తోటవద్ద విక్రయానికి సిద్ధంగా డ్రాగన్ ఫ్రూట్స్
సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో అన్నదాతలు ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు, మెలకువలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘ కాలిక లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్‌ను సైతం సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం, లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై దృష్టి సారించారు.
సాక్షి, నంద్యాల(ఆళ్లగడ్డ): జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడంతో పాటు మంచి గిరాకీ ఉండటంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. విదేశీ పండుగా చెప్పుకునే డ్రాగన్ ఫ్రూట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి సారి ఆళ్లగడ్డ మండలం పెద్ద ఎమ్మనూరులో 2018 –19లో సాగైంది. అనంతరం చాగలమర్రి, ఉయ్యలవాడ మండలాల్లోని కొందరు రైతలు అటువైపు దృష్టి మళ్లించారు. రైతుల ఆసక్తిని, పంట దిగుబడి ఆదాయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2021 –22లో డ్రాగన్ ఫ్రూట్‌ను వాణిజ్య పంటగా గుర్తించింది. అలాగే ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఉద్యానశాఖల సంయుక్తంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు మూడేళ్ల పాటు నిర్వహణకు రాయితీలు అందిస్తోంది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 80 ఎకరాల్లో డ్రాగన్ సాగవుతోంది.
అన్ని నేలలూ అనుకూలమే..
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని భూములు అనుకూలమే. మెట్ట ప్రాంత భూముల్లో డ్రాగన్ మొక్క బాగా పెరగడంతో పాటు పండ్ల సైజు, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. నీటి ఎద్దడిని సైతం సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడులను ఇస్తుంది.
ఆళ్లగడ్డ మండలం శాంతినగరంలో సాగైన డ్రాగన్ ఫ్రూట్
30 ఏళ్ల వరకు దిగుబడి ..
డ్రాగన్ మొక్కలు నర్సరీలో నాలుగు నుంచి ఐదు నెలలు పెంచి ఆ తర్వాత పొలంలో నాటుకోవాలి. నాటిన 9వ నెల నుంచి ఏడాదిలోపు మొదటి పంట చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు ఏడాదికి మూడు కాపుల చొప్పున 30 ఏళ్లు దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి నిర్వహణ ఖర్చులు వస్తాయి. దిగుబడి మాత్రం ఏటేటా పెరుగుతుంది.
సాగు ఇలా..
ఎకరం మెట్ట భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రస్తుత ధరలను అనుసరించి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 400 నుంచి 600 వందల సిమెంట్ స్తంభాలు అవసరం. ఇందులో 2 వేల నుంచి 2,200 మొక్కల వరకు నాటుకోవచ్చు. తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంట్ స్తంభాలు, రింగులు, కంచె తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొదటి ఏడాది ఒక్కో చెట్టు సుమారు 10 నుంచి 20 పండ్లు కాస్తుంది. తర్వాత మూడేళ్ల నుంచి ఒక్కో చెట్టు 80 నుంచి 150 పండ్లు కాస్తుంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయం పోనూ ఎకరాకు ఏడాదికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు
ఎకరాకు రూ.6 లక్షల రాయితీ..
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో రైతుకు మూడేళ్లకు రూ.6 లక్షలు ఇస్తారు. ఈ మొత్తంలో నర్సరీ నుంచి మొక్కలు తెప్పించి, కూలీలతో గుంతలు తీయించి వారే నాటిస్తారు. డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. ఎరువులు, కలుపు, సంరక్షణ ఖర్చులు ఇస్తారు. సిమెంట్ స్తంభాలు అందజేస్తారు. ప్రస్తుతం ఖర్చు ఎక్కువగా ఉండటంతో రైతుకు అర ఎకరా వరకే రాయితీ ఇవ్వనున్నారు.
పుష్కలంగా ఔషధ గుణాలు
డ్రాగన్ ఫ్రూట్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పోషక విలువలు, విటమిన్ – సి, విటమిన్ – బి3తో ఐరన్, మెగ్నీషియంలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి, రక్త పోటు నియంత్రణలో కూడా బాగా ఉపయోపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
మార్కెట్‌లో మంచి గిరాకీ
ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. కరోనా సమయంలో వ్యాధినిరోధక శక్తి పెంపొందాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పడంతో ప్రజలు అందరూ ఈ పండు తినేందుకు ఆసక్తి పెంచుకున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌కే పరిమితమైన ఈ పండు.. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో తోపుడు బండ్లపై కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకే వచ్చి వినియోగ దారులు కిలో రూ.200 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా సాగు చేశా
ఏ పంటలు వేసినా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలని నిర్ణయించుకున్నాం. యూట్యూబ్ చూసి ఎలా చేపట్టాలో తెలుసుకున్నాం. మొక్కలు తెచ్చుకుని 2019లో నాటాం. మొదటి ఏడాది కాపు వచ్చే వరకు సుమారు రూ.5.5 లక్షల ఖర్చు వచ్చింది. మొదటి కాపు పెద్దగా రాలేదు. రెండో కాపు సుమారు నాలుగు క్వింటాళ్లు వచ్చింది. మూడో సంవత్సరం 8 టన్నులు వచ్చింది. కిలో రూ.200 లెక్కన విక్రయించడంతో రూ.16 లక్షల వచ్చింది. ఇక్కడే పొలం వద్ద విక్రయించడంతో రవాణా ఖర్చు మిగిలిపోయింది. ఈ ఏడాది 10 నుంచి 12 టన్నులకు పైగానే దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. కిలో రూ.150 ప్రకారం అమ్మినా ఎకరాకు రూ.18 లక్షలు వస్తుంది. అందుకే ఈ ఏడాది మరో రెండు ఎకరాల్లో నాటేందుకు నర్సరీలో మొక్కలు పెంచుకుంటున్నాం. – రావూరి ఆంజనేయులు, రైతు, శాంతినగరం, ఆళ్లగడ్డ మండలం
ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేశా
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఆదాయం వస్తుందని చెప్పుకుంటుంటే సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. ముందు మన ప్రాంతంలో పండుతాయో లేదో తెలుసుకునేందుకు బత్తలూరు వద్ద సాగుచేసిన తోటకు వెళ్లి రైతుతో మాట్లాడాను. అంత పెట్టుబడి పెట్టడం ఎలా అని ఆలోచిస్తుంటే ఉపాధి పథకం వాళ్లు సబ్సిడీ ఇస్తామంటే అర ఎకరంలో గత ఏడాది మొక్కలు నాటాను. మొక్కలు బాగా పెరిగాయి. ఇప్పటికి రెండు కోతలు వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడ లేదు. మూడో ఏడాది ఖర్చులు పోనూ సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నాం.
– సుధాకర్, రైతు, పెద్ద ఎమ్మనూరు, ఉయ్యలవాడ మండలం
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం రాయితీలు అందిస్తూ వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ పంటను ఉపాధి హామీ పథకంలో సాగు చేపట్టేవిధంగా 2021–22 నుంచి ప్రభుతం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్న రైతులకు అర ఎకరా వరకు సాగు చేపడితే విడతలవారీగా మూడేళ్లకు రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. ఈ ఏడాది 10 మంది రైతులు నాటుకున్నారు. మరో 160 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరింత మంది సద్వినియోగం చేసుకోవాలి.
– పి.రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment