
దండులా కదలాలె
సంఘటితమై ‘పవర్’ చాటాలె..
- గ్రామాల ప్రగతికి బాటలు వేయాలె
- ఎర్రవల్లి ‘గ్రామజ్యోతి’లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
- గ్రామంలో వీధులన్నీ కలియతిరిగిన సీఎం
- పారిశుద్ధ్యం, ప్రజాసమస్యలపై ఆరా
- నేడు ‘చెత్తపై యుద్ధా’నికి సీఎం నిర్ణయం
గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఊరు బాగుకు కదలాలె.. సంఘటితమై ‘పవర్’ ఏమిటో చాటాలె.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్.. అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం.. మనం మేల్కొనాలె’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్వహించిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలో వీధులన్నీ కలియతిరిగి పారిశుద్ధ్యం తీరును పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జాయింట్ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రంలతోపాటు వివిధ శాఖల అధికారులతో గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేత ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సమీక్ష జరిపారు. అనంతరం సభలో గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రజా చైతన్యంతోనే ప్రగతికి బాటలు పడతాయి..’ అంటూ పేర్కొన్నారు.
‘గ్రామం లో 1500 మంది పైచిలుకు జనాభా ఉంది. చి న్న పిల్లలు, వృద్ధులు సుమారు 500 మందిని మినహాయిద్దాం. మిగిలిన 1000 మంది ఒక్కటై సంఘటిత శక్తిని చాటుదాం. ఏళ్ల తరబడి పాములు, తేళ్లు పారే ఇండ్లల్లో బతికినం. ఇప్పటికైనా ఈ దుస్థితి మారాలె’ అంటూ చైతన్యపరిచారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించి ఆ తర్వాత శిథిలమైన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా విశాలమైన రోడ్ల నిర్మాణానికి బాటలు వేసుకోవాల్సిన అవసరముందన్నారు.
పారిశుద్ధ్యంలో వరంగల్ జిల్లా గంగదేవునిపల్లి మనకు ఆదర్శం కావాలన్నారు. అందరూ పట్టించుకుంటే చిటికె లో సమస్యలు పరిష్కారమవుతాయని వివరిం చారు. 6, 7 నెలల్లో గ్రామాన్ని పూర్తిగా మార్చేద్దామని చెప్పారు. గ్రామాన్ని బాగుచేసుకోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయే రోజు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ‘నా ఫామ్‌హౌస్ ఇక్కడనే ఉం ది. ఇది నా ఊరు. అటుపోయినపుడు, ఇటుపోయినపుడు వస్త.
మీ వెంట ఉండి సమస్యలు పరిష్కరిస్తా’నని భరోసా ఇచ్చారు. ‘గ్రామంలో బస్తీలన్నీ అద్దంలా మారాలె. ఆరేడు నెలల్లో మంచినీటి కోసం ఏ ఆడపడుచు రోడ్డుమీదికి రావొద్దు. అలా వచ్చిందంటే ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయా లె అన్నారు. ‘మరో నాలుగేళ్లల్లో ఈ గ్రామానికి రూ. 74లక్షలు వస్తాయి. వీటితోపాటు మరిన్ని నిధులు మీకు ఇస్త. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తా’ అంటూ పునరుద్ఘటించారు.
రాజకీయాలు గిప్పుడెందుకు?
గ్రామంలో అంతా కలిసికట్టుగా ముందు కు సాగాల్సిన అవసరముందని సీఎం హితవు పలికారు. ‘ఎలక్షన్లు వచ్చినపుడు రాజకీయాల సంగతి చూద్దాం. ఇప్పుడొద్దు’ అంటూ సూచిం చారు. గ్రామంలో ‘సర్వవర్గ సమితి’ పేరిట కమిటీని ఏర్పాటుచేసుకోవాలని, ఇందులో అన్ని కులాలకు ప్రాతినిథ్యం దక్కేలా చూడాల న్నారు.
ఈ కమిటీ నిర్ణయాల మేరకు ముందు కు సాగాలన్నారు. బ్రెజిల్ దేశంలోని లియోడిజనిరో పట్టణం కాలుష్యం లేని ప్రాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఎప్పుడూ తమగురించే ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని కోరారు. గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల సాధనకు తమవంతు ప్రయత్నం చేయాలని సూచించారు.
గ్రామంలో శుక్రవారం ‘చెత్తపై యుద్ధం’ కార్యక్రమం చేపడదామని సీఎం పిలుపునివ్వగా గ్రామస్తులు చప్పట్లతో హర్షామోదం పలికారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. ‘చప్పట్లు కొట్టినట్లు గాదు... నాతో పంచాయతీ గొట్టు ఉంటది. పని అయిపోయేదాక వెంటపడత. అందరూ సహకరించాలె’ అంటూ పేర్కొనగా గ్రామస్తులు ముఖ్యమంత్రికి తాము ఎల్లపుడూ సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగరపంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్ నేతలు జహంగీర్ తదితరలు పాల్గొన్నారు.