లంక ప్రధానిగా రణిల్ ప్రమాణం
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్‌పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు. అధ్యక్షభవనంలో రణిల్‌తో సిరిసేన ప్రమాణం చేయించారు. రణిల్ ప్రధాని కావడం ఇది నాలుగోసారి. రణిల్ ప్రమాణం తర్వాత మిత్రపక్షమైన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీతో కలసి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
దీనిప్రకారం కొత్త రాజ్యాంగాన్ని రచించేందుకు రాజ్యాంగపరిషత్తు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజ్యాంగం ద్వారా మైనారిటీల(తమిళుల సహా), మానవ హక్కులకు రక్షణ కల్పించేందుకు రాజ్యాంగ భరోసా ఇవ్వనున్నారు.