
ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం
మెదక్ : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత మహాచండీయాగం నాలుగో రోజు శనివారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ దంపతులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి యాగశాలకు చేరుకున్నారు. ఈ రోజు యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరయ్యారు. అలాగే ఎన్సీపీ నేత శరద్ పవర్తో పాటు సుప్రీంకోర్టు నాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఈ యాగ స్థలికి విచ్చేశారు.
అయితే ఉదయం నుంచే ఎర్రవల్లికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ పెరగడంతో యాగశాల వద్ద మరో రెండు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ యాగం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు భక్తులు భారీ సంఖ్యలో ఎర్రవల్లికి తరలి వచ్చే అవకాశం ఉంది.