
సమాయత్తం
నేడు అన్నాడీఎంకే సమావేశం
23న సీఎంగా జయ పదవీ స్వీకారం
భారీ భద్రతా ఏర్పాట్లు
టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కొన్ని నెలల అనంతరం మళ్లీ ప్రజల్లోకి జయ రానున్నందున అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు రాయపేటలోగల అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ అన్నాడిఎంకే పార్టీ అధ్యక్షురాలిగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 23వ తేదీ ఐదవ సారిగా జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆ రోజు ఉదయం 11 గంటలకు మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలులో జరుగనుంది. గవర్నర్ రోశయ్య, జయలలితతో పదవీ ప్రమాణం చేయించనున్నారు. జయ తర్వాత 32 మంది మంత్రులు పదవులు చేపట్టనున్నారు. జయలలిత పదవిని చేపట్టి మళ్లీ జార్జి కోటకు చేరుకోనున్నారు.
ఆ సమయంలో జయలలితను స్వాగతించేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడు నెలలుగా మూతబడిన సీఎం చాంబర్ కొత్త హంగులు సంతరించుకోనుంది. జార్జి కోట ప్రాంగణంలోగల భవనాలు, రోడ్లను ఆధునీకరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశం జరిగే హాలుతో సహా భవనాలను రంగులతో తీర్చిదిద్దనున్నారు. జయకు స్వాగతం పలికే విధంగా కోట వెలుపలి భాగాన భారీ ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటుచేస్తున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్ రోడ్డు మీదుగా కోటకు వెళ్లే రోడ్డు ఆధునీకరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల నలుపు, తెలుపు రంగులను పెయింట్ చేస్తున్నారు. జయను స్వాగతిస్తూ పోయెస్ గార్డెన్ నుంచి కోట వరకు చైతన్య శీర్షికలతో కూడిన రంగు రంగుల బ్యానర్లు, తోరణాలు, పార్టీ జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవం జరిగే మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలు చుట్టుప్రక్కల బ్యానర్లు ఏర్పాటవుతున్నాయి.
మౌంట్‌రోడ్డుకు ముస్తాబు: జయ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రోశయ్యను కలిసి సైదాపేట, నందనం, తేనాంపేట, థౌజండ్ లైట్స్ మీదుగా మౌంట్‌రోడ్‌కు చేరుకోనున్నారు. మార్గ మధ్యంలోగల ఎంజిఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయలలిత ఏడు నెలల తర్వాత శుక్రవారం మళ్లీ ప్రజలను కలుసుకోనున్నారు. దీంతో ఆమె రానున్న మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని స్వాగతం తెలుపనున్నారు. తమ అమ్మ జయను కనులారా తిలకించి తరించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లలో బిజీగా వున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా జరుపుతున్నారు.