
పండుగ తర్వాత ప్రజా దర్బార్
ప్రగతి భవన్‌లో జనంతో సీఎం కేసీఆర్ ముఖాముఖి
కులాలు, వర్గాలవారీగా సమావేశాలు
సమస్యలు, పరిష్కారాలు పంచుకునే యోచన
సీఎంఓ అధికారులు, సన్నిహిత మంత్రులతో ఇప్పటికే మంతనాలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభానికి సీఎం కె.చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ వేది కగా ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులు, సన్ని హిత మంత్రులతో సీఎం ఇప్పటికే సమాలోచ నలు జరిపారు. దర్బార్ నిర్వహణకు అనుస రించాల్సిన విధానాలను చర్చించారు. అన్ని కులాలు, వర్గాలతో సమావేశమయ్యేలా ప్రణా ళిక ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిశ్చయించారు. దీంతోపాటు తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చే బాధితులు, ఆపన్నులను సైతం తనను కలిసేందుకు వీలు కల్పించాలని సూచించారు. దీంతో రెండు విధాలుగా ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశాలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
జనహిత భవన్‌లో సమాలోచన...
ప్రగతి భవన్ సముదాయంలోనే దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా ఇప్పటికే హాల్‌ను నిర్మించారు. సీఎం దీనికి ‘జనహిత భవన్’ అని పేరు పెట్టారు. రైతులు, కార్మికు లు, ఉద్యోగులు, కళాకారులు తదితర వర్గాల తో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ విధానాల రూప కల్పన, కార్యక్రమాల అమలుపై వారితో సమాలోచనలు జరుపుతారు. ఈ సమావేశాల నిర్వహణకు వీలుగానే మీటింగ్ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చిన కొత్తలో ఎమ్మార్వోలు, ఎంపీడీవో లతో సీఎం సమావేశమైన తరహాలోనే ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకా ల లబ్ధిదారులు, వృత్తులు, కులాలు, సంఘా లు, యూనియన్లవారీగా ప్రతి వర్గంతో సీఎం నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలకు షెడ్యూ లు ఖరారు చేస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సమావేశానికి వచ్చే వారికి రానుపోను రవాణా సదుపాయంతోపాటు ప్రగతి భవన్ సముదాయంలోనే భోజన ఏర్పాట్లు చేయా లని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, బంగారు తెలంగాణ లక్ష్య సాధన ఇతివృత్తంతో రూపొందించిన డాక్యు మెంటరీలు, వీడియో క్లిప్పింగులు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. క్షేత్రస్థాయిలో వారి సాధక బాధకాలు, సమస్యలను వివరించే అవకాశం కల్పించటంతోపాటు చివరగా ముఖ్యమంత్రి సందేశమిచ్చేలా సమావేశాలకు రూపకల్పన చేస్తున్నారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రీనింగ్...
ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే జనాన్ని నియంత్రించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ విధానంలో సీఎంను కలవాల నుకుంటున్న అర్జీదారులు ముందుగా సంబంధిత కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. నిజంగానే అది సీఎం దృష్టికి వెళ్లాల్సిన అంశమని కలెక్టర్లు భావిస్తే వారికి అవకాశం కల్పిస్తారు. ఏరోజు వెళ్లాలనే సమాచా రంతోపాటు ఉచిత రవాణా సదుపాయం కల్పించే కూపన్ కూడా ఇస్తారు. కేవలం అవసరమున్న వారు, బాధితులు, ఆపన్నులు, అర్జీదారులు మాత్రమే సీఎంను కలిసేందుకు ఈ నియంత్రణ ఏర్పాట్లు ఉండాలని యోచిస్తున్నారు.