గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..! | Chief KCR was Tramping in the village of erravalli | Sakshi
Sakshi News home page

గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..!

Published Fri, Aug 21 2015 12:08 AM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..! - Sakshi

గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..!

- ఇండ్ల మధ్యనే జిల్లేడు చెట్లు..
- పొదలు, చెత్తా చెదారం..
- ఇదేం బాగలేదు..
- వెంటనే మార్చేద్దాం
- అంతా కలిసి నడుద్దాం
- వీధులన్నీ చుట్టి..గ్రామస్తులతో ముచ్చటించిన సీఎం
- ఎర్రవల్లిలో సీఎం పాదయాత్ర
- రూపు రేఖలు మారుస్తానంటూ హామీ
- గ్రామస్తుల హామీ తీసుకున్న ముఖ్యమంత్రి
గజ్వేల్/జగదేవ్‌పూర్:
ఏమ్మా మరుగుదొడ్డి కట్టుకున్నారా... ఈ మురుగంతా ఏందీ..ఈ చెత్త గిట్లనే ఉంటదా..రోడ్డు పక్కన పాతబావి ఏందీ..ఇండ్ల మధ్య జిల్లేడు చెట్లు మంచిది కాదు..చాలా పాత ఇళ్లు.. పెంకుటిళ్లు ఉన్నట్టు ఉన్నయ్.. గీ ఇండ్లల్ల ఎవరూ ఉండరా.. ఇండ్ల మధ్య పెంటకుప్పులేందీ.. ఈ చెత్తా చెదారమేందీ...ఏమయ్యా గీ ఇల్లు నీదేనా.. ఈ గుడిసే మీదేనా..అందరికి ఇండ్లు కట్టిస్తాం..ఊర్లో ఎటు చూసినా.. ఏమూలన చూసినా  పాత, కూలిపోయిన ఇండ్లే కనిపిస్తున్నాయ్.. గిదేం ఊరు.. గిట్లయితే బాగుండదు.. అంతా మార్చేద్దాం..అనే సంభాషణల మధ్య సీఎం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ పర్యటన కొనసాగింది.

బుధవారం సాయంత్రం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గురువారం ఉదయం గ్రామజ్యోతిలో భాగంగా పక్కనే ఉన్న ఎర్రవల్లి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఉదయం 10.50 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 2.30 గంటలకు ముగిసింది. స్థానిక వాటర్ ట్యాంకు వద్దకు సీఎం కేసీఆర్ 10.50 నిమిషాలకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలు సీఎం కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్దారు.

అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న నారిని లక్ష్మీనర్సు ఇంట్లోకి వెళ్లి మరుగుదొడ్డిని పరిశీలించారు. అలాగే చింతకాయల రాజవ్వ ఇంటికెళ్లి రాజ వ్వతో మాట్లాడారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్నా మురుగు గుంతల ను  పరిశీలించారు. పక్కనే ఉన్న సర్పంచ్ భాగ్య, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డితో ఇండ్ల మధ్య ఈ మురుగేంది అని ప్రశ్నించారు. వెంటనే మురుగును తొలగించాలని ఆదేశించారు. అలానే ముందుకెళ్లి నూతనంగా నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించి, తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి అవుసుల నర్సింహా చారి, యాదగిరి ఇంటి వెనుకకు వెళ్లి అక్కడే ఉన్న మరుగుదొడ్డిని పరిశీలించారు. అదే రోడ్డున అంబేద్కర్ చౌరస్తా వెళ్లే దారి వద్దకు వచ్చారు.  కొంత ముందుకు వచ్చి ఓ పాత ఇల్లు ఉన్న గల్లీలోకి వెళ్లారు.  అక్కడ కూలిన ఇల్లును చూసి ఇండ్ల మధ్య ఇలాంటి కూలిన ఇండ్లు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. గ్రామానికి చెందిన తుమ్మ కృష్ణ ఈ స్థలం యూత్ భవనం కోసం ఇస్తున్నాం సారూ.. అంటూ వివరాలు సీఎంకు చెప్పారు. అలాగే రోడ్డు పక్కన్నే ఉన్న పాడుబడ్డ చేదబావి దగ్గరకు వెళ్లి తొంగి చూశారు.

అటు నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి సర్పంచ్ భర్త బాల్‌రాజుతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించారు. అనంతరం గ్రామజ్యోతి సభ కార్యక్రమానికి వెళుతూ దళిత కాలనీ ఎక్కడా అంటూ పక్కనే ఉన్నా ‘గడా’ ఓఎస్ డీ హన్మంతరావును ఆడిగారు. దళిత కాలనీని కూడా చూద్దామంటూ  కాలనీలోకి ఆడుగుపెట్టారు. మొండి భిక్షపతి ఇంటి వెనుక నుంచి పెంకుటిళ్లను చూస్తు ముందుకు వెళ్లారు. మరుగుదొడ్డిని పరిశీలించారు. సైద నర్సయ్య ఇంటి దగ్గరకు రాగానే కూలిపోయిన ఇల్లు కనిపిం చింది. వెంటనే సీఎం కేసీఆర్ ఈ ఇల్లు ఎవరిదీ.. అం టూ ఆరా తీశారు. సైద నర్సయ్యను పిలిచి ఇల్లు ఉందా అని ఆడిగారు. యాదయ్య లేదనగానే.. ఎక్కడుంటున్నవ్ అని ఆడగడంతో రేకు ల ఇంట్లో ఉంటున్నా అంటూ చెప్పారు.

దళిత కాలనీ అంతా కలియతిరుగుతూ కనిపించిన వారినల్లా పలకరించారు. మల్లని యాదయ్య, నాగమణి దంపతులు ఉంటున్న గుడిసెను చూసి మీదేనా గుడిసె.. మీకు ఇల్లు కట్టిస్తా అంటూ హామీ ఇచ్చారు. రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇండ్ల బయటకు వెళ్లి సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. ఇండ్ల మధ్య గీ చెత్తాచెదారం ఎందీ.. అంటూ పక్కనే ఉన్న గడా అధికారి హన్మంతరావును, బాల్‌రాజు, కిష్టారెడ్డిని ప్రశ్నించారు.

ఇదంతా తీసేయాలి.. నిన్నమొన్న గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏంచేశారు. అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మళ్లీ బీటీ రెడ్డెక్కి బీసీ కాలనీలోకి ప్రవేశించారు. రోడ్డుపై నిలబడి కాలనీల సంగతులు తెలుసుకున్నారు. వాటర్‌ట్యాంకు దగ్గరకొచ్చి నిన్నమొన్న వేశారా అంటూ సీసీ రోడ్ల గురించి గడా ఓఎస్‌డీని ఆడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి పాఠశాల నూతన భవనాల పనుల వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. సీఎం నాటేందుకు ఏర్పాటు చేసిన మొక్కలను చూసి నాటకుండానే ముందుకుసాగారు. హనుమాన్ గుడి దగ్గర పాడుబడ్డ ఇండ్లను చూసి ఇండ్లల్లో ఎవరూ ఉంటలేరా అయితే గ్రామానికి ఏదైనా అవసరం ఉంటది జాగా అడగండి అంటూ సర్పంచ్ భర్త బాల్‌రాజును అదేశించారు.

అక్కడి నుంచి 12.30 గంటలకు గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. జేసీ వెంకట్రామిరెడ్డి, స్థానిక సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, జెడ్‌పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక, గడా అధికారి హన్మంతరావు, జహంగీర్, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి సీఎంతో కలిసి లోపలకు వెళ్లారు. సీఎం అక్కడ నిమ్మరసం తగారు.  అనంతరం గంటకు పైగా గ్రామాభివృద్ధిపై చర్చించారు. గ్రామంలో ఎంత మందికి ఇండ్లు లేవు,

కూలిపొయిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి..ఊరి బయట ఎంత మంది ఉంటున్నారు అనే విషయాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు అధికారులను పిలవగా   ఎవరూ లేరు. దీంతో సీఎం  ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 1.45 గంటలకు గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొని 43 నిమిషాలు మాట్లాడారు. మళ్లీ రేపు వచ్చి శ్రమదానం చేస్తా..అందరం కలిసి భోజనం చేద్దామంటూ  వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement