Tamarind trees
-
చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: మాంసం.. చేపలు.. రొయ్యలు.! చింత చిగురు ధర ముందు ఇవన్నీ దిగదుడుపే. పల్లెల్లో అంతగా పట్టించుకోని ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది. నగర మార్కెట్లలో కిలో రూ.500 ధర పలుకుతోందంటే దీనికున్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే.. రెండు కిలోల చికెన్, రెండు కిలోల రొయ్యలు, మూడు కిలోల చేపలకు సమానమన్న మాట! చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలుండడంతో నగరవాసులు వీలైనంత మేర కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు మంచి రుచి తెస్తుందన్న భావనతో పల్లెల్లో చింత చిగురును కాయగూరల్లోనే కాదు.. చేపలు, రొయ్యలు, మటన్ వంటి మాంసాహార వంటకాల్లోనూ జత చేసేవారు. చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! ఇంకా దీనితో చెట్నీ, పులిహోర, రసంలను తయారు చేసేవారు. కాలక్రమంలో పల్లెటూళ్లలో చింత చిగురు వినియోగాన్ని తగ్గించారు. కానీ మారిన జీవనశైలి, ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా, టీవీల్లో ప్రసారమయ్యే వంటకాల్లో చింత చిగురులో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల గురించి విరివిగా ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు పల్లెలుకంటే పట్టణాలు, నగరాల్లోనే దీని వినియోగం బాగా పెరిగింది. ఏడాదిలో జూన్, జులైలో మాత్రమే ఇది దొరుకుతోంది. గతంకంటే అర్బన్ ప్రాంతాల్లో ఏటికేడాది డిమాండ్‌తో పాటు ధర కూడా పెరుగుతోంది. మార్కెట్లు, రైతుబజార్లలో రెండేళ్ల కిందట కిలో చింత చిగురు రూ.100–150కే లభ్యమయ్యేది. ఈ సంవత్సరం ఏకంగా రూ.400 నుంచి 500 వరకు ఎగబాకింది. సేకరణ కష్టతరం గతంలో చింత చెట్లు పల్లె ప్రాంతాల్లోనూ, రోడ్ల పక్కన విరివిగా ఉండేవి. గ్రామాలు, రోడ్ల విస్తరణతో ఆయా చోట్ల వీటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా ఎక్కడా చింత చెట్లను నాటడం లేదు. ఫలితంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దీంతో పల్లెలకు దూరంగా ఉంటున్న చింత చెట్ల నుంచి చిగురు సేకరణకు ఆసక్తి చూపడం లేదు. చిగురు కోయడానికి ఎక్కువ కూలీ సొమ్ము చెల్లించి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని కె.కోటపాడుకు చెందిన దేవుడమ్మ అనే మహిళ ‘సాక్షి’కి చెప్పింది. అందుకే గతంకంటే చింత చిగురు ధర పెరిగిందని తెలిపింది. చింత చిగురు ఆరోగ్య ప్రదాయిని చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మోతాదులో ఔషధ గుణాలుంటాయి. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్–సి 3 మి.గ్రా.లు ఉంటుంది. యాంటీ బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలుండడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. జీర్ణ క్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిది. – ఎం.రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఏయూ -
చింతపండే ఉపాధి
హవేళిఘణాపూర్(మెదక్) : చింతపండు... నిత్యవసర వస్తువుల్లో ప్రతి రోజు ఏదో ఒక వంట(కూర)లో వాడుతుంటాం. కూరల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. చింతపండుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. హవేళిఘణాపూర్ మండల పరిధిలోని గంగాపూర్, కూచన్‌పల్లి, రాజ్పేట్, కొత్తపల్లి, బూర్గుపల్లి, వాడీ, శమ్నాపూర్ గ్రామ ప్రజలు చింతపండును సేకరించి, దానిని కొట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా చింతపండును సేకరించి కొందరు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఈ యేడు చింతపండు బాగా కాసిందని, గింజలతో ఉన్న చింతపండు కిలో రూ.40 నుంచి 50 వరకు విక్రయించగా...గింజలు లేని చింతపండు(కొట్టింది) కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. -
సిరుల పంట.. పుంగనూరు చింత
* మూడేళ్లకే కాపునిచ్చే మేలైన చింత * చేతి కందే ఎత్తులోనే చింత దిగుబడి * చెట్టు ఎత్తు ఏడు అడుగులకే పరిమితం సాధారణంగా చింత చెట్లు కాపుకొచ్చేందుకు ఏళ్లు పడుతుంది. 20 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఎత్తు ఎక్కి కాయలు కోయటం.. సరైన ఆదాయం రాకపోవటం.. దీర్ఘకాలం పాటు పంట కోసం వేచిచూడాల్సి రావటం వంటి కారణాలతో వీటి సాగుకు రైతులు ఆసక్తి చూపటం లేదు. ఈ ఇబ్బందులను తీర్చే పుంగనూరు (పీఎన్) రకం చింత మొక్కలను వచ్చే జూన్ నుంచి అటవీ శాఖ రైతులకు అందుబాటులోకి తెస్తోంది. వ్యవసాయ భూముల్లోను సాంధ్ర పద్ధతుల్లో పెంచేందుకు అనుైవె న స్వల్పకాలిక రకం ఇది. చెట్టుకు మూడు క్వింటాళ్ల దిగుబడి పలమనేరు ఫారెస్టు అధికారులు వీటి ప్రయోగాత్మక సాగులో మంచి ఫలితాలను సాధించారు. 1989లో అప్పటి అటవీశాఖ అధికారులు పుంగనూరు (పీజీ), కుప్పం (కేపీ), రుషివ్యాలీ (ఆర్ఎల్) చింత రకాల ను తిరుపతిలోని బయోట్రిమ్లో సెల్వికల్చర్ ద్వారా రూపొందించిన చింత మొక్కతో అంటు కట్టారు. పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్మపురిలో ఐదెకరాల విస్తీర్ణంలో 75 మొక్కలు నాటారు. అల్లనేరేడు, ఉసిరి మొక్కలను వీటితో పాటు సాగు చేస్తున్నారు. మొదటి ఏడాది ట్యాంకర్ల ద్వారా నీరందించారు. ఆపై వర్షాధారంగానే పెరుగుతున్నాయి. భూమి నుంచి రెండడుగుల ఎత్తు పెరిగేలోగానే కొమ్మలుగా చీలిపోయి నాటిన మూడేళ్లకు కాపుకొచ్చాయి. మేలి రకమైన చింత చెట్లను అంటుకట్టటంతో పాత చెట్టు వయస్సు కలిసి త్వరగా కాపుకొస్తోంది. గరిష్టంగా ఏడడుగుల ఎత్తు పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడి చెట్లకు చేతికందే ఎత్తులోనే చింతకాయలు విరగ్గాశాయి. ముఖ్యంగా గొరెసెలు.. పొడవుగా వెడల్పుగా ఉన్నాయి. ప్రతి చెట్టులోనూ మూడు క్వింటాళ్ళకు పైగా దిగుబడి వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాయలు మందంగా ఉండటంతో వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం మొదటి రకం చింతపండును సేకరించి అచ్చు (చపాతి)గా చేసి స్థానిక కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి ధరలు బాగా ఉన్నప్పుడు అమ్ముతున్నారు. ఈ చెట్ల నుంచి లభించే ఉత్పత్తులు వెడల్పుగా ఉండి అచ్చు పోసేందుకు అనువుగా ఉన్నాయి. కరువు ప్రాంతాలకు అనుకూలం.. నీటి సౌకర్యం లేని బంజరు భూముల్లో, మెట్ట పొలాల్లో పుంగనూరు రకం చింత మొక్కలను సాగు చేయవచ్చు. తక్కువ కాలంలోనే నాణ్యమైన పంట చేతికొస్తుంది. ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు సాగుకు అనుకూలం. ఎకరానికి 120 నుంచి 140 మొక్కలను నాటుకోవచ్చు. మీటరు వెడల్పు, లోతు గల గోతులు తీసి మొక్కలను నాటుకోవాలి. మొక్కల మధ్య ఐదు మీ. ఎడం ఉండాలి. సాగు ఖర్చు తక్కువ. చింత మొక్కలతో పాటు అంతర పంటలుగా అల్ల నేరేడు. ఉసిరిని సాగు చేసుకోవచ్చు. తొలి ఏడాదే చెట్టుకు 70 కిలోల దిగుబడి వస్తుంది. కొద్దిపాటి తడులతో లేదా పూర్తి వర్షాధారంగాను సాగు చేయవచ్చు. భవిష్యత్తులోను చింతపండుకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. - సుబ్రమణ్యం పలమనేరు, చిత్తూరు జిల్లా జూన్‌లో మొక్కలను పంపిణీ చేస్తాం.. ‘పుంగనూరు రకం’ చింత చెట్ల గురించి రైతులకు పెద్దగా తెలీదు. ప్రయోగాత్మకంగా సాగు చేసిన చింత మొక్కలు మూడేళ్లకే కాయలు కాయడం చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు కావాలని చాలామంది రైతులు అడుగుతున్నారు. వచ్చే జూన్‌లో వనసంరక్షణా సమితులకు, రైతులకు చింత మొక్కలను పంపిణీ చేస్తాం. - శివన్న (94917 71936), అటవీ రేంజ్ అధికారి, పలమనేరు, చిత్తూరు జిల్లా 22న ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై గ్రామ భారతి సంస్థ ఈ నెల 22వ తేదీన రైతులకు ఒక్కరోజు శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడెంలోని ఆచార్య నాగార్జున నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు సూదిని స్తంభాద్రి రెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: జి. నరసింహ 98662 95792, పానుగంటి రవి 95506 86422 12 నుంచి వరి విత్తనాల పంపిణీ అపురూపమైన దేశీ వరి విత్తనాల పంపిణీ ఫిబ్రవరి 12,13,14 తేదీల్లో హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆడిటోరియం (దోమలగూడ)లో ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. ఒక్కొక్కరికి రకానికీ పావు కేజీ చొప్పున (పెరుమాళ్లు పద్ధతిలో అరెకరానికి సరిపోతాయి) ఉచితంగా అందిస్తారు. వివరాలకు.. సురేంద్ర : 99491 90769, 040-27654337 letssave@gmail.com