నెల్లూరు(పొగతోట): రైతులకు అక్టోబరు నెలాఖరులోగా వ్వవసాయ రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు బ్యాంకర్లకు సూచించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రుణ లక్ష్యాల ప్రణాళికలు రూపొందించుకుంటేనే పక్కాగా మంజూరు చేయడం సాధ్యమవుతుందన్నారు. సీజన్ దాటిన తరువాత రుణాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అర్హత ఉన్న రైతుల జాబితాలను తయారు చేసుకుని రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రుణాలు మంజూరు సమయంలో లేని నిబంధనలను రుణమాఫీలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పనిచేసిన మూడు రోజుల్లోగా ఉపాధి కూలీల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. డ్వాక్రా రుణాల బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, బ్యాంకుల వారీగా రికవరీల జాబితాలను అందజేయాలని కోరారు. డీఆర్‌డీఏ సమావేశంలో రికవరీలపై చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి చిన్న,మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలని కోరారు.ఈ సమావేశంలో ఎల్‌డీఎం వెంకటరావు, సిండికేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి, నాబార్డు ప్రతినిధి రమేష్‌కుమార్, ఆర్‌బీఐ ఏజీఎం సెల్వపాండియ, డీఆర్డీఏ, డ్వామా పీడీలు లావణ్యవేణి, హరిత, తదితరులు పాల్గొన్నారు.
16 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలోని రైతులకు మద్దతు ధర కల్పించేందుకు 16 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్, ఎన్‌డీసీసీబీ, బీఎల్‌ఎంసీ, సివిల్‌సప్లై విజిలెన్స్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
పీపీసీల ద్వారా రెండు రోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. ధాన్యం దిగుబడుల వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ జేడీ నుంచి తీసుకుని మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పీఎంకేఎస్‌వైను పటిష్టంగా అమలు చేయాలి
ప్రధాన మంత్రి కృషి సించాయన యోజన (పీఎంకేఎస్‌వై) పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్గదర్శాలకు అనుగుణంగా ప«థకాన్ని అమలు చేయాలన్నారు. డీఆర్‌డీఏ, ఆత్మ, వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయా శాఖల పరిధిలో నిర్వహించే పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను కమిటీల అనుమతితో పూర్తి చేయాలన్నారు. కన్సల్‌టెంట్ ఇంజనీర్ పీకే ప్రశ్న పీఎంకేఎస్‌వై ప«థకంలో పొందుపరిచిన నీటి సంరక్షణ, పొదుపు, సాగునీరు, మంచినీరు నిర్వహణ, తదితర వాటì ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆత్మ పీడీ దొరసానమ్మ, వ్యవసాయ శాఖ జేడీఏ హేమమహేశ్వరరావు, డ్వామా పీడీ హరిత, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు
బాలకార్మికులతో పనులు చేయించే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలు జరిపి బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలకు నిర్దేశించిన కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.