సిరుల పంట.. పుంగనూరు చింత | punganur chinthakayalu crop | Sakshi
Sakshi News home page

సిరుల పంట.. పుంగనూరు చింత

Published Tue, Feb 9 2016 1:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

సిరుల పంట.. పుంగనూరు చింత - Sakshi

సిరుల పంట.. పుంగనూరు చింత

* మూడేళ్లకే కాపునిచ్చే మేలైన చింత
* చేతి కందే ఎత్తులోనే చింత దిగుబడి
* చెట్టు ఎత్తు ఏడు అడుగులకే పరిమితం

సాధారణంగా చింత చెట్లు కాపుకొచ్చేందుకు ఏళ్లు పడుతుంది. 20 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఎత్తు ఎక్కి కాయలు కోయటం.. సరైన ఆదాయం రాకపోవటం.. దీర్ఘకాలం పాటు పంట కోసం వేచిచూడాల్సి రావటం వంటి కారణాలతో వీటి సాగుకు రైతులు ఆసక్తి చూపటం లేదు.

ఈ ఇబ్బందులను తీర్చే పుంగనూరు (పీఎన్) రకం చింత మొక్కలను వచ్చే జూన్ నుంచి అటవీ శాఖ రైతులకు అందుబాటులోకి తెస్తోంది. వ్యవసాయ భూముల్లోను సాంధ్ర పద్ధతుల్లో పెంచేందుకు అనుైవె న స్వల్పకాలిక రకం ఇది. చెట్టుకు మూడు క్వింటాళ్ల దిగుబడి పలమనేరు ఫారెస్టు అధికారులు వీటి ప్రయోగాత్మక సాగులో మంచి ఫలితాలను సాధించారు. 1989లో అప్పటి అటవీశాఖ అధికారులు పుంగనూరు (పీజీ), కుప్పం (కేపీ), రుషివ్యాలీ (ఆర్‌ఎల్) చింత రకాల ను తిరుపతిలోని బయోట్రిమ్‌లో సెల్వికల్చర్ ద్వారా రూపొందించిన చింత మొక్కతో అంటు కట్టారు.

పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్మపురిలో ఐదెకరాల విస్తీర్ణంలో 75 మొక్కలు నాటారు. అల్లనేరేడు, ఉసిరి మొక్కలను వీటితో పాటు సాగు చేస్తున్నారు. మొదటి ఏడాది ట్యాంకర్ల ద్వారా నీరందించారు. ఆపై వర్షాధారంగానే పెరుగుతున్నాయి. భూమి నుంచి రెండడుగుల ఎత్తు పెరిగేలోగానే కొమ్మలుగా చీలిపోయి నాటిన మూడేళ్లకు కాపుకొచ్చాయి. మేలి రకమైన చింత చెట్లను అంటుకట్టటంతో పాత చెట్టు వయస్సు కలిసి త్వరగా కాపుకొస్తోంది.

గరిష్టంగా ఏడడుగుల ఎత్తు పెరిగాయి.
 ప్రస్తుతం ఇక్కడి చెట్లకు చేతికందే ఎత్తులోనే చింతకాయలు విరగ్గాశాయి. ముఖ్యంగా గొరెసెలు.. పొడవుగా వెడల్పుగా ఉన్నాయి. ప్రతి చెట్టులోనూ మూడు క్వింటాళ్ళకు పైగా దిగుబడి వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాయలు మందంగా ఉండటంతో వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం మొదటి రకం చింతపండును సేకరించి అచ్చు (చపాతి)గా చేసి స్థానిక కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి ధరలు బాగా ఉన్నప్పుడు అమ్ముతున్నారు. ఈ చెట్ల నుంచి లభించే ఉత్పత్తులు వెడల్పుగా ఉండి అచ్చు పోసేందుకు అనువుగా ఉన్నాయి.  
 
కరువు ప్రాంతాలకు అనుకూలం..
నీటి సౌకర్యం లేని బంజరు భూముల్లో, మెట్ట పొలాల్లో పుంగనూరు రకం చింత మొక్కలను సాగు చేయవచ్చు. తక్కువ కాలంలోనే నాణ్యమైన పంట చేతికొస్తుంది. ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు సాగుకు అనుకూలం. ఎకరానికి 120 నుంచి 140 మొక్కలను నాటుకోవచ్చు. మీటరు వెడల్పు, లోతు గల గోతులు తీసి మొక్కలను నాటుకోవాలి. మొక్కల మధ్య ఐదు మీ. ఎడం ఉండాలి. సాగు ఖర్చు తక్కువ. చింత మొక్కలతో పాటు అంతర పంటలుగా అల్ల నేరేడు. ఉసిరిని సాగు చేసుకోవచ్చు. తొలి ఏడాదే చెట్టుకు 70 కిలోల దిగుబడి వస్తుంది. కొద్దిపాటి తడులతో లేదా పూర్తి వర్షాధారంగాను సాగు చేయవచ్చు. భవిష్యత్తులోను చింతపండుకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదు.  
 - సుబ్రమణ్యం పలమనేరు, చిత్తూరు జిల్లా
 
జూన్‌లో మొక్కలను పంపిణీ చేస్తాం..

‘పుంగనూరు రకం’ చింత చెట్ల గురించి రైతులకు పెద్దగా తెలీదు. ప్రయోగాత్మకంగా సాగు చేసిన చింత మొక్కలు మూడేళ్లకే కాయలు కాయడం చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు కావాలని చాలామంది రైతులు అడుగుతున్నారు. వచ్చే జూన్‌లో వనసంరక్షణా సమితులకు, రైతులకు చింత మొక్కలను పంపిణీ చేస్తాం.
- శివన్న (94917 71936),
 అటవీ రేంజ్ అధికారి, పలమనేరు, చిత్తూరు జిల్లా
 
22న ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై గ్రామ భారతి సంస్థ ఈ నెల 22వ తేదీన రైతులకు ఒక్కరోజు శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడెంలోని ఆచార్య నాగార్జున నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు సూదిని స్తంభాద్రి రెడ్డి రైతులకు శిక్షణ  ఇస్తారు. పాల్గొనదలచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: జి. నరసింహ 98662 95792, పానుగంటి రవి 95506 86422
 
12 నుంచి వరి విత్తనాల పంపిణీ

అపురూపమైన దేశీ వరి విత్తనాల పంపిణీ ఫిబ్రవరి 12,13,14 తేదీల్లో హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆడిటోరియం (దోమలగూడ)లో ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. ఒక్కొక్కరికి రకానికీ పావు కేజీ చొప్పున (పెరుమాళ్లు పద్ధతిలో అరెకరానికి సరిపోతాయి) ఉచితంగా అందిస్తారు. వివరాలకు.. సురేంద్ర : 99491 90769, 040-27654337 letssave@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement