చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? | Chinta Chiguru: Health Benefits With Tamarind Leaves | Sakshi
Sakshi News home page

చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Published Fri, Jul 1 2022 6:14 PM | Last Updated on Fri, Jul 1 2022 6:54 PM

Chinta Chiguru: Health Benefits With Tamarind Leaves  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాంసం.. చేపలు.. రొయ్యలు.! చింత చిగురు ధర ముందు ఇవన్నీ దిగదుడుపే. పల్లెల్లో అంతగా పట్టించుకోని ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది. నగర మార్కెట్లలో కిలో రూ.500 ధర పలుకుతోందంటే దీనికున్న డిమాండ్‌ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే.. రెండు కిలోల చికెన్, రెండు కిలోల రొయ్యలు, మూడు కిలోల చేపలకు సమానమన్న మాట! చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలుండడంతో నగరవాసులు వీలైనంత మేర కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు మంచి రుచి తెస్తుందన్న భావనతో పల్లెల్లో చింత చిగురును కాయగూరల్లోనే కాదు.. చేపలు, రొయ్యలు, మటన్‌ వంటి మాంసాహార వంటకాల్లోనూ జత చేసేవారు.
చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్‌ బారిన పడినట్టే..!

ఇంకా దీనితో చెట్నీ, పులిహోర, రసంలను తయారు చేసేవారు. కాలక్రమంలో పల్లెటూళ్లలో చింత చిగురు వినియోగాన్ని తగ్గించారు. కానీ మారిన జీవనశైలి, ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియా, టీవీల్లో ప్రసారమయ్యే వంటకాల్లో చింత చిగురులో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల గురించి విరివిగా ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు పల్లెలుకంటే పట్టణాలు, నగరాల్లోనే దీని వినియోగం బాగా పెరిగింది. ఏడాదిలో జూన్, జులైలో మాత్రమే ఇది దొరుకుతోంది. గతంకంటే అర్బన్‌ ప్రాంతాల్లో ఏటికేడాది డిమాండ్‌తో పాటు ధర కూడా పెరుగుతోంది. మార్కెట్లు, రైతుబజార్లలో రెండేళ్ల కిందట కిలో చింత చిగురు రూ.100–150కే లభ్యమయ్యేది. ఈ సంవత్సరం ఏకంగా రూ.400 నుంచి 500 వరకు ఎగబాకింది.

సేకరణ కష్టతరం  
గతంలో చింత చెట్లు పల్లె ప్రాంతాల్లోనూ, రోడ్ల పక్కన విరివిగా ఉండేవి. గ్రామాలు, రోడ్ల విస్తరణతో ఆయా చోట్ల వీటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా ఎక్కడా చింత చెట్లను నాటడం లేదు. ఫలితంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దీంతో పల్లెలకు దూరంగా ఉంటున్న చింత చెట్ల నుంచి చిగురు సేకరణకు ఆసక్తి చూపడం లేదు. చిగురు కోయడానికి ఎక్కువ కూలీ సొమ్ము చెల్లించి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని కె.కోటపాడుకు చెందిన దేవుడమ్మ అనే మహిళ ‘సాక్షి’కి చెప్పింది. అందుకే గతంకంటే చింత చిగురు ధర పెరిగిందని తెలిపింది.  

చింత చిగురు ఆరోగ్య ప్రదాయిని
చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మోతాదులో ఔషధ గుణాలుంటాయి. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్‌–సి 3 మి.గ్రా.లు ఉంటుంది. యాంటీ బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్‌ లక్షణాలుండడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. జీర్ణ క్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్‌లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిది.  
– ఎం.రాజేశ్వరి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఫుడ్, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ విభాగం, ఏయూ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement