సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢమాసం నేటి (గురువారం) నుంచి ప్రారంభం అయ్యిందది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాఢమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఈ మాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పనిచేయడం పరిపాటి. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు.
ప్రస్తుతం రకరకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్నిచోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు.
పండుగలకు ప్రత్యేకం ఆషాఢం
పండుగలకు ఆషాఢం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వచ్చేనెల 10వ తేదీన శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), 12వ తేదీన గురుపౌర్ణమి (ఆషాడ పౌర్ణమి) పండుగలు రానున్నాయి. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాఢ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment