మహాయాగం.. శుభారంభం | ayutha chandi yagam started in erravelli | Sakshi
Sakshi News home page

మహాయాగం.. శుభారంభం

Published Thu, Dec 24 2015 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

మహాయాగం.. శుభారంభం - Sakshi

మహాయాగం.. శుభారంభం

ఎర్రవల్లిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

  •  మొదలైన అయుత చండీ మహాయాగం

 అయుత చండీ యాగశాల నుంచి  ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం అత్యంత వైభవంగా ఆరంభమైంది. వేద పండితులు, రుత్విజులు, భక్తజన సందోహంతో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అయుత చండీ మహాయాగం నిర్ణయించిన ముహూర్తం మేరకు బుధవారం ఉదయం ప్రారంభమైంది. 8.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు యాగశాల ఆవరణ ప్రవేశం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం వెంట వచ్చారు. రుత్విక్కులు, బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు.  అనంతరం రుత్విక్కులతో కలసి సీఎం యాగశాల ప్రదక్షిణ చేశారు. సీఎంతోపాటు అందరూ మొదటి రోజున నిర్దేశించిన పసుపు రంగు దీక్షా వస్త్రాలు ధరించారు. శృంగేరి శారదా పీఠాధిపతి శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాగంలో రుత్విక్కులు తొలి రోజు ఒక పారాయణం, 4 వేల జపాలు చేశారు.

 త్రైలోక్యగౌరీ వ్రతంలో అంకురార్పణ
 గవర్నర్ నరసింహన్ దంపతులు 8.45 గంటలకు యాగశాలకు రాగా.. వారికి ముఖ్యమంత్రి దంపతులు, రుత్విజులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చండీమాత విగ్రహం ముందు గురుప్రార్థనతో మొదటి రోజు కార్యక్రమం మొదలైంది. సీఎం దంపతులు, గవర్నర్ దంపతులు పూజలో పాల్గొన్నారు. మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసి నిర్విఘ్న సమాప్తికై గణపతిమోదక హవనం చేశారు. త్రైలోక్యగౌరీ వ్రతంతో చండీయాగానికి అంకుర్పారణ జరిగింది. యాగం జరుగుతున్నంత సేపు కేసీఆర్‌కు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మ దంపతులు ఆయన వెంటే ఉన్నారు. అంతకుముందు వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గోపీకృష్ణశర్మ తదితరులు పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరం కలిపి మంత్రయుక్తంగా యాగశాల మంటపాన్ని శుద్ధి చేశారు.

 పూజా కార్యక్రమాలివీ..
 ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులు కలిసి గోపూజ, మహామంటప స్థాపన, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతాహ్వానం, ప్రాణప్రతిష్ట, నవా వరుణార్చన, మహారుద్రయాగ సంకల్పం, రాజ శ్యామల పునఃశ్ఛరణ, చతుర్వేద యాగ ప్రారంభం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 10:30 గంటలకు మహా మంగళహారతి పూర్తి చేసి యాగశాలను రుత్వికులకు అప్పగించారు. రాజ శ్యామల యాగం పూర్ణాహూతిలో ఆచార్య రవిశంకర్, వేద పండితులు కుప్పా రామజోగి సోమయాజులు పాల్గొని సీఎం దంపతులను ఆశీర్వదించారు. శృంగేరీ పీఠం పండితులు నరహరి సుబ్రహ్మణ్య భట్టు, తంగిరాల శివకుమార శర్మ పవిత్ర శ్రీచక్రానికి నవార్ల పూజాకల్పోక్తంగా ప్రత్యేక అర్చనలు జరిపారు. హంపీ విరూపాక్ష పీఠం అధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠం అధిపతులు శ్రీవీరశైవ మహాస్వామి పాల్గొని కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు.

 3 క్వింటాళ్ల కుంకుమ.. 5 వేల మంది మహిళలు
 100 హోమగుండాలు.. ప్రతి హోమగుండం చుట్టూ 11 మంది రుత్విక్కులు కూర్చొని ఏకోత్తర వృద్ధి (1,100 మంది రుత్విక్కులు ఏకకంఠంతో) సంప్రదాయంతో సప్తశతి పారాయణం, 4 వేల చండీ నవాక్షరీ జపం చేశారు. 11:25 గంటలకు ఏకకంఠంతో చండీయాగ పారాయణం ప్రారంభించి.. నిర్విఘ్నంగా మధ్యాహ్నం 1:40 వరకు కొనసాగించి 4 వేల చండీ నవాక్షరీ జపాలను పూర్తి చేయడంతో తొలిరోజు క్రతువు ముగిసింది. ఇదే సమయంలో మరో 400 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి, ముత్తయిదువులతో కుంకుమార్చన నిర్వహించారు. 3 క్వింటాళ్ల కుంకుమతో 5 వేల మంది మహిళలతో లలితా సహస్ర నామాలతో గౌరీదేవికి కుంకుమార్చన చేశారు. యాగం జరుగుతున్నంతసేపు సీఎం దంపతులు మంచినీళ్లు కూడా ముట్టలేదు. యాగం జరుగుతున్నంతసేపు సైనిక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహించింది.

 ప్రముఖుల రాక..
 తొలి రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజున గవర్నర్ దంపతులతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, హన్మంత్ షిండే, బాబూమోహన్, ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాదవరం కృష్ణారావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్, రాములు నాయక్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు యాగాన్ని వీక్షించారు.

 అద్భుతంగా యాగశాల
 రెల్లు గడ్డితో అత్యద్భుతంగా నిర్మించిన చండీ మహాయాగ శాల భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ప్రాంగణమంతా భక్తి భావం ఉప్పొంగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సీఎం స్వీయ పర్యవేక్షణలో జరిగిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. తొలి రోజు ఎర్రవల్లికి వెళ్లే దారులన్నీ ప్రైవేటు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 25 వేల మంది భక్తులు యాగాన్ని తిలకించేందుకు వచ్చినట్లు అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement