మడ్డువలస వద్ద నీటిని విడుదల చేస్తున్న కలెక్టర్ ధనంజయరెడ్డి
వంగర : ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా వ్యవసాయ రంగంలో శ్రీకాకుళం జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వెల్లడించారు. మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు జలాశ యం నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్ సీజన్‌కు శుక్రవారం సాగునీటిని విడుదల చేశా రు. తొలుత హెడ్ స్లూయీస్ వద్ద ప్రత్యేక పూజ లు నిర్వహించి గంగమ్మ తల్లికి హారతి అందించారు. అనంతరం హెడ్‌స్లూయీస్ గేట్లు స్విచ్‌లు ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా చరిత్రలో జూన్ 8న మడ్డువలస ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్‌కు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమమన్నారు. ఏటా జూలై ఏడో తేదీన నీటిని విడుదల చేసేవారని.. ఈ ఏడాది నెల రోజులు ముందుగా విడుదల చేశామన్నారు. నీరు విడుదలలో కొత్త విధానాలను తీసుకువచ్చామని, తద్వారా ఏడాదిలో మూడు పంటలను రైతులు సేద్యం చేయడమే లక్ష్యమని వివరించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మడ్డువలస ప్రాజెక్టు నుంచి ఇటీవల రబీ సీజన్‌కు నీటిని విడుదల చేశామన్నారు. రబీకి నీరు విడుదల ద్వారా 25 వేల ఎకరాల్లో విలువైన పంటలు పండించే అవకాశం రైతులకు వచ్చిందని, దీంతో కొంత మేర ఆర్థిక అభివృద్ధి అన్నదాత సాధించగలిగారని వివరించారు. ఈ ఏడాదిని మూడు విభాగాలుగా విభజించి జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి మూడు పంటలు పండించే విధంగా సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖలు సమిష్టి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం విడిచిపెట్టిన నీరు ద్వారా అక్టోబర్ నాటికి ఖరీఫ్‌పూర్తి చేసి రైతులు ఫలసాయాన్ని పొందుతారన్నారు. రబీ సీజన్ సంబంధించి నవంబర్ రెండో వారంలో నీటిని ఇస్తామని, అలాగే ఆరు తడి పంటలు సేద్యం చేస్తే జనవరి నెలాఖరు నాటికి రబీ పంటలు పూర్తవుతాయని, గత ఏడాది మూడు లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగుచేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేశామన్నారు.
ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగు చేపడతామని చెప్పారు. మూడో పంటగా ఫిబ్రవరి నెలాఖరు నాటికి సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. కనీసం 50 వేల ఎకరాల్లో నువ్వులు, పెసర, మినుము వంటి తక్కువ కాలంలో పండించే పంటలు సాగు చేసేందుకు వీలుగా నీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలు, శాఖలతో సమీక్షలు జరిపామన్నారు. ఎరువులు, విత్తనాలు, ఆధునిక యంత్రాలు, వివిధ రకాల పరికరాలు నిరంతరం....కాలానుగుణంగా రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్టు ద్వారా ఈ నెల 20, నారాయణపురం ఆనకట్ట ద్వారా 22న సాగునీటిని విడుదల చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
కాలువలో నీటి గలగలలు
కుడి ప్రధాన కాలువలో సాగునీటి గలగలల సవ్వ డి వినిపిస్తుంది. 150 క్యూసెక్కుల సాగునీటిని కలెక్టర్ తొలిరోజు విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలోని 0 కి.మీటర్లు నుంచి 50.7 కిలోమీటర్లు వరకు 24,877 ఎకరాలు, 50.7 కిలోమీటర్లు మైలు రాయి నుంచి 55.7 మీటర్లు మైలు రాయి వరకు 5,200 ఎకరాలకు మొత్తం కలిపి 30,077 ఎకరాలకు ఈ ఏడాది సాగునీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, వంగర, లావేరు తదితర మండలాల్లో ఆయకట్టు భూములకు నిరాటంకంగా సాగునీటిని సరఫరా చేయనున్నట్టు అధికారులు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయు డు, ఎంపీపీ యలకల అమ్మడమ్మ, జిల్లా జలవనరుల శాఖ సలహాదారు ఎంవీ రమణమూర్తి, ఈఈ డి.ఎస్.ప్రదీప్, డీఈలు నర్మదా పట్నాయక్, జి.వి.రమణ, జి.నగేష్, వ్యవసాయ శాఖ ఏడీ సీహెచ్ వెంకటరావు, జేఈలు, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ దృష్టికి ‘తోటపల్లి’ సమస్య
వంగర మండలానికి ప్రధాన సాగునీటి ఆధారమైన తోటపల్లి కుడి ప్రధాన కాలువను ఆనుకొని గరుగుబిల్లి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ యలకల అమ్మడమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయుడులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అక్కడ అధికారులతో సమీక్షించి అవసరమైన నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కరించి రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment