నల్లగొండ రూరల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడానికితోడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఇది ఎడారి జాతికి చెందిన పంట కావడంతో నీటి అవసరం పెద్దగా ఉండదు. ఏడాది పొడవునా 50 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుంది.
కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్.. బీడు భూములు, గుట్టల ప్రాంతాల్లో బ్రహ్మజముడు పండు తరహాలోనే పండుతుంది. ఈ పంట థాయ్‌లాండ్ దేశంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం మిర్యాలగూడ సమీపంలోని మొల్కపట్నంకు చెందిన కొంపల్లి యాదగిరి అనే వ్యాపారి కోల్‌కతా నుంచి మొక్కలు తెచ్చి సాగు చేశాడు. ఆ తర్వాత ఒకరిని చూసి మరొకరు డ్రాగన్ సాగుబాట పట్టారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 53ఎకరాలు, భువనగిరి యాదాద్రి జిల్లాలో 15ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4 ఎకరాల చొప్పున మొత్తం 72 ఎకరాల్లో 33 మంది రైతులు ఈ తోటలను సాగు చేస్తున్నారు.
(చదవండి: నిమ్మకాయలు, నల్లకోడి కోసి తవ్వకాలు.. పక్కా సమాచారంతో..)
ఒకసారి నాటితే 30ఏళ్ల వరకు దిగుబడి..
నీరు నిలిచే బంకనేలలు మినహా అన్ని భూములు ఈ పంటకు అనుకూలమే. నాటిన ఆరునెలల్లో పంట చేతికొస్తుందని సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. ప్రతి ఏడాది జూన్ మొదటి వారం నుంచి డిసెంబర్‌కు దిగుబడి వస్తుంది. సస్యరక్షణ చర్యలు చేపడితే 6టన్నుల నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని, ఒకసారి మొక్కలు నాటితే 30ఏళ్లపాటు తోట దిగుబడినిస్తుందని నిపుణులు అంటున్నారు.
పోషక విలువలు మెండు..
పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లు కావడంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఈ పండ్లకు యమ గిరాకీ ఉంటోంది. ప్రస్తుతం మార్కెట్‌లో వైట్, పింక్ రంగుల్లోడ్రాగన్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తున్నాయి. కొందరు రైతులు డ్రాగన్ ఫ్రుట్ క్షేత్రాల వద్దనే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కిలో రూ.200–250 ధర ఉండగా టన్ను ధర గరిష్టంగా రూ.2లక్షల వరకు పలుకుతోంది.
(చదవండి: ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు)
సాగు విధానం ఇలా..
డ్రాగన్ ఫ్రూట్ సాగులో 15రోజులకు ఒకసారి తేలికపాటి నీటిని అందించాలి. పూత సమయంలో చీమలు తినకుండా మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడిపై ప్రభావం పడకుండా మునుగ, కరివేపాకుతోపాటు నీడనిచ్చే అంతరపంటలను సాగు చేస్తే చాలు మేలు. ఎకరానికి 400 కడీలను పాతి వాటి పైభాగంలో రింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒక కడీకి తూర్పు, పడమర వైపు రెండేసి మొక్కలు నాటుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడితే అధిక దిగుబడులు రావడంతోపాటు పండ్లు రుచికరంగా ఉంటాయి. ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే రూ.6లక్షల ఖర్చు అవుతుంది. దిగుబడి వచ్చాక అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.6లక్షల ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు.
నల్లగొండ సమీపంలో సాగుచేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట
డ్రాగన్ ఫ్రూట్‌తో భలే ఆదాయం
రెండేళ్ల క్రితం నా కుమార్తె డెంగీ బారిన పడినప్పుడు డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని చెప్పారు. మార్కెట్‌లో ఈ పండ్లకు ఉన్న డిమాండ్‌ను చూసి అప్పుడే ఈ తోట పెట్టాలని నిర్ణయించుకున్నాను. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట నాకున్న 5ఎకరాల భూమిలో పూర్తిస్థాయిలో సేంద్రియ పద్ధతిలో ఎకరాకు రూ.6లక్షల పెట్టుబడి పెట్టి తోట సాగు చేశాను. ఆరునెలల్లోనే పంట చేతికొచ్చింది. ప్రస్తుతం రోజూ 4–5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు అన్ని ఖర్చులుపోను రూ.6లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది.
– తండు సైదులుగౌడ్, డ్రాగన్ ఫ్రూట్ రైతు
Comments
Please login to add a commentAdd a comment