బంగారువల్లి కావాలె | Grama Jyothi is aimed at development: KCR | Sakshi
Sakshi News home page

బంగారువల్లి కావాలె

Published Fri, Aug 21 2015 2:07 AM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

బంగారువల్లి కావాలె - Sakshi

బంగారువల్లి కావాలె

గజ్వేల్: ‘‘గ్రామజ్యోతి అంటూ సీఎం ఉరుకులాడుతుండు.. ఆయన ఉండే ఎర్రవల్లి సంగతేంది? అని అందరూ అనుకునే పరిస్థితి రావొద్దు. నా ఊరు చిన్నతనం కావొద్దు. ఈ ఎర్రవల్లి బంగారువల్లిగా మారాలె. రాష్ట్రంలోనే నంబర్ వన్ గ్రామంగా అవతరించాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ‘గ్రామజ్యోతి’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధులన్నీ కలియతిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్యం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ..

‘‘ఏడ్వదలుచుకుంటే గంటసేపు ఏడ్చే బాధ ఉంది. ఇబ్బంది ఉంది. కానీ ఏడిస్తే పని కాదు కదా! నేను ఎర్రవల్లిలో ఉండే తెలంగాణ తెచ్చిన. ఎన్నో విజయాలను అందుకున్న. ఇప్పుడు ఈ ఊరిని మార్వలేనా? మీరంతా నాకు సహకరించండి. ఈ గ్రామం రూపురేఖలు మారుస్తా’’ అని పేర్కొన్నారు. ‘‘నేను తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఈ బక్కోనితోని ఏమైతది. బొండిగె పిసికితే పోతడు అని అవమానపరిచారు. అయినా బాధ పడలే.

లక్ష్యం కోసం పనిజేసిన. అనుకున్నది సాధించిన. మీరు కూడా మన ఊరి బాగుకు కదలాలే.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్ అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం. మనం మేల్కోనాలె’’ అని వ్యాఖ్యానించారు. గ్రామానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నానని, ఆయన గ్రామం రూపురేఖలు మార్చటానికి సహకరిస్తారని చెప్పారు. ‘‘గ్రామంలో 231 పెంకుటిండ్లు, 107 ఆర్‌సీసీ బిల్డింగ్‌లు, 40 కూలిపోయేదశలో ఉన్న ఇండ్లు, మరో 10 గుడిసెలు, వలస వెళ్లటం వల్ల మరో 30-40 వృథాగా ఉన్న ఇండ్లు ఉన్నాయ్..

మీరు చేయాల్సిందల్లా ఒకటే! కరాబైన ఇండ్లను కూల్చేసుకొని కొత్త ఇండ్లు కట్టుకోవాలి. గ్రామానికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నా’’ అని ప్రకటించారు. దీంతో గ్రామస్తులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయగా.. ‘‘చప్పట్లు కొట్టినట్లు కాదు. ఊరి కోసం కష్టపడాలి’’ అని సీఎం పేర్కొన్నారు. గ్రామం రూపురేఖలు మార్చుకొని రోడ్లు పెద్దగా చేసుకుందామని, ఇందుకు అధికారులు ప్లాన్ ఇస్తారని వివరించారు. ‘‘నేను రాత్రికి ఇక్కడ్నే ఉంటా. శుక్రవారం వస్తా.

అందరం కలిసి శ్రమదానం చేద్దాం. నేను మీతో కలిసి శ్రమదానం చేస్తా. మీరు ఎన్ని తట్టల మట్టి మొయ్యిమంటే అన్ని మోస్తా. మోరీలు సాప్ చేయమంటే చేస్తా. రేపు మాత్రం అందరూ ఇందులో పాల్గొనాలి. గ్రామంలో చెత్త లేకుండా చేయడానికి అంతా కలిసి రోజంతా శ్రమదానం చేద్దాం. అందరూ గడ్డపార, తట్ట పట్టుకొని రావాలి. భోజనం నేనే పెట్టిస్త’’ గ్రామస్తులతో అన్నారు. నాలుగు ముక్కలుగా పనిని విభజించుకుందామని, జిల్లేడు, సర్కార్ తుమ్మచెట్లు పూర్తిగా తొలగిద్దామని, ఆ చెట్లు దారిద్య్రానికి హేతువులని అన్నారు.
 
మున్ముందు 24 గంటల కరెంట్...
‘‘మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలుండె. ఇప్పుడా బాధ లేదు. కరెంట్ కోతలను నివారించాం. మున్ముందు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ తెస్త. నేను ఇంతకుముందే అసెంబ్లీలో చెప్పిన. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎలక్షన్ల ఓట్లు అడగనని. అదే మాట మీద ఉంట. గోదావరి జలాలు తెస్త. నియోజకవర్గంలోని పాములపర్తిలో 20 టీఎంసీల పెద్ద రిజర్వాయర్ కడుతున్నం. అది పూర్తయితే మనకు సాగునీటి బాధలు ఉండవు’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రామ్‌రెడ్డి, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(గడా) ఓఎస్‌డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
 
మీ బతుకులు మారుస్తా..
చెత్తపై యుద్ధం ప్రకటించి గ్రామం రూపురేఖలు మార్చడమే కాదు.. మీ బతుకులూ మారుస్తానని సీఎం గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ‘‘మీరు ముందుగాల నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వెళ్లండి. నేను 1986లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచాక వెళ్లి ఆ గ్రామంపై అధ్యయనం జరిపితే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారి వ్యవసాయం కొత్తగా ఉంది. సంఘటితంగా ఉండటం వల్ల ఎన్నో విజయాలు సాధించారు.

గ్రామంలో ఇప్పటివరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. బ్యాంకుల్లో వారి డిపాజిట్లు అప్పట్లోనే రూ.22 కోట్లు ఉన్నయ్. ఎర్రవల్లి కూడా మరో అంకాపూర్ కావాలి. గ్రామంలో ఎవరిని ఎలా ఆదుకోవాలి. విద్యార్హతలను బట్టి ఎలా ఉపాధి కల్పించాలి అనేది అధికారులు ప్రతి కుటుంబం నుంచి ఫార్మాట్ తీసుకుంటరు. విద్యార్హతలు లేనివారినీ ఆదుకుంటాం. బర్లు, గొర్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్న. అంతేకాదు గ్రామంలోని రైతులందరికీ డ్రిప్ పథకం వర్తింపజేస్తా’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement