Gramajyoti House
-
బంగారువల్లి కావాలె
గజ్వేల్: ‘‘గ్రామజ్యోతి అంటూ సీఎం ఉరుకులాడుతుండు.. ఆయన ఉండే ఎర్రవల్లి సంగతేంది? అని అందరూ అనుకునే పరిస్థితి రావొద్దు. నా ఊరు చిన్నతనం కావొద్దు. ఈ ఎర్రవల్లి బంగారువల్లిగా మారాలె. రాష్ట్రంలోనే నంబర్ వన్ గ్రామంగా అవతరించాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ‘గ్రామజ్యోతి’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధులన్నీ కలియతిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్యం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ.. ‘‘ఏడ్వదలుచుకుంటే గంటసేపు ఏడ్చే బాధ ఉంది. ఇబ్బంది ఉంది. కానీ ఏడిస్తే పని కాదు కదా! నేను ఎర్రవల్లిలో ఉండే తెలంగాణ తెచ్చిన. ఎన్నో విజయాలను అందుకున్న. ఇప్పుడు ఈ ఊరిని మార్వలేనా? మీరంతా నాకు సహకరించండి. ఈ గ్రామం రూపురేఖలు మారుస్తా’’ అని పేర్కొన్నారు. ‘‘నేను తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఈ బక్కోనితోని ఏమైతది. బొండిగె పిసికితే పోతడు అని అవమానపరిచారు. అయినా బాధ పడలే. లక్ష్యం కోసం పనిజేసిన. అనుకున్నది సాధించిన. మీరు కూడా మన ఊరి బాగుకు కదలాలే.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్ అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం. మనం మేల్కోనాలె’’ అని వ్యాఖ్యానించారు. గ్రామానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తున్నానని, ఆయన గ్రామం రూపురేఖలు మార్చటానికి సహకరిస్తారని చెప్పారు. ‘‘గ్రామంలో 231 పెంకుటిండ్లు, 107 ఆర్సీసీ బిల్డింగ్లు, 40 కూలిపోయేదశలో ఉన్న ఇండ్లు, మరో 10 గుడిసెలు, వలస వెళ్లటం వల్ల మరో 30-40 వృథాగా ఉన్న ఇండ్లు ఉన్నాయ్.. మీరు చేయాల్సిందల్లా ఒకటే! కరాబైన ఇండ్లను కూల్చేసుకొని కొత్త ఇండ్లు కట్టుకోవాలి. గ్రామానికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నా’’ అని ప్రకటించారు. దీంతో గ్రామస్తులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయగా.. ‘‘చప్పట్లు కొట్టినట్లు కాదు. ఊరి కోసం కష్టపడాలి’’ అని సీఎం పేర్కొన్నారు. గ్రామం రూపురేఖలు మార్చుకొని రోడ్లు పెద్దగా చేసుకుందామని, ఇందుకు అధికారులు ప్లాన్ ఇస్తారని వివరించారు. ‘‘నేను రాత్రికి ఇక్కడ్నే ఉంటా. శుక్రవారం వస్తా. అందరం కలిసి శ్రమదానం చేద్దాం. నేను మీతో కలిసి శ్రమదానం చేస్తా. మీరు ఎన్ని తట్టల మట్టి మొయ్యిమంటే అన్ని మోస్తా. మోరీలు సాప్ చేయమంటే చేస్తా. రేపు మాత్రం అందరూ ఇందులో పాల్గొనాలి. గ్రామంలో చెత్త లేకుండా చేయడానికి అంతా కలిసి రోజంతా శ్రమదానం చేద్దాం. అందరూ గడ్డపార, తట్ట పట్టుకొని రావాలి. భోజనం నేనే పెట్టిస్త’’ గ్రామస్తులతో అన్నారు. నాలుగు ముక్కలుగా పనిని విభజించుకుందామని, జిల్లేడు, సర్కార్ తుమ్మచెట్లు పూర్తిగా తొలగిద్దామని, ఆ చెట్లు దారిద్య్రానికి హేతువులని అన్నారు. మున్ముందు 24 గంటల కరెంట్... ‘‘మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలుండె. ఇప్పుడా బాధ లేదు. కరెంట్ కోతలను నివారించాం. మున్ముందు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ తెస్త. నేను ఇంతకుముందే అసెంబ్లీలో చెప్పిన. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎలక్షన్ల ఓట్లు అడగనని. అదే మాట మీద ఉంట. గోదావరి జలాలు తెస్త. నియోజకవర్గంలోని పాములపర్తిలో 20 టీఎంసీల పెద్ద రిజర్వాయర్ కడుతున్నం. అది పూర్తయితే మనకు సాగునీటి బాధలు ఉండవు’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రామ్రెడ్డి, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గడా) ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మీ బతుకులు మారుస్తా.. చెత్తపై యుద్ధం ప్రకటించి గ్రామం రూపురేఖలు మార్చడమే కాదు.. మీ బతుకులూ మారుస్తానని సీఎం గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ‘‘మీరు ముందుగాల నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వెళ్లండి. నేను 1986లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచాక వెళ్లి ఆ గ్రామంపై అధ్యయనం జరిపితే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారి వ్యవసాయం కొత్తగా ఉంది. సంఘటితంగా ఉండటం వల్ల ఎన్నో విజయాలు సాధించారు. గ్రామంలో ఇప్పటివరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. బ్యాంకుల్లో వారి డిపాజిట్లు అప్పట్లోనే రూ.22 కోట్లు ఉన్నయ్. ఎర్రవల్లి కూడా మరో అంకాపూర్ కావాలి. గ్రామంలో ఎవరిని ఎలా ఆదుకోవాలి. విద్యార్హతలను బట్టి ఎలా ఉపాధి కల్పించాలి అనేది అధికారులు ప్రతి కుటుంబం నుంచి ఫార్మాట్ తీసుకుంటరు. విద్యార్హతలు లేనివారినీ ఆదుకుంటాం. బర్లు, గొర్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్న. అంతేకాదు గ్రామంలోని రైతులందరికీ డ్రిప్ పథకం వర్తింపజేస్తా’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
దండులా కదలాలె
సంఘటితమై ‘పవర్’ చాటాలె.. - గ్రామాల ప్రగతికి బాటలు వేయాలె - ఎర్రవల్లి ‘గ్రామజ్యోతి’లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు - గ్రామంలో వీధులన్నీ కలియతిరిగిన సీఎం - పారిశుద్ధ్యం, ప్రజాసమస్యలపై ఆరా - నేడు ‘చెత్తపై యుద్ధా’నికి సీఎం నిర్ణయం గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఊరు బాగుకు కదలాలె.. సంఘటితమై ‘పవర్’ ఏమిటో చాటాలె.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్.. అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం.. మనం మేల్కొనాలె’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్వహించిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలో వీధులన్నీ కలియతిరిగి పారిశుద్ధ్యం తీరును పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రంలతోపాటు వివిధ శాఖల అధికారులతో గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సమీక్ష జరిపారు. అనంతరం సభలో గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రజా చైతన్యంతోనే ప్రగతికి బాటలు పడతాయి..’ అంటూ పేర్కొన్నారు. ‘గ్రామం లో 1500 మంది పైచిలుకు జనాభా ఉంది. చి న్న పిల్లలు, వృద్ధులు సుమారు 500 మందిని మినహాయిద్దాం. మిగిలిన 1000 మంది ఒక్కటై సంఘటిత శక్తిని చాటుదాం. ఏళ్ల తరబడి పాములు, తేళ్లు పారే ఇండ్లల్లో బతికినం. ఇప్పటికైనా ఈ దుస్థితి మారాలె’ అంటూ చైతన్యపరిచారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించి ఆ తర్వాత శిథిలమైన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా విశాలమైన రోడ్ల నిర్మాణానికి బాటలు వేసుకోవాల్సిన అవసరముందన్నారు. పారిశుద్ధ్యంలో వరంగల్ జిల్లా గంగదేవునిపల్లి మనకు ఆదర్శం కావాలన్నారు. అందరూ పట్టించుకుంటే చిటికె లో సమస్యలు పరిష్కారమవుతాయని వివరిం చారు. 6, 7 నెలల్లో గ్రామాన్ని పూర్తిగా మార్చేద్దామని చెప్పారు. గ్రామాన్ని బాగుచేసుకోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయే రోజు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ‘నా ఫామ్‌హౌస్ ఇక్కడనే ఉం ది. ఇది నా ఊరు. అటుపోయినపుడు, ఇటుపోయినపుడు వస్త. మీ వెంట ఉండి సమస్యలు పరిష్కరిస్తా’నని భరోసా ఇచ్చారు. ‘గ్రామంలో బస్తీలన్నీ అద్దంలా మారాలె. ఆరేడు నెలల్లో మంచినీటి కోసం ఏ ఆడపడుచు రోడ్డుమీదికి రావొద్దు. అలా వచ్చిందంటే ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయా లె అన్నారు. ‘మరో నాలుగేళ్లల్లో ఈ గ్రామానికి రూ. 74లక్షలు వస్తాయి. వీటితోపాటు మరిన్ని నిధులు మీకు ఇస్త. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తా’ అంటూ పునరుద్ఘటించారు. రాజకీయాలు గిప్పుడెందుకు? గ్రామంలో అంతా కలిసికట్టుగా ముందు కు సాగాల్సిన అవసరముందని సీఎం హితవు పలికారు. ‘ఎలక్షన్లు వచ్చినపుడు రాజకీయాల సంగతి చూద్దాం. ఇప్పుడొద్దు’ అంటూ సూచిం చారు. గ్రామంలో ‘సర్వవర్గ సమితి’ పేరిట కమిటీని ఏర్పాటుచేసుకోవాలని, ఇందులో అన్ని కులాలకు ప్రాతినిథ్యం దక్కేలా చూడాల న్నారు. ఈ కమిటీ నిర్ణయాల మేరకు ముందు కు సాగాలన్నారు. బ్రెజిల్ దేశంలోని లియోడిజనిరో పట్టణం కాలుష్యం లేని ప్రాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఎప్పుడూ తమగురించే ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని కోరారు. గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల సాధనకు తమవంతు ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామంలో శుక్రవారం ‘చెత్తపై యుద్ధం’ కార్యక్రమం చేపడదామని సీఎం పిలుపునివ్వగా గ్రామస్తులు చప్పట్లతో హర్షామోదం పలికారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. ‘చప్పట్లు కొట్టినట్లు గాదు... నాతో పంచాయతీ గొట్టు ఉంటది. పని అయిపోయేదాక వెంటపడత. అందరూ సహకరించాలె’ అంటూ పేర్కొనగా గ్రామస్తులు ముఖ్యమంత్రికి తాము ఎల్లపుడూ సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగరపంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నేతలు జహంగీర్ తదితరలు పాల్గొన్నారు.