ఎనిమిది నెలల తరువాత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సచివాలయంలోకి ఆదివారం అడుగు పెట్టారు. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు. ఐదు సరికొత్త పథకాలకు సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తక్కువ ధరకే ఉద్ది, కందిపప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టారు. సచివాలయంలోకి అడుగు పెట్టిన జయకు పూలవర్షంతో ఆహ్వానం లభించింది.
సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి నిర్దోషిగా జయలలిత బయట పడ్డ విషయం తెలిసిందే. తమ అమ్మకు మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించేందుకు అన్నాడీఎంకే శాసన సభా పక్షం నిర్ణయించింది. ఆ మేరకు శనివారం మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన వేడుకలో ఐదో సారిగా తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా 28 మంది మంత్రులకు గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుక అనంతరం సచివాలయంకు జయలలిత వెళ్తారని సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆమె నేరుగా పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. సర్వం సిద్ధం చేసిన సచివాలయం వర్గాలు ఆమె రాక కోసం ఎదురు చూశాయి. ఆదివారం సెలవు దినమైనా జయలలిత బాధ్యతలు స్వీకరించేందుకు తప్పకుండా వస్తారని భావించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.
బాధ్యతల స్వీకరణ : సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయంకు జయలలిత రానున్న సమాచారం, అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. అమ్మ విధేయులు ముందస్తుగా ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి సచివాలయంకు బయలు దేరిన జయలలితకు దారి పొడవునా పార్టీ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద ఆమె కాన్వాయ్‌పై పుష్పపు జల్లులు కురిపిస్తూ ఆహ్వానం పలికారు. సరిగ్గా మూడు గంటలకు సచివాలయంలోకి అడుగు పెట్టిన జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ పుష్ప గుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. నేరుగా తన చాంబర్‌లోకి అడుగు పెట్టగానే, ఎదురుగా ఉన్న దివంగత నేతలు ఎంజీయార్, అన్నా చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం తన సీటులో ఆశీనులయ్యారు. అదే సమయానికి 28 మంది మంత్రులూ తమ తమ చాంబర్లలో బాధ్యతల్ని స్వీకరించారు. ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర అధికారులు వారికి పుష్పగుచ్ఛాలను అందజేసి ఆహ్వానం పలికారు.
ఐదు సంతకాలు
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్ కొన్ని ఫైల్స్‌ను అందజేశారు. ఐదు ఫైల్స్‌పై తొలుత జయలలిత సంతకాలు చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పోలీసు అధికారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. సరిగ్గా నాలుగు గంటలకు సచివాలయం నుంచి తన నివాసం పోయెస్ గార్డెన్‌కు జయలలిత బయలు దేరి వెళ్లారు. తదుపరి జయలలిత సంతకాలు చేసిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికార వర్గాలు మీడియాకు విడుదల చేశాయి.
ఐదు పథకాలు
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పథకానికి జయలలిత సంతకం చేశారు. అలాగే పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కళను సాకారం చేయడం లక్ష్యంగా పట్ణణ గృహ నిర్మాణ పథకానికి సంతకం చేశారు.1274 తాగునీటి పథకాలకు, పేద మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటుగా కుటుంబ పెద్దలుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెడుతు సంతకం చేశారు.
అమ్మ క్యాంటీన్లు
నిర్మాణాలు పూర్తై రాష్ట్రంలో వందలాది అమ్మ క్యాంటీన్లు ప్రారంభానికి నోచుకోని విషయం తెలిసిందే. జయలలిత రాకతో ఆ క్యాంటీన్ల తలుపులు తెరచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయలలిత ప్రారంభించారు. ఇక, పెరుగుతున్న పప్పు దినుసుల ధరల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు చేపట్టింది. కుటుంబ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో చౌక ధరకే ఉద్ది, కంది పప్పు లభించనున్నది. ఇందుకు తగ్గ పథకానికి జయలలిత శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా కిలో కంది పప్పు *53.5, అర కిలో ఏ గ్రేడ్ ఉద్ది పప్పు *56, బి గ్రేడ్ *49.5కు విక్రయించనున్నారు. ఎనిమిది నెలల అనంతరం జయలలిత సచివాలయంలోకి అడుగు పెట్టి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఓ వైపు ఉంటే, మరో వైపు ఆమె రాకతో సచివాలయం పరిసరాల్లో సందడి వాతావరణం ఆదివారం సెలవుదినం రోజున కూడా నెలకొనడం విశేషం.
బాధ్యతల స్వీకరణ
Published Mon, May 25 2015 2:45 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement
Advertisement