నవశకం | sworn in 'West' MLAs in assembly | Sakshi
Sakshi News home page

నవశకం

Published Fri, Jun 20 2014 1:09 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

నవశకం - Sakshi

నవశకం

- శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ‘పశ్చిమ’ ఎమ్మెల్యేలు
- ఇక జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి
- స్థానిక సంస్థల విజేతల పదవీ స్వీకారానికి మార్గం సుమగం
- గాడిన పడనున్న పాలన

సాక్షి, ఏలూరు : నవశకం మొదలైంది. కొత్త రా ష్ట్రంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ హాల్‌లో గురువారం ప్రమా ణ  స్వీకారం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ), చింతలపూడి ఎమ్మెల్యే, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై వెంటనే దృష్టి సారించనున్నట్టు వీరంతా ముక్తకంఠంతో చెప్పారు.
 
ఇక వీళ్ల వంతు
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది. వీరంతా బాధ్యతలు చేపడితే ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన జిల్లా అభివృద్ధి గాడిన పడుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. 2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక, నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి.

జిల్లాలోని 865 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. మే 12న పురపాలక, 13న పరిషత్ ఫలితాలు వెలువడ్డాయి. నెలలు గడుస్తున్నా పాలకవర్గాలు పగ్గాలు చేపట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా నెలల తరబడి ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు.

ఈ పరిస్థితుల్లో పాలన గాడినపడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న చేపట్టి ఫలితాలను ప్రకటించారు. 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టాలని మందుగా నిర్ణయించారు. మునిసిపల్ కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంది. గత శాసనసభ రద్దు కావడంతో కొత్త సభ్యులు వస్తే తప్ప మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం లేకుండా పోరుుంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడంతో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు మార్గం ఏర్పడింది.
 
గాడిన పడనున్న పాలన
పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు సైతం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్లుగా మండలాలకు నిధులు విడుదలకాకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పాలకవర్గం ఏర్పడితే జనాభా ప్రాతిపదికన ప్రతి మండలానికి సాధారణ నిధులు రూ.40 లక్షల వరకూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో 75శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో 25 శాతం వాటా నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు.

ఇదిలావుండగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఏర్పడింది. శాసనసభ సమావేశాలు ముగియగానే జిల్లాకు రానున్న ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ముందుగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించనున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు త్వరితగతిన తీసుకురావాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement