అందాల అరుణోదయం
ఇంటింటా గోరింట పంట
ఆషాఢమాసంలో సందడే సందడి
పూర్వ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మహిళలు, విద్యార్థినులు
విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు, గ్రామాల్లో ప్రత్యేక సంబరాలు
సాక్షి, అనకాపల్లి : తెలుగు లోగిళ్లలో పండుగ అయినా, పబ్బమైనా అమ్మాయిల చేతులు, కాళ్లకు గోరింటాకు తప్పనిసరి. పెళ్లికాని యువతి చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని..గర్భిణుల అరచేతులు ఎర్రగా మారితే కట్టుకున్నవాడికి చాలా ప్రేమ ఉన్నట్టు అని చమత్కరిస్తారు. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి సంబరంగా గోరింటాకు నూరి చేతుల నిండా పెట్టుకుంటూ కబుర్లు చెబుతూ తెగ సందడి చేస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే రుతువు మారిన వేళ కాళ్లు, చేతులు, గోళ్లు శుభ్రపడతాయని, రోగ నిరోధకంగా పనిచేయడంతో అంటువ్యాధులను కూడా దూరం చేస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ ఆషాఢంలో మహిళలు, యువతులు, చిన్నారులు, విద్యార్థినుల చేతులు గోరింటాకుతో కళకళలాడుతున్నాయి. ఒకరికొకరు పోటీపడి మరీ గోరింటాకు పెట్టుకుంటున్నారు. విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు, గ్రామాల్లో ప్రత్యేక సంబరాలే జరుగుతున్నాయి.
సంప్రదాయం...ప్రకృతి హితం
ప్రకృతి హితమైన గోరింటాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీష్మ రుతువు చివర వర్ష రుతువు ప్రారంభానికి మధ్యలో ఆషాఢం వస్తుంది. ఈ సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది. ఈ కారణంగా గోరింటాకును అరచేతుల్లో ధరిస్తే శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. చర్మ సమస్యలు కూడా దరిచేరవు. ఎన్నో ఔషధ లక్షణాలు గల ఈ గోరింటాకు అతివలకు అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. గోరింటాకు చేతులు, పాదాలకు పెట్టుకుంటే శరీరంలోని వేడిని, వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు ఇది మందులా పనిచేస్తుంది. సెగ గెడ్డలు వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఈ ఆకు నూరి పెట్టుకుంటే అవి పగిలిపోతాయి. పుండు త్వరగా మానిపోతుంది. తలకు కూడా ఈ పేస్టు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోరింటా పండింది..!
‘గోరింట పూసింది కొమ్మ లేకుండా..మురిపాల అరచేత మొగ్గ తొడిగింది’.. అన్నాడో సినీ కవి. ఆషాఢం వచ్చిందంటే చాలు..గొరింటాకు గుర్తుకొస్తుంది. అతివలు అరచేతికి గోరింట పెట్టుకుని మురిసిపోతుంటారు. కుటుంబాలు కలివిడిగా ఉంటూ, బంధాలు బలోపేతం చేసుకునే వేడుకగా దీన్ని పూర్వీకులు నిర్వచిస్తారు. తెలుగు సంప్రదాయంలో భాగమైన ఈ వేడుకలో ఆరోగ్య సూత్రాలెన్నో దాగి ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న గోరింటాకు వేడుకలు గ్రామీణ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment