
19 లేదా 23 నుంచి ఏపీ అసెంబ్లీ భేటీ
* ముహూర్తంపై టీడీపీ మల్లగుల్లాలు
* ఎన్నికల ఫలితాలు వచ్చి ఈ 16కు నెల పూర్తి
* ఈ లోగా ఆంధ్రా అసెంబ్లీ సమావేశం లేనట్లే
* 12వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ భేటీ!
* ఆ తర్వాత రెండు రోజులు సెలవు దినాలు
* 16 లేదా 23 తేదీల్లో ముహూర్తం నిర్ణయం
* ప్రొటెం స్పీకర్ ఎంపికపై టీడీపీ నేతల చర్చ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలపై అధికార తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడం, పైగా విభజనానంతర అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు కావడంతో మంచి ముహూర్తాల కోసం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం తెలిసిందే. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణాల కోసం కూడా టీడీపీ నేతలు పండితులతో చర్చించి ముహూర్తాన్ని నిర్ణయించారు.
8వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రమాణం చేయాలని ముందు నిర్ణయించినా దాన్ని తరువాత అదే రోజు సాయంత్రానికి మార్చారు. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ తొలి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు గత నెల 16వ తేదీనే వెలువడినా రాష్ట్ర విభజనకు సంబంధించి అపాయింటెడ్ డే జూన్ రెండో తేదీ వరకు ఉండడంతో ఎమ్మెల్యేల ప్రమాణాలకు వీలు లేకుండాపోయింది. ఆ తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తం 8వ తేదీగా నిర్ణయించడంతో సభ్యుల ప్రమాణాలకు మరిన్ని రోజులు ఆగక తప్పడం లేదు. ఈ నెల 16వ తేదీ నాటికి ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తవుతాయి. ఆలోగా ప్రమాణాలు చేయడానికి టీడీపీ నేతలకు సరైన ముహూర్తాలు కుదరడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 9న ప్రారంభమై 12వ తేదీ వరకు జరగనుంది. ఈ తేదీల్లో ఏపీ అసెంబ్లీనీ సమావేశపరిస్తే రెండు ప్రాంతాల సభ్యులు, మంత్రులు ఒకేసారి రావడం, ఇప్పుడున్న వసతులు అరకొరగా ఉండడంతో గందరగోళ పరిస్థితులు తలె త్తనున్నాయి.
14, 15 తేదీలు సెలవు దినాలు. దీంతో 16వ తేదీ తరువాతే ఏపీ అసెంబ్లీని సమావేశపర్చే వీలుంది. ఈ రోజుల్లో మంచి ముహూర్తాలు ఏమున్నాయా? అని అధికార టీడీపీ సీనియర్ నేతలు పండితులతో చర్చిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ చవితి కావడం, 17వ తేదీ తిథి పంచమి అయినా ఆ రోజు మంగళవారం కావడంతో అదీ సమావేశాలకు పనికిరాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు కలసిన సమయంలోనూ అసెంబ్లీ సమావేశాల తేదీలపై ప్రస్తావన వచ్చింది. 15, 16, 17 తేదీల్లో తనకు వేరే షెడ్యూల్ కార్యక్రమాలున్నాయని, ఆ తరువాత తేదీల్లో సమావేశం పెట్టుకోవాలని బాబుకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు తదుపరి ముహూర్తాలపై దృష్టి సారించారు. 19న సప్తమి మంచి ముహూర్తమని, అది కాదనుకుంటే 23వ తేదీ ఏకాదశి ఉంది కనుక ఆ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున అసెంబ్లీని సమావేశపరిస్తే మంచిదని పండితులు టీడీపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతున్నందున ఈ లోగానే అసెంబ్లీని సమావేశపరిచాలని భావిస్తున్నారు.
ప్రొటెం స్పీకర్ ఎవరో..!
అసెంబ్లీలో సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్నది టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత సభకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తుంటారు. ప్రస్తుత సభలో కె.ఇ.కృష్ణమూర్తి (డోన్), పతివాడ నారాయణస్వామినాయుడు (నెలిమర్ల)లు ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. వీరిద్దరూ చంద్రబాబు కేబినెట్లో బెర్తులను ఆశిస్తున్నారు.
ఈ ఇద్దరిలో మంత్రిపదవికి అవకాశం లేని వారిని ప్రొటెం స్పీకర్‌గా చేయనున్నారు. ఒకవేళ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు దక్కితే కనుక వేరొకరిని ఎంపికచేయాలి. ఈ ఇద్దరి తరువాత ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులు ఉన్నారు. వీరూ కేబినెట్ పదవులను కోరుకుంటుండటంతో ఎవరిని ఎంపికచేస్తారన్నది సందిగ్ధంగా మారింది. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనందున ఆయనను ప్రొటెం స్పీకర్ చేయవచ ్చని చెప్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని ఎంపికచేయనున్నారో ముందుగా తనకు సమాచారం ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ టీడీపీ నేతలకు సూచించారు.