హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణం | Oath of Seven Judges in Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Feb 14 2022 10:49 AM | Updated on Feb 15 2022 3:38 AM

Oath of Seven Judges in Andhra Pradesh High Court - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం చేశారు. నూతన న్యాయమూర్తులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి  కోవింద్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.రవీంద్రబాబు చదివి వినిపించారు.

హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకి రామిరెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌  ఎన్‌.హరినాథ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రాతో కలిసి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లాతో కలిసి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయితో కలిసి జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కలిసి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కలిసి జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కలిసి జస్టిస్‌ వడ్డిబోయన సుజాత కేసులను విచారించారు. హైకోర్టు చరిత్రలో ఏడు ధర్మాసనాలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఆ తరువాత నూతన న్యాయమూర్తులను న్యాయవాదులు అభినందించారు. ఈ ఏడుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కి చేరింది. త్వరలో మరిన్ని నియామకాలు జరిగే అవకాశం ఉంది.

జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి
1966 జూన్‌ 3న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ఇటీవలి వరకు ఆ పోస్టులో కొనసాగారు.

జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
1967 జూలై 1న జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు,  ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్‌ పూర్తి చేశారు. హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌
1964 మే 28న జన్మించారు. ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా, నాగార్జున వర్సిటీ నుంచి మాస్టర్‌ లా పొందారు. సుప్రీం కోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా, రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్‌ ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు.

జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు
1967 ఆగస్టు 3న జన్మించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎల్‌ చదివారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ చేశారు.

జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి
1970 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివారు. తొలుత తాడేపల్లిగూడెంలో, 1997లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

జస్టిస్‌ రవి చీమలపాటి
1967 డిసెంబర్‌ 4న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. పంచాయతీరాజ్‌ శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు.

జస్టిస్‌ వడ్డిబోయన సుజాత
1966 సెప్టెంబర్‌ 10న జన్మించారు. ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌), ఎంఏ (సైకాలజీ), ఎల్‌ఎల్‌ఎం చదివారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు ప్యానెల్‌ అడ్వొకేట్‌గా, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.  

చదవండి: (ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement