పచ్చి మిరప పరమ శ్రేష్ఠం | Green Chili Is Very Good For Health | Sakshi
Sakshi News home page

పచ్చి మిరప పరమ శ్రేష్ఠం

Published Sat, Nov 30 2019 4:06 AM | Last Updated on Sat, Nov 30 2019 4:06 AM

Green Chili Is Very Good For Health - Sakshi

ఆహారపు వర్గీకరణలో ఆయుర్వేదం షడ్రసాలకు (మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త కషాయ రుచులు) ప్రాధాన్యతనిచ్చింది. ‘కటు’ అంటే ‘కారం/ఘాటు’ అని అర్థం. భారతీయ వైద్యమైన ఆయుర్వేద కాలంలో కారానికి వాడుకునే ఏకైక ప్రధాన ద్రవ్యం ‘మిరియాలు’(మరిచ).

పచ్చిమిరప చరిత్ర: 16 వ శతాబ్దంలో పచ్చి మిరపను పోర్చుగీసువారు ఆసియా ఖండానికి అందించారు. అనంతరం వాస్కోడగామా మన దేశానికి తెలియచెప్పారు. కనుక ఆ కాలంలో వెలసిన ఆయుర్వేద గ్రంథమైన ‘యోగరత్నాకరం’ లో ‘క్షుపజమరిచ’ అనే పేరులో దీనిని పేర్కొన్నారు. అటుపిమ్మట దీనికే ‘కటుబీర’ అనే పేరు కూడా వచ్చింది. పచ్చి మిరప ఆకారంలోనూ, పరిమాణంలోనూ, ఘాటు తీవ్రతలోనూ రకరకాల తేడాలుంటాయి.

ఆధునిక శాస్త్ర విశ్లేషణ:
పోషక విలువలు: వంద గ్రాముల పచ్చిమిరపలో 40 కేలరీలు, 3 శాతం పిండి పదార్థాలు, 3 శాతం ప్రొటీన్లు, అత్యధికంగా నీటి శాతం, 6 శాతం ఆహారపు పీచు ఉంటాయి. కొలెస్టరాల్‌ వంటి కొవ్వులు శూన్యం. ‘విటమిన్‌ – ఎ’ 19 శాతం, ‘సి’ 239 శాతం ఉంటాయి. ‘ఇ’,  ‘కె’ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ‘బి – 6’ 25 శాతం ఉంటుంది. డి విటమిన్‌ ఉండదు. సోడియం 9 మిల్లీ గ్రాములు, పొటాషియం 322 మి.గ్రా. ఉంటాయి. కాల్షియం ఒక శాతం, ఐరన్, మెగ్నీషియాలు ఐదేసి శాతం ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు: యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, బీటాకెరోటిన్, ఎండార్ఫిన్లు, కెప్‌సైసిస్‌ వంటి జీవరసాయనాలు పుష్కలంగా ఉండటం వలన, అనేక వ్యాధులను పోగొట్టడానికి, వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తుంది.

►ప్రధానంగా రక్తప్రసరణని ధారళం చేస్తుంది, వయాగ్రాల కంటె మిన్నగా కామోత్తేజకంగా పనిచేస్తుంది. కంటిచూపును, చర్మకాంతిని వృద్ధి పరుస్తుంది. పొడి చర్మానికి విరుగుడైన జిడ్డు కలిగిస్తుంది, కనుక మొటిమల (పింపుల్స్‌) సమస్య ఉన్న వారికిది మంచిది కాదు.
►మెటబాలిజాన్ని అధికం చేసి, కొవ్వుని కరిగించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది
►హైబీపీ, డయాబెటిస్, కేన్సరు వ్యాధులను అదుపు చేస్తుంది
►గుండె జబ్బుల నివారణకు మంచిది
►పురుషులలోని ప్రోస్టేటు సమస్యలో ప్రయోజనకారి
►జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
►జలుబు, సైనసైటిస్‌లకు మంచిది.

గమనిక: పచ్చిమిరప పండు మిర్చిగా మారుతుంది. ఎండబెడితే ద్రవాంశ ఇగిరిపోయి, ఎండుమిర్చిగా మారుతుంది. నీరు లేకపోవడం వలన ఎండు మిర్చి లేదా దాని పొడి శరీరంలోని మ్యూకస్‌ పొరలను దహించివేసి అల్సర్స్‌ కలుగచేసే ప్రమాదం ఉంది. అందువలన  పచ్చి మిర్చిని వాడటమే శ్రేష్ఠం. సాధారణంగా దీనిని అధికంగా సేవించేవారు ఉప్పు సంపర్కంతోటే తింటుంటారు. అది మంచిది కాదు. సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గించి పచ్చిమిర్చిని వాడటం శ్రేష్ఠం. నిమ్మరసాన్ని జోడిస్తే ఉప్పు అవసరం ఉండదు.

వాడుకునే ప్రక్రియలు
నిమ్మరసంలో నామమాత్రంగా ఉప్పు, కొంచెం వాము, ఇంగువ కలిపి అందులో కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి గంటసేపు ఉంచితే చక్కటి రుచి పుడుతుంది. అన్నంలోకి, రొట్టెలలోకి నంజుకుందుకు వాడుకోవచ్చు. రెండు రోజుల వరకు పాడవదు. మిరపకాయలను ముక్కలు చేయకుండానే ‘నరుకు’ పెట్టి, గింజలు తీసేసి, అందులో నువ్వుల పొడిని (పల్లీల పొడి లేక పుట్నాల పప్పు పొడి కూడా వాడుకోవచ్చు) నింపి, ఆవిరి మీద ఉడికించి, దానిపై ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం కలిపి, నంజుకుందుకు వాడితే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రుచి అద్భుతంగా ఉంటుంది. పండుమిర్చి పచ్చడి తినాలంటే నెయ్యి లేక నువ్వుల నూనెను తగినంత అనుసంధానంగా వాడితే అనర్థం తగ్గుతుంది. పెరుగు లేక మజ్జిగను సమృద్ధిగా సేవిస్తే మంచిది. లేకపోతే కడుపులో పుండ్లు, పైల్స్, హైబీపీలకు దారి తీస్తుంది.

జాగ్రత్తలు: మిరపకాయలను వాడుకునే ముందు, ఉప్పు కలిపిన నీళ్లలో అరగంట నానబెడితే క్రిమిసంహారక మందుల దుష్ప్రభావం తగ్గుతుంది.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement