఎత్తైన ప్రదేశంలో నిర్మించే ఈ గాజువంతెనపై నడుసూ్త..కింద నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు.
చదవండి: అయ్యో.. మొబైల్‌ పోయిందా? ఇలా చేయండి

నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ గాజు వంతెన నిర్మితం కానుంది. రూ.703.68 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కేఏ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై గాజు వంతెనను నిర్మించనున్నారు. 800 మీటర్ల పొడవుతో నేషనల్‌ హైవేస్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది.

దేశంలోనే తొలి రెండు అంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంగమేశ్వరం వద్ద రెండు అంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైళ్లు వెళ్లేందుకు మరో మార్గం నిర్మిస్తారు. పర్యాటకులు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కారిడార్‌తో కూడిన గాజు వంతెన నిర్మిస్తారు.

స్తంభాలు లేని వంతెన
ఏపీలోని సంగమేశ్వరం, తెలంగాణలోని మల్లేశ్వరం తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 90 జతల భారీ కేబుల్స్‌ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్‌ మీడియన్‌ భాగంలో గాజు ప్యానల్‌ కారిడార్‌ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్‌వేస్‌ ఉంటాయి. ఆ చివర, ఈ చివర గాజు ప్యానల్స్‌ ఉంటాయి. వీటి నుంచి దిగువన కృష్ణానది సోయగాలను చూడవచ్చు. గాజువంతెనపై నడుస్తూ నదిలో నడుస్తున్న అనుభూతినీ పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement