ayutha chandi yagam
-
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. వేములవాడ నుంచి కేసీఆర్ నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగంలో నిన్న రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అయితే అగ్నిప్రమాదం కారణంగా యాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్...రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా శీతాకాలం విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ఈనెల 18న హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే బస చేస్తారు. -
అయుత చండీయాగం ముగింపు
-
మహాపూర్ణాహుతి ప్రారంభం
-
మహాపూర్ణాహుతి ప్రారంభం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం చివరి దిశకు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం యాగంలో ముగింపు కార్యక్రమమైన మహాపూర్ణాహుతి 2 వేల మంది రుత్వికులతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లిలో భక్తిశ్రద్దలతో చండీయాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు యాగశాల వద్ద అగ్నిప్రమాదం జరిగిందని ..ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరికాసేపట్లో శాస్త్రోక్తంగా యాగం ముగుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. యాగం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. -
చండీయాగంలో అపశ్రుతి, అగ్నిప్రమాదం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత మహాచండీయాగంలో చివరిరోజు అపశృతి చోటుచేసుకుంది. యాగం నిర్వహిస్తున్న యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలో మంటలు చెలరేగి యాగశాల మంటపం పైభాగానికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనతో చెల్లాచెదురయ్యారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు బారికేడ్లు తొలగించారు. యాగశాలలో ఉన్న ప్రముఖులు, ప్రజలను బయటకు పంపించారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒకేసారి పెద్ద మొత్తంలో హోమగుండంలో ఆవు నెయ్యి వేయండంతో మంటలు చెలరేగాయి. యాగ విరామ సమయంలో మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, యాగం యధావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. వెనుదిరిగిన రాష్ట్రపతి ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చండీయాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. చండీయాగంలో మంటలు వ్యాపించడంతో యాగప్రాంగణంలో కలకలం రేగింది. సరిగ్గా అదే సమయానికి హెలికాప్టర్ లో రాష్ట్రపతి అక్కడకు చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో రాష్ట్రపతి కిందకు దిగకుండానే వెనుదిరిగారు. -
చండీయాగంలో చంద్రబాబు
-
చండీయాగంలో చంద్రబాబు
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్నారు.మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు మంత్రులు సుజనాచౌదరి, కేఈ కృష్ణ మూర్తి, గంటా శ్రీనివాస్‌లు ఎర్రవల్లికి చేరుకున్నారు. బెజవాడ దుర్గమ్మ చీర, కుంకుమ, ప్రసాదాలను చంద్రబాబు తన వెంట తీసుకొచ్చారు. చంద్రబాబును ఆయుత చండీయాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ విజయవాడకు వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆదివారం చివరిరోజు ఆయుత చండీయాగం కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఎర్రవల్లి చేరుకున్నారు. -
ఎర్రవల్లి.. వేదవల్లి
♦ అరుణ వర్ణశోభితమైన యాగస్థలి ♦ నాలుగో రోజు 44 వందల సప్తశతి పారాయణాలు ♦11 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు ♦ ఇప్పటివరకు 11 వేల చండీ సప్తశతి పారాయణాలు ♦ కోటి నవార్ణ మంత్ర జపాలు పూర్తి.. యాగంలో ముగిసిన ప్రధాన ఘట్టం ♦ సుహాసిని, దంపతి పూజలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం నాలుగో రోజుతో యాగంలో 10 వేల సప్తశతి పారాయణాలు, కోటి నవార్ణ మంత్ర జపాలు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు ఎర్రవల్లి క్షేత్రానికి తరలివచ్చి సీఎంను ఆశీర్వదించారు. అరుణ వర్ణ వస్త్ర ధారణతో ఉదయం 9.30 గంటలకు సీఎం దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్విక్కులు కూడా ఎరుపు రంగు వస్త్రాలతో హోమగుండాల వద్దకు వచ్చారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన యజ్ఞ బ్రాహ్మణులు నరహరి సుబ్రహ్మణ్య భట్, తంగిరాల శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో మహా సరస్వతి, మహాకాళి, వరలక్ష్మి విగ్రహాల వద్ద కేసీఆర్, రుత్విక్కులు గురు ప్రార్థన చేశారు. దుర్గా దేవికి కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేశారు. గోపూజ, గణపతి హోమం, మహామంటప స్థాపన తదితర రోజువారీ పూజలు చేశారు. అనంతరం రుత్విక్కులు అమ్మవారిని ఆవాహన చేసుకున్నారు. గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా వచ్చి పూజలో పాల్గొన్నారు. ముగిసిన కీలక ఘట్టం 100 హోమగుండాల చుట్టూ 1,100 మంది రుత్విక్కులు ఆశీనులై పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఉదయం 11.25 గంటలకు ఏకోత్తర వృద్ధి పద్ధతిలో పారాయణాలు ప్రారంభించిన రుత్విక్కులు మధ్యాహ్నం 1.05 గంటల వరకు ఏకబిగిన 44 వందల సప్తశతి పారాయణాలు, 11 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. ఈ నాలుగు రోజుల్లో కలిపి రుత్వికులు మొత్తంగా 11 వేల సప్తశతి పారాయణాలు, 1.10 కోట్ల చండీ నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. చండీయాగంలో 10 వేల పారాయణాలు, కోటి నవార్ణ మంత్రాలు జపించడమే ముఖ్య నియమం. రుత్వికులు 11 వేల సప్తశతి పారాయణాలు, 1.10 కోట్ల నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేయడంతో చండీయాగ ప్రధాన క్రతువు ముగిసినట్టయింది. తరలివచ్చిన ప్రముఖులు.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ రాజశేఖరరెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, జస్టిస్ స్వరూప్‌రెడ్డి, జస్టిస్ గోపాల్‌రెడ్డి యాగంలో పాల్గొన్నారు. మంత్రులు టి.హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి,డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, రాజ్యసభ సభ్యుడు సుబ్బ రామిరెడ్డి, సినీ నటుడు నాగార్జున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నటుడు శివారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తదితరులు యాగానికి తరలివచ్చారు. నేడు సీఎం ప్రత్యేక వస్త్రధారణ చండీయాగం చివరి రోజున రుత్విక్కులు పసుపు వర్ణ వస్త్రాలను ధరించనున్నారు. ఈ నాలుగు రోజులు రుత్విక్కులతోపాటుగానే వస్త్రధారణ చేసిన కేసీఆర్ చివరి రోజు ప్రత్యేక పట్టు వస్త్రాలను ధరించనున్నారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి తన ప్రత్యేక దూత ద్వారా కేసీఆర్‌కు ఆశీర్వచనాలతోపాటుగా పట్టువస్త్రాలు పంపించారు. యాగం ముగింపు రోజున కేసీఆర్ వాటినే ధరిస్తారని యాగ నిర్వాహకులు తెలిపారు. తల్లీ.. కేసీఆర్‌కు శక్తిని ప్రసాదించు: సోమయాజులు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందుకు కేసీఆర్‌కు తగిన శక్తి ప్రసాదించాలని వేద పండితులు మాడుగుల మాణిక్య సోమయాజులు అమ్మవారిని ప్రార్థించారు. వేద విద్య వికాసానికి ఆరు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా సేవలందిస్తున్న మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులను శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా సోమయాజులుకు స్వర్ణ కంకణం తొడిగారు. అమ్మవారికి పూర్ణాహుతి తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు శనివారం చండీయగానికి తరలిచ్చారు. వీరికి కేసీఆర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్విక్కుల పారాయణం అనంతరం మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకాంబరి, బీమా, రక్తదంతిక, దుర్గ, బ్రామరి నవ దుర్గలకు సీఎంతోపాటు గవర్నర్ రోశయ్య, శరద్ పవార్, ఎన్వీ రమణ కలిసి బలిప్రదానం, సుహాసిని, దంపతీ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి హోమగుండంలో పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమతో పూర్ణాహుతి జరిపించారు. రోశయ్య, శరద్ పవార్, ఎన్వీ రమణలకు సీఎం వెండితో చేసిన దుర్గామాతా విగ్రహాలను అందజేశారు. ఇతర ప్రముఖులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి గోపాల కృష్ణ, మాధవీనందస్వామి, కపిలేశ్వర స్వామి, కమలానంద భారతి తదితరులు కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. ఒకే ఒక్కడు! అన్నింటా తానై వ్యవహరిస్తున్న హరీశ్ తెలంగాణ ఉద్య మం.. గోదావరి పుష్కరాలు.. అయుత చండీయాగం.. ఏ సందర్భం అయినా అన్నింటా ఆయనే! ఉద్యమకారుడిగా.. ప్రజాప్రతినిధిగా ఆయన చూపు ఎప్పుడూ జనం వైపే! అధినేత స్కెచ్ వేస్తే దానికి తగిన ప్లాన్ గీసే మంత్రి హరీశ్‌రావు చండీయాగంలోనూ అన్ని తానై నడిపిస్తున్నారు. ఉదయం అతిథులు, ముఖ్య అతిథులకు ఆహ్వానం పలకడం.. సామాన్య భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టడం.. వాకీటాకీ పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడం వరకూ భిన్న పాత్రలు పోషిస్తున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో ధర్మపురి వద్ద భారీగా స్తంభించిపోయిన ట్రాఫిక్‌ను హరీశ్ నియంత్రించారు. తాజాగా చండీయాగంలో ఎర్రవల్లి వద్ద రోజూ ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తుతున్నారు. శుక్రవారం ఆయన దాదాపు గంటపాటు శ్రమించి ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం కూడా ట్రాఫిక్ అదుపులోకి రాకపోవడంతో మంత్రి కాసేపు మైక్ అనౌన్సర్‌గా మారారు. ‘నేను హరీశ్‌రావును మాట్లాతున్నా..’ అని పరిచయం చేసుకుని.. సాధారణ, వీఐపీ, వీవీఐపీ మూడు దారుల గుండా భక్తులకు దారి కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ‘అమ్మా, ముందుకు కదలాలి. మీరు ముందుకు కదిలితేనే వెనుక వారికి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది.. కదలాలే తల్లీ... కదలాలే.. ముందుకు పదా బిడ్డా..’ అంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు. దీంతో క్యూలైన్లలో భక్తులు వేగంగా ముందుకు కదిలారు. అంచనాలకు మించి.. చండీయాగం సంకల్పించిన సమయంలో రోజుకు 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్టుగా భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎర్రవల్లి గ్రామ సమీపంలో దాదాపు 50 వేల చదరపు అడుగులతో భారీ భోజనశాల ఏర్పాటు చేశారు. కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉత్కృష్ట యాగం కావడం, దానికితోడు వరుస సెలవులు రావడంతో భక్తులు అంచనాకు మించి నాలుగైదు రెట్లు ఎక్కువగా తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మంత్రి హరీశ్.. తానే స్వయంగా వంటశాలకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 80 పొయ్యిలపై రోజుకు 14 టన్నుల బియ్యం వండివారుస్తున్నారు. నాలుగో రోజు.. అదే హోరు ఇప్పటిదాకా దర్శించుకున్నది 7 లక్షలపైనే చండీయాగానికి నాలుగో రోజైన శనివారం జన ప్రవాహం మరింతగా పెరిగింది. పోలీసులు ఎక్కడికక్కడా కట్టడి చేసినా తోపులాటలు ఆగలేదు. పలుచోట్ల బారికేడ్లు విరిగాయి. యాగశాల ప్రధాన ద్వారం వద్ద కు వీవీఐపీలు మినహా ఎవరినీ అనుమతించలేదు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్యూలైన్లలో రద్దీ అధికంగా కనిపించింది. నిమిషానికి 500 మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ జనం క్యూలైన్ల నుంచి యాగ స్థలికి చేరుకోవాలంటే గంటల తరబడి సమయం పట్టింది. వృద్ధులు, చిన్నారులు నానా యాతన పడ్డారు. పోలీస్ కంట్రోల్ రూం వెనుక భాగంలోని క్యూలైన్ల బారికేడ్లు విరిగిపడ్డాయి. జనం బారికేడ్లను దాటుకుంటూ వెళ్లడంతో స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. బారికేడ్లు విరిగిపడిన ప్రదేశానికి వెళ్లాలంటూ కలెక్టర్‌కు, అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ క్యూలైన్ల వద్దకు వెళ్లి చేతులు జోడించి సహకరించాలని భక్తులను కోరారు. ఈ 4 రోజుల్లో 7 లక్షలకు పైగా భక్తులు చండీ మాతను దర్శించుకున్నట్టు అంచనా. చండీయాగం.. క్షణ క్షణం 9:30 గంటలు: యాగస్థలికి చేరుకున్న కేసీఆర్ దంపతులు 10.05: గణపతి హోమం 10:22: యాగశాల చుట్టూ కేసీఆర్ ప్రదక్షిణలు 11:15: పారాయణాలను ప్రారంభించిన రుత్విక్కులు 12:45: 44 వందల సప్తశతి పారాయణాలు, 11 లక్షల నవార్ణ మంత్రజపాలు పూర్తి చేసిన రుత్విక్కులు 1:12: అమ్మవారికి వేద పండితుల మంగళ హారతులు 1:40: భోజనశాలకు వెళ్లిన రుత్విక్కులు 1:45: భోజన విరామానికి సీఎం 4:55: తిరిగి యాగశాలకు రాక రాత్రి 9:00: కొనసాగిన ప్రవచ నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేడు యాగానికి రాష్ట్రపతి కేంద్ర బలగాల అధీనంలో యాగస్థలి రేపు వేములవాడకు కేసీఆర్ అయుత చండీ మహాయాగానికి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారు. దీంతో శనివారమే కేంద్ర బలగాలు యాగస్థలిని తమ అధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 50 మందికిపైగా అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. రాష్ట్రపతి హెలిప్యాడ్, అక్కడ్నుంచి యాగస్థలికి వెళ్లే మార్గం, విశ్రాంతి గది తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రపతి సికింద్రాబాద్‌లోని విడిది నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి యాగస్థలికి చేరుకుంటారు. యాగంలో పాల్గొన్న అనంతరం తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాగశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. నేటితో యాగం పూర్తి.. అయుత చండీ మహాయాగం ఆదివారంతో ముగియనుంది. యాగం తర్వాత అక్కడే నిద్ర చేయాలనే నియమం మేరకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, నిర్వాహకులు రాత్రి యాగస్థలిలోనే నిద్రించనున్నారు. సోమవారం ఉదయం ఎర్రవల్లి నుంచి బయలుదేరి వేములవాడ వెళ్లి, రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. నేడు యాగానికి బాబు సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం అయుత చండీయాగంలో పాల్గొననున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వైఎస్ చౌదరి యాగంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 10కు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకునే చంద్రబాబు హెలికాప్టర్లో ఎర్రవల్లి వెళతారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ చేరుకు ని రాత్రికి బస చేస్తారు. -
ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం
-
ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం
మెదక్ : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత మహాచండీయాగం నాలుగో రోజు శనివారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దంపతులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి యాగశాలకు చేరుకున్నారు. ఈ రోజు యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరయ్యారు. అలాగే ఎన్సీపీ నేత శరద్ పవర్‌తో పాటు సుప్రీంకోర్టు నాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఈ యాగ స్థలికి విచ్చేశారు. అయితే ఉదయం నుంచే ఎర్రవల్లికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ పెరగడంతో యాగశాల వద్ద మరో రెండు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ యాగం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు భక్తులు భారీ సంఖ్యలో ఎర్రవల్లికి తరలి వచ్చే అవకాశం ఉంది. -
ఎర్రవల్లిలో మరింత రద్దీ
జగ్దేవ్పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. అయుత చండీయాగం చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం ఉదయం మరింత పెరిగింది. చివరి రెండు రోజులు కావటంతో శనివారం ఉదయానికే సుమారు 80 వేల మంది యాగశాలకు చేరుకున్నారు. యాగశాల వైపునకు వచ్చే బైక్‌లు సహా వాహనాలను నర్సన్నపేట్, ప్రజ్ఙాపూర్, గౌరారం, తుర్కపల్లి వద్దనే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నానికి రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. -
నేడు నాలుగో రోజు అయుత చండీయాగం
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. నేడు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలు పూజలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈ యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరుకానున్నారు. ఈ యాగానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు యాగం నిర్వహాకులు తెలిపారు. అయితే ఈ చండీయాగం ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యాగానికి విచ్చేయనున్నారు. -
వైభవంగా 3వ రోజు అయుత చండీ యాగం
-
నేడు ద్వాసహస్ర చండీ పారాయణం
-
మహాయాగం.. శుభారంభం
-
మహాయాగం.. శుభారంభం
ఎర్రవల్లిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మొదలైన అయుత చండీ మహాయాగం అయుత చండీ యాగశాల నుంచి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం అత్యంత వైభవంగా ఆరంభమైంది. వేద పండితులు, రుత్విజులు, భక్తజన సందోహంతో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అయుత చండీ మహాయాగం నిర్ణయించిన ముహూర్తం మేరకు బుధవారం ఉదయం ప్రారంభమైంది. 8.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు యాగశాల ఆవరణ ప్రవేశం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం వెంట వచ్చారు. రుత్విక్కులు, బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రుత్విక్కులతో కలసి సీఎం యాగశాల ప్రదక్షిణ చేశారు. సీఎంతోపాటు అందరూ మొదటి రోజున నిర్దేశించిన పసుపు రంగు దీక్షా వస్త్రాలు ధరించారు. శృంగేరి శారదా పీఠాధిపతి శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాగంలో రుత్విక్కులు తొలి రోజు ఒక పారాయణం, 4 వేల జపాలు చేశారు. త్రైలోక్యగౌరీ వ్రతంలో అంకురార్పణ గవర్నర్ నరసింహన్ దంపతులు 8.45 గంటలకు యాగశాలకు రాగా.. వారికి ముఖ్యమంత్రి దంపతులు, రుత్విజులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చండీమాత విగ్రహం ముందు గురుప్రార్థనతో మొదటి రోజు కార్యక్రమం మొదలైంది. సీఎం దంపతులు, గవర్నర్ దంపతులు పూజలో పాల్గొన్నారు. మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసి నిర్విఘ్న సమాప్తికై గణపతిమోదక హవనం చేశారు. త్రైలోక్యగౌరీ వ్రతంతో చండీయాగానికి అంకుర్పారణ జరిగింది. యాగం జరుగుతున్నంత సేపు కేసీఆర్‌కు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మ దంపతులు ఆయన వెంటే ఉన్నారు. అంతకుముందు వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గోపీకృష్ణశర్మ తదితరులు పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరం కలిపి మంత్రయుక్తంగా యాగశాల మంటపాన్ని శుద్ధి చేశారు. పూజా కార్యక్రమాలివీ.. ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులు కలిసి గోపూజ, మహామంటప స్థాపన, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతాహ్వానం, ప్రాణప్రతిష్ట, నవా వరుణార్చన, మహారుద్రయాగ సంకల్పం, రాజ శ్యామల పునఃశ్ఛరణ, చతుర్వేద యాగ ప్రారంభం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 10:30 గంటలకు మహా మంగళహారతి పూర్తి చేసి యాగశాలను రుత్వికులకు అప్పగించారు. రాజ శ్యామల యాగం పూర్ణాహూతిలో ఆచార్య రవిశంకర్, వేద పండితులు కుప్పా రామజోగి సోమయాజులు పాల్గొని సీఎం దంపతులను ఆశీర్వదించారు. శృంగేరీ పీఠం పండితులు నరహరి సుబ్రహ్మణ్య భట్టు, తంగిరాల శివకుమార శర్మ పవిత్ర శ్రీచక్రానికి నవార్ల పూజాకల్పోక్తంగా ప్రత్యేక అర్చనలు జరిపారు. హంపీ విరూపాక్ష పీఠం అధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠం అధిపతులు శ్రీవీరశైవ మహాస్వామి పాల్గొని కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. 3 క్వింటాళ్ల కుంకుమ.. 5 వేల మంది మహిళలు 100 హోమగుండాలు.. ప్రతి హోమగుండం చుట్టూ 11 మంది రుత్విక్కులు కూర్చొని ఏకోత్తర వృద్ధి (1,100 మంది రుత్విక్కులు ఏకకంఠంతో) సంప్రదాయంతో సప్తశతి పారాయణం, 4 వేల చండీ నవాక్షరీ జపం చేశారు. 11:25 గంటలకు ఏకకంఠంతో చండీయాగ పారాయణం ప్రారంభించి.. నిర్విఘ్నంగా మధ్యాహ్నం 1:40 వరకు కొనసాగించి 4 వేల చండీ నవాక్షరీ జపాలను పూర్తి చేయడంతో తొలిరోజు క్రతువు ముగిసింది. ఇదే సమయంలో మరో 400 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి, ముత్తయిదువులతో కుంకుమార్చన నిర్వహించారు. 3 క్వింటాళ్ల కుంకుమతో 5 వేల మంది మహిళలతో లలితా సహస్ర నామాలతో గౌరీదేవికి కుంకుమార్చన చేశారు. యాగం జరుగుతున్నంతసేపు సీఎం దంపతులు మంచినీళ్లు కూడా ముట్టలేదు. యాగం జరుగుతున్నంతసేపు సైనిక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహించింది. ప్రముఖుల రాక.. తొలి రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజున గవర్నర్ దంపతులతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, హన్మంత్ షిండే, బాబూమోహన్, ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాదవరం కృష్ణారావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్, రాములు నాయక్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు యాగాన్ని వీక్షించారు. అద్భుతంగా యాగశాల రెల్లు గడ్డితో అత్యద్భుతంగా నిర్మించిన చండీ మహాయాగ శాల భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ప్రాంగణమంతా భక్తి భావం ఉప్పొంగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సీఎం స్వీయ పర్యవేక్షణలో జరిగిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. తొలి రోజు ఎర్రవల్లికి వెళ్లే దారులన్నీ ప్రైవేటు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 25 వేల మంది భక్తులు యాగాన్ని తిలకించేందుకు వచ్చినట్లు అంచనా. -
ఎర్రవల్లి పిలుస్తోంది!
దేశం దృష్టిని ఆకర్షిస్తున్న కుగ్రామం * అయుత చండీయాగంతో చుట్టుపక్కల ఊళ్లకూ కొత్త వెలుగులు * మెరిసిపోతున్న రహదారులు.. మురిసిపోతున్న పల్లె ప్రజలు * అంగరంగ వైభవంగా ఏర్పాట్లు.. విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న యాగక్షేత్రం అయుత చండీయాగశాల నుంచి సాక్షి ప్రతినిధి: కంకర తేలిన రోడ్లు.. తాగునీళ్లకు తండ్లాట.. గుడిసెల్లో బతుకులు.. పొద్దుగూకితే ఇళ్లల్లో అలుముకునే చీకట్లు.. ఊళ్లో ఏమైనా అయితే పక్కపల్లెకు తెలియనంత కుగ్రామం అది! మెదక్, నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో విసిరేసినట్టున్న ఆ గ్రామం ఇప్పుడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని పల్లెలకే ఆదర్శం. అదే జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి! సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌తో వార్తల్లోకి ఎక్కిన ఈ గ్రామం ఇప్పుడు అయుత చండీయాగంతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. యాగశాల దారిలో..: హైదరాబాద్ నుంచి శామీర్‌పేట మీదుగా రాజీవ్ రహదారిపై కరీంనగర్ వైపు 56 కిలోమీటర్లు ప్రయాణిస్తే గౌరారం గ్రామం వస్తుంది. అక్కడ ఆగి కుడి వైపునకు చూస్తే ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం’ అని రాసిన నిలువెత్తు స్వాగత ద్వారాలు యాగశాలకు దారి చూపిస్తున్నాయి. 33 అడుగుల డ బుల్ లైన్ రోడ్డు నల్లగా మెరుస్తోంది. ఇంతకుముందు ఇక్కడ ప్యాచ్‌లు వేసిన 10 అడుగుల సింగిల్ రోడ్డు ఉండేది. యాగం కోసం వారం కిందటే డబుల్ లైన్ రోడ్డు వేశారు. గౌరారం నుంచి వర్థరాజ్పూర్ వరకు రూ.17 కోట్లు ఖర్చు చేసి 12.5 కిలోమీటర్ల మేర ఈ దారి వేశారు. రోడ్లు, భవనాల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 45 రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేశారని చెబుతున్నారు. గౌరారం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న దాబాలు కూడా ముస్తాబయ్యాయి. కొత్త ఫర్నిచర్, కొత్త ధరల పట్టికతో సిద్ధమయ్యాయి. తినటం మానేస్తామా సార్.. గౌరారం మీదుగా 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే పాములపర్తి ఊరు. ఈ ఊరిపై యాగం ప్రభావం పెద్దగా కనిపించ లేదు. చేనులో పత్తి ఏరుకునే కొందరు కూలీలను పలకరించగా.. ‘‘యాగం ఉందని తినటం మానేస్తమా సారూ.. యాగానికి పోతే ఇళ్లెట్ల గడవాలే’’ అని వారన్నారు. యాగశాల వైపు బయల్దేరితే మార్కుక్ గ్రామం వచ్చింది. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే సమయంలో ఇక్కడ ఆగి మాట్లాడుతూ... ‘‘వెయ్యి ఎకరాల సాగు ఉన్న గ్రామమట. సారవంతమైన భూముల్లో కూరగాయలు పండుతాయట. చిన్న సన్నకారు రైతులు బోర్లు వేసుకున్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదు’’ అని మార్కుక్ను ఉద్దేశించి ఒకట్రెండు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇక అక్కడ్నుంచి కిలోమీటర్ దూరం నడిస్తే.. గంగాపూర్ చౌరస్తా. ఇక్కడ కుడి, ఎడమలుగా రెండు దార్లు వెళ్తాయి. కుడివైపు దారిని వీవీఐపీలు, వీఐపీలకు కేటాయించారు. సామాన్యులకు ఈ దారిగుండా అనుమతి లేదు. గంగాపూర్ చౌరస్తా నుంచి యాగస్థలం వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు పెట్టారు. ఎడమ వైపు దారిలో సామాన్య భక్తులకు, వివిధ గ్రామాల నుండి వచ్చే నాయకులకు, సర్పంచ్‌లు, ఎంసీటీసీలకు కేటాయించారు. దేదీప్యమానంగా యాగస్థలి గంగాపూర్ శివారులో మేకలు చూసుకుంటున్న అబ్బసాని మల్లయ్య యాదవ్‌ను ‘తాత యాగం ఎట్టున్నదే..’ అని పలకరించగా.. ‘కాలం బోయింది బిడ్డా... నా సిన్నప్పుడు ఇంత సౌలతి ఎక్కడిది. రోడ్డు జూస్తివా... ఎట్టేసిండ్రో... పోచమ్మ తల్లికి ఏటపోతును కోస్తేనే పెద్ద పండుగ అనుకునేటోళ్లం. ఇంత పెద్ద యాగం ఉంటదని నాకు తెల్వను కూడా తెల్వదు. కేసీఆర్ పెద్దోడు కాబట్టి జోరుగ జేస్తండు. ఎట్టాజేసినా గ దే పుణ్టెం (పుణ్యం) కద బిడ్డా...’ అంటూ వేదాంతం చెప్పాడు. ఈ చౌరస్తా నుంచి శివారు వెంకటాపూర్ వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు బిగించారు. శివారు వెంకటాపూర్ నుంచి యాగస్థలం ఒక కిలోమీటర్ లోపే. విద్యుత్ దీపాల వెలుగుల్లో యాగస్థలం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అంత వెలుగును చూడటం చుట్టు పక్కల పల్లె ప్రజలకు అదే మొదటిసారి అట. ‘ఆ లైట్లను జూత్తంటే పట్నంల ఉన్నట్టే ఉంది సారూ..’ అంటూ యాదమ్మ అనే మహిళ సంబరపడిపోయింది. పొలం పనులు చేసుకొని ఇళ్లకు వెళ్తున్న శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన మూనగారి లక్ష్మి, గాలవ్వలను పలకరించగా.. ‘సీఎం సారు.. మా ఊరు నుంచే వత్తాపోతా ఉంటడు గానీ ఊళ్లె దిగకపాయే. యాగం పెడితే మంచిదేగా సారూ..’ అని అన్నారు. యాగానికి మీరు వస్తారా? అని అడగ్గా.. ‘తీరుబాటు ఉంటే అత్తాం.. లేకుంటే లేదు..’ అని సమాధానమిచ్చారు. శివారు వెంకటాపూర్ చౌరస్తా వద్ద 5 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ఎడమ వైపు ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి గవర్నర్‌కు, మరొకటి ఏపీ సీఎం చంధ్రబాబునాయుడుకు కేటాయించారు. కుడివైపున రాష్ట్రపతి కోసం మరో హెలిప్యాడ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. కరీంనగర్ నుంచి ఇలా రావాలి.. కరీంనగర్ నుంచి వచ్చేవారి కోసం ప్రజ్ఞాపూర్ వద్ద యాగం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎర్రవల్లి యాగశాల 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ్నుంచి 7 కిలో మీటర్లు ప్రయాణిస్తే గణేష్‌పల్లి చౌరస్తా. అక్కడ చరణ్ అనే యువకుడిని పలకరించగా.. ‘‘కేసీఆర్ గొప్పోడు సార్.. ఇంత పెద్దయాగం చేస్తుండు. ఎర్రవల్లికే కాదు సార్.. చుట్టుపక్కల మా ఊళ్లకు కూడా పేరొచ్చింది.. యాగం కోసం నెల నుంచి రోడ్డు వేస్తున్నరు కదా. భోజనాలు, టిఫిన్లు, ఛాయ్ బాగా పోతున్నాయి సార్..’’ అంటూ మురిసిపోయాడు. ఖమ్మం, నల్లగొండ నుంచి వచ్చే భక్తులు గ ణేష్పల్లి చౌరస్తాకు చేరుకున్న తర్వాత కుడివైపు మళ్లితే నర్సన్నపేట క్రాస్ వస్తుంది. కరీంనగర్, వరంగల్ భక్తులు కూడా ఇదే దారిన రావాలి. హైదరాబాద్ కుషాయిగూడ నుంచి వచ్చే వారికి కూడా ఒక దారి ఉంది. వాళ్లు లక్ష్మాపూర్, కర్కపట్ల, దామరకుంట, వర్ధరాజ్‌పూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఎర్రవల్లి యాగ స్థలానికి చేరుకోచ్చు. యాగానికి 20 కిలోమీటర్ల దూరం నుంచే ప్రతి గ్రామ శివారులో ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్ పోస్టు వద్ద 6 మంది పోలీసులను కాపలా పెట్టారు. ఎర్రవల్లి దశ తిరిగింది.. ఎర్రవల్లి 420 కుటుంబాలున్న చిన్న పల్లె. 2,200 ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలు. కేసీఆర్ రాకముందు ఈ పల్లెను పట్టించుకున్నవారు లేరు. కేసీఆర్ క్లాస్మేట్ జహంగీర్ పట్టుబట్టి ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భూమి కొనుగోలు చేయించారట. అప్పట్నుంచే ఊరు దశ తిరిగింది. తెలంగాణ రావడం.. కేసీఆర్ సీఎం కావడం గ్రామాభివృద్ధికి మరింత బలం చేకూరింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 285 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రతి రైతుకు డ్రిప్పులు అందిస్తున్నారు. గ్రామస్తులను పలకరిస్తే.. ‘మా బతుకులకు ఢోకా లేదండీ.. కేసీఆర్ అన్నీ ఇస్తున్నారు. ఈ యాగంతో మా యోగం మారిపోద్ది..’ అని మురిసిపోయారు. భారీ పోలీస్ బందోబస్తు ఐదు రోజలు జరిగే ఈ అయుత చండీయాగానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుమతి, ఆరుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 185 మంది ఎస్సైలు, 40 మంది మహిళ ఎస్సైలు, 300 మంది ఏఎస్సైలు, 200 మంది హోంగార్డులు, 400 మంది కేంద్ర భద్రత బలగాలలతో పాటు ఆదనంగా 400 మందిని కానిస్టేబుళ్లలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. -
అందరూ ఆహ్వానితులే
-
అందరూ ఆహ్వానితులే
అయుత చండీయాగంపై సీఎం కేసీఆర్ ♦ సర్వ మానవ క్షేమం కోసమే నిర్వహిస్తున్నాం ♦ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ యాగం చేస్తానని సంకల్పించాను ♦ నియమనిష్టలతో, కఠోర దీక్షతో చేస్తున్న యాగమిది ♦ యాగశాలలోకి ఎవరికీ ప్రవేశం లేదు ♦ భక్తులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి ♦ వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం ♦ రోజూ 50 వేల మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: అయుత చండీ మహాయాగానికి అందరూ ఆహ్వానితులేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు ఆంక్షలేమీ లేవని, ఎలాంటి పాస్‌లు అవసరం లేదని చెప్పారు. అయితే అత్యంత నియమ నిష్టలు, కఠోర దీక్షతో చేస్తున్న మహా యాగమైనందున భక్తులు తమంతట తాము క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇది విశ్వశాంతిని, ప్రజాక్షేమాన్ని కాంక్షించి చేసే మహత్తర యాగమని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని చేసేదని చెప్పారు. ఈ యాగం వ్యక్తిగతమైంది కాదని, అందరికోసం జరిగే గొప్ప యాగమని పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలోని యాగశాల ప్రాంగణంలో సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల కిందటి సంకల్పం నాలుగేళ్ల కింద తెలంగాణ ఉద్యమ సందర్భంలో తీసుకున్న సంకల్పం మేరకే యాగం నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 2011లో శృంగేరి పీఠాధిపతి 60వ జన్మదిన సందర్భంగా శృంగేరిలో ఈ మహాయాగం నిర్వహించారని.. అక్కడికి వెళ్లిన తన మిత్రుడు రామ్మోహన్‌శర్మ ప్రసాదాన్ని తెచ్చి ఇచ్చి యాగం గురించి తనకు చెప్పారన్నారు. వ్యయ ప్రయాసలు, అత్యంత నిష్టతో చేసే యాగమైనప్పటికీ... అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ యాగం చేస్తానని అదే రోజున తాను సంకల్పం తీసుకున్నానని వెల్లడించారు. అనుకున్న ప్రకారం రాష్ట్రం ఏర్పడటంతో పరిపాలనా వ్యవహారాలు కుదుటపడ్డాక శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ ఆశీస్సులతో ముహూర్తం పెట్టుకున్నామని తెలిపారు. 50 వేల మందికి అన్న ప్రసాదం ప్రతిరోజు 50 వేల మంది భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రతి రోజు 50 వేల మందికి సరిపడే అన్న ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణలో 8 వేల నుంచి 9 వేల మంది దర్శనం చేసుకునే వీలుంది. యాగశాలలోకి భక్తులెవరినీ అనుమతించరు. యాగం చూసేందుకు వీలుగా చుట్టూరా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఎండ తగలకుండా ఏర్పాట్లు ఉన్నాయి. యాగంతో పాటు రెండు విడతలుగా వెయ్యి మంది చొప్పున మహిళలు లలితా సహస్రనామ కుంకుమార్చన చేస్తారు. హరికథలు, భజనలు, వాగ్గేయకారుల గీతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి..’’ అని వివరించారు. యాగశాలకు వచ్చే భక్తులు ఇతరులకు అవకాశం కల్పించేలా ముందుకు సాగాలన్నారు. కొద్ది దూరంలో పది వేల మంది నిలబడి వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యాగానికి రానున్న ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పూర్ణాహుతికి హాజరవుతున్నారని.. గవర్నర్లు నరసింహన్, రోశయ్య, విద్యాసాగర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమణ, జస్టిస్ చలమేశ్వర్, రాష్ట్ర హైకోర్టు సీజే దిలీప్ బోసాలే తదితరులు యాగానికి వచ్చేందుకు అంగీకరించారని సీఎం చెప్పారు. రవిశంకర్, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి, మాధవానంద స్వామి, మంత్రాలయం పీఠాధిపతి, శ్రీపీఠం మఠాధిపతి, వైజాగ్ నుంచి స్వరూపానందేంద్ర స్వామి వస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అష్టకాల రామ్మోహన శర్మను సంప్రదించాలని... సమయాన్ని బట్టి స్వాముల అనుగ్రహ భాషణలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు 40 వేల మందికి ఆహ్వానాలు పంపినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులను యాగానికి ఆహ్వానించినట్లు చెప్పారు. భక్తులూ నియమాలు పాటించాలి ‘‘శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అక్కడి మఠాధిపతుల నియమాల ప్రకారం జరిగే ఈ యాగానికి ఆరేడు రాష్ట్రాల నుంచి 1,500 మంది రుత్విజ్ఞులు వస్తున్నారు. 1,100 మంది ఏక కంఠంతో పారాయణం చేస్తారు. కఠిన నియమాలను ఆచరిస్తారు. యాగశాలలో ఉదయం 7 గంటలకు ప్రవేశిస్తే 12 గంటల దాకా కనీసం మంచినీటిని కూడా ముట్టుకోనంత నిష్టగా ఉంటారు. అందుకే భక్తులు కూడా నియమాలు పాటించాలి..’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘ఇది మహోత్కృష్టమైన యాగం. సాధారణంగా నిర్వహించేది కాదు. జగద్గురు శంకరాచార్యులంతటి వారే మీరు పెద్ద సాహసం చేస్తున్నారన్నారు. నిర్విఘ్నంగా జరిగేందుకు తమ ఆశీస్సులుంటాయని దీవించారు. కష్టంతో కూడుకున్నదైనా అనుకున్న ఆశయం సిద్ధించింది కాబట్టే యాగం చేస్తున్నాం..’’ అని వివరించారు. వేర్వేరుగా దారులు.. ప్రముఖుల రాక దృష్ట్యా సాధారణ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దారుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఎంత మంది భక్తులు వచ్చినా సరిపడే ఏర్పాట్లున్నాయి. గౌరారం నుంచి వచ్చేటప్పుడు గంగాపూర్ (యూసుఫ్ఖాన్పేట) దగ్గర దారి రెండుగా చీలుతుందని భక్తులు గమనించాలి. కుడివైపున వీఐపీలను, ఎడమ వైపునకు భక్తులను అనుమతిస్తారు. అక్కడే 20 వేల వాహనాలకు పార్కింగ్ స్థలం, భోజనశాల కూడా ఉంటుంది. కరీంనగర్ నుంచి వచ్చేవారు ప్రజ్ఞాపూర్, గణేష్‌పల్లి, నర్సన్నపేట, ఎర్రవెల్లి మీదుగా యాగస్థలానికి చేరుకోవచ్చు..’’ అని వివరించారు. యాగం జరిగే తీరిదీ.. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు జరిగే అయుత చండీ పురశ్చరణ మహాయాగ వైదిక కార్యక్రమం జరిగే తీరును సీఎం కేసీఆర్ వెల్లడించారు. 23 నుంచి మహాయాగం ప్రారంభమవుతున్నా రెండు రోజుల ముందు నుంచే.. అంటే 21వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం గురు ప్రార్థన, గణపతిపూజతో మొదలయ్యే ఈ యాగం... 27న జరిగే కలశ విసర్జన మహదాశీర్వచనం, ప్రసాద వితరణతో ముగుస్తుంది. 21-12-2015 (సోమవారం) గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, దేవనాంది, అంకురార్పణం, పంచగవ్య మేళనం, ప్రాశనం, గోపూజ, యాగ శాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహాసంకల్పం, సహస్ర మోదక మహాగణపతి హోమం, మహా మంగళ హారతి, ప్రార్థన, ప్రసాద వితరణం. సాయంకాలం వాస్తు రాక్షోఘ్నహోమం, అఘోరాస్త్ర హోమం. 22-12-2015 (మంగళవారం) గురుప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదకశాంతి, ఆచార్యాది ఋత్విగ్వరణం, త్రైలోక్య మోహనగౌరి హోమం, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ. సాయంకాలం ఋత్విగ్వరణం, దుర్గాదీప నమస్కార పూజ, రక్షాసుదర్శన హోమం. 23-12-2015 (బుధవారం) గురుప్రార్థన, గణపతి పూజ, గోపూజ, మహా మంటప స్థాపనం. చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ట, నవావరణార్చన, ఏకాదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజ శ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగ ప్రారంభం, మహా సౌరం, ఉక్తదేవతా జపములు, మంత్ర పుష్పం, విశేష నమస్కారములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణం. మధ్యాహ్నం (3 గంటలకు) ధార్మిక ప్రవచనం. సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్చరణం, విశేష పూజ ఆశ్లేష బలి, అష్టావధాన సేవ. రాత్రి శ్రీరామలీల హరికథ. 24-12-2015 (గురువారం) గురుప్రార్థన, గోపూజ, ఏకాదశన్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, యోగినిబలి, మహా ధన్వంతరి యాగం, రాజశ్యామల, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణ. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం, సాయంత్రం కోటి నవాక్షరి పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టాదశసేవ, ప్రసాద వినియోగం, రాత్రి శ్రీరామలీల హరికథ. 25-12-2015 (శుక్రవారం) గురు ప్రార్థన, గణపతిపూజ, ఏకాదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, నవగ్రహ హోమం, యోగినిబలి, రాజ శ్యామల, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణ. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం. సాయంత్రం కోటి నవాక్షరి జపం, పార్థివ లింగపూజ, అష్టావధాన సేవ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణం. రాత్రి శ్రీరామలీల హరికథ. 26-12-2015 (శనివారం) గురుప్రార్థన, గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం. మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహామంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థప్రసాద వితరణం, మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరి జపం, అష్టావధానసేవ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణం. రాత్రి శ్రీమాతా భువనేశ్వరి చక్రి భజన. 27-12-2015 (ఆదివారం) గురుప్రార్థన, పుణ్యాహవచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్ని ప్రతిష్ట, అగ్ని విహరణం, స్థాపిత దేవతా హవనం. సపరివార అయుత చండీయాగం, అయుత ల క్ష నవాక్షరీ అజ్యాహుతి, మహాపూర్ణాహుతి, వసోర్దారా, కుమారి, సువాసినీ, దంపతిపూజ, మహా మంగళ హారతి, ఋత్విక్ సన్మానం, కలశ విసర్జనం, అవభృత స్నానం. మహదాశీర్వచనం. ప్రసాద వితరణం, యాగ సంపూర్ణం. -
చండీ మహాయాగానికి ముమ్మరంగా ఏర్పాట్లు
-
అప్పుడు ఓటుకు నోట్లు..! ఇప్పుడు కాల్ మనీ...!!
* చంద్రబాబును కలిసి అయుత చండీయాగానికి ఆహ్వానించిన కేసీఆర్ * కేసీఆర్ కలిసిన ప్రతిసారీ ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్: రెండు నెలల కిందట చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు... ఈరోజు కేసీఆర్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు... రెండు సందర్భాల్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. నోట్ల వ్యవహారాల్లో తీవ్ర విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న సందర్భంలోనే చంద్రబాబు, కేసీఆర్‌ల భేటీలు జరగడం విశేషం. ఈ నెల 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తలపెట్టిన అయుత చండీ మహా యాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ సోమవారం చంద్రబాబును కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కేసీఆర్ విజయవాడలో ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లి స్వహస్తాలతో ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్‌కు అతిథి మర్యాదలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్‌లతో కలిసి వెళ్లినప్పటికీ కేసీఆర్‌తో చంద్రబాబు విడిగా దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం ఆంధ్రా వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు ప్రత్యేక విందునిచ్చారు. వెనక్కి తిరిగిచూస్తే... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. అక్టోబర్ 18న చంద్రబాబు తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరాగా, కేసీఆర్ అందుకు సమ్మతించి హాజరయ్యారు కూడా. రెండు సందర్భాల్లోనూ... అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించాలనుకున్నప్పుడు చంద్రబాబు తీవ్ర తర్జనభర్జన పడాల్సి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలను ఎరగా చూపిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి జూన్ 1న స్టీఫెన్సన్ను కలిసి డబ్బు మూటను ఇస్తున్న వీడియో రికార్డులు బయటకు రావడం, ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు ఆడియో టేపులు బయకుపొక్కడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు గొంతువరకు కూరుకుపోయారని కేసీఆర్ చెప్పగా, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు నేరుగా కేంద్రం ముందు శరణుజొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత నాలుగు నెలల వరకు చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం కలుసుకున్న సందర్భం రాలేదు. అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరే విషయంలో అక్టోబర్ 18న చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ తర్వాత అక్టోబర్ 22న దసరా పండుగ రోజు అమరావతి శంకుస్థాపన వేదికపైన కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహ కార్యక్రమంలో వారిద్దరు పరస్పరం ఎదురుపడినప్పుడు నమస్కారాలతో సరిపెట్టారే తప్ప పెద్దగా మాట్లాడుకోలేదు. మళ్లీ ఇప్పుడు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ వ్యవహారంలోనూ అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, అందులో టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందని బలంగా వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేసీఆర్ రావడం యాధృచ్చికమైనప్పటికీ చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. -
'టీడీపీలో ఉన్నప్పుడు కూడా యాగాలు చేశా'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన ముగిసింది. సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ నెల 27న తాను చేస్తున్న అయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబుతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు. యాగం వివరాలను ఏపీ సీఎంకు తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా యాగాలు చేశారా అని కేసీఆర్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అడిగారు. అప్పుడు కూడా యాగాలు చేశానని కేసీఆర్ జవాబిచ్చారు. కాగా, ఇరువురు ముఖ్యమంత్రులు ఏకాంతంగా 15 నిమిషాలు చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన సమస్యలు చర్చకు రాలేదని సమాచారం. విజయవాడకు వచ్చిన కేసీఆర్ కు చంద్రబాబు 15 నుంచి 20 రకాల వంటకాలతో ప్రత్యేక విందు ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ ముగియగానే సాయంత్రం విజయవాడ నుంచి హైలికాప్టర్ లో కేసీఆర్ హైదరాబాద్ కు బయలు దేరారు. -
1500 మంది రుత్వికులతో చండీయాగం
మెదక్: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత మహా చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ యాగాన్ని 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో ఈ యాగం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు సిద్ధమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు(సోమవారం) విజయవాడ వెళ్లనున్నారు. చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్ ఆహ్వానించనున్నారు. -
యాగం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్) : చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి ఆయన చేరుకున్నారు. మొదట చండీయాగం స్థలానికి చేరుకుని పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సీఎం అరగంటపాటు అక్కడే ఉండి పనుల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతి ముందస్తుగానే ఫాంహౌస్‌కు చేరుకుని పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం బస చేస్తారు. ఆదివారం ఉదయం చండీయాగం పనులను మళ్లీ పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. -
చండీయాగానికి చకాచకా పనులు
-ఐదు రోజులపాటు ఆధ్యాత్మికంగా యాగం -15 మంది ఋత్విక్కులు హాజరు -వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు -10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు -సిసి కెమెరాలు, టీవీల ఏర్పాటు -ప్రతిరోజు 10 వేల నుండి 60 వేల మందికి భోజన ఏర్పాట్లు జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : లోక కల్యాణం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఆయుత చండీయాగం అద్వితీయంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం తన వ్యవసాయక్షేత్రంలో మహాక్రతువు న భూతో న భవిష్యతిగా జరిపేలా స్వయంగా అన్ని ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ యాగం డిసెంబర్ 23 నుండి 27 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ నెల 27న సీఎం దంపతులు నవ చండీయాగంతో ఆయుత చండీయాగానికి భూమిపూజ చేశారు. నిర్వహణ బాధ్యతలను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేటికి 10 గ్యాలరీలు పూర్తి చేశారు. ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిరోజు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వ్యవసాయక్షేత్రంలో చండీయాగం పనులపై ప్రత్యేక కథనం... శృంగేరి శారదాపీఠం శిష్యులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ ఫణిశశాంక్శర్మ, ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న చండీయాగంలో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి 15 వందల మంది బ్రహ్మణోత్తములు ఋత్విక్కులుగా పాల్గొంటారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి ష్టష్యభ్ధి పూర్తి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆయుత చండీయాగం సంప్రదాయానికి అనుగుణంగానే ఈ యాగం కూడా ఏకోత్తరవృద్ధి విధానంలో జరగబోతుంది. ఆయుత చండీయాగంతో పాటు రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరగనున్నాయి. -శంగేరి పీఠం వేద పండితులు పురాణం మహేశ్వశర్మ, శశాంక్‌శర్మ, గోపికృష్ణలు అయుత చండీయాగం పూజలు నిర్వహిస్తారు. -ఆయుత చండీయాగానికి మొత్తం 15 వందల మంది ఋత్వికులు హాజరుకానున్నారు. -చండీయాగం స్థలంలో 108 హొమం గుండాలు ఏర్పాటు చేస్తారు. -ఒక్క హోమం గుండా వద్ద 11 మంది బ్రహ్మణులు పారాయణలు, జపాలు చేస్తారు. -ఐదు రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీయాగనవాక్షరీ చేస్తారు. -22న ఉదయమే బ్రహ్మణులు చండీయాగం స్థలానికి చేరుకుంటారు. -మొదటి రోజు 11 వందల మంది బ్రహ్మణులు ఒకేసారి సప్తశతి చేసి, 4 వేల పారాయణలు చేస్తారు. -రెండోరోజు 11 మంది బ్రహ్మణులు 2 పారాయణలు చేసి, 3 వేల జపం చేస్తారు. -మూడో రోజు 11 మంది బ్రహ్మణులు మూడు పారాయణలు, 2 వేల జపం చేస్తారు. -నాలుగవ రోజు 11 మంది బ్రహ్మణులు 4 పారాయణలు, వేయ్యి జపం చేస్తారు. -చివరి రోజు ఒక్క హోమ గుండం వద్ద 11మంది ఋత్విక్కులు పాలతో 10 వేల పారాయణలు, దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -మిగతా 4 వందల మంది బ్రాహ్మణులు 11 మంది బ్రాహ్మణులకు సేవలు అందిస్తారు. -బ్రాహ్మణులకు ఉండేందుకు 4 యాగశాలలు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఐదు రోజులు ఉండేందుకు వసతులు కల్పించనున్నారు. -చండీయాగంలోకి ఋత్విక్కులు తప్ప మిగతా వారికి అవకాశం లేదు. -విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. -మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. -భక్తులు, ప్రజల కోసం ప్రధాన గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. -ప్రతి రోజు 10 వేల నుండి 60 వేల భక్తులకు భోజన ఏర్పాట్లు అందించే విధంగా పెద్ద ఎత్తున్న భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. -బ్రహ్మణులకు తమ గ్యాలరీలల్లోనే భోజన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -అలాగే ప్రతి గ్యాలరీ వద్ద చండీయాగం చూసేందుకు టివిలను ఏర్పాటు చేస్తున్నారు. -మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. -ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖ 40 మంది హరినాథులను హాజరు కానున్నారు. -ప్రతి గ్యాలరీ వద్ద సిసి కెమెరాలను బిగిస్తున్నారు. అలాగే వ్యవసాయక్షేత్రం చుట్టూ కూడా పెట్టే అలోచనలో ఉన్నారు. పోలీసులు ఆధీనంలో ఉండేవి... -శుక్రవారం నుండే చండీయాగ స్థలాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. -వ్యవసాయక్షేత్రం చుట్టూ ఐదు దిక్కుల చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. -ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, గంగాపూర్, వర్ధరాజ్‌పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. -ప్రతి ఒక్కరి వాహనాలు పార్కింగ్‌లలో పెట్టి చండీయాగం స్థలానికి నడుచుకుంటూ వెళ్లాలి. - జిల్లా పోలీస్యంత్రాగంతోపాటు ఇతర జిల్లాల నుంచి భారీగా పోలీస్ బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -ప్రతిరోజు జిల్లా ఎస్పీ సుమతి యాగం స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. -వ్యవసాయక్షేత్రం వైపు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. -ఎర్రవల్లి మీదుగా భక్తులకు, ప్రజలకు, నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -విఐపి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అతిధులకు శివారువెంకటాపూర్ నుండి అనుమతి కల్పించనున్నారు. -33 ఎకరాల్లో చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -యాగశాలలపై ఎండు గడ్డిని కప్పి అందంగా తయారు చేస్తున్నారు. ప్రతిరోజు నాలుగైదు డిసిఎంల గడ్డి వస్తుంది. -రూటు మ్యాప్ ప్రకారం సౌకర్యాలు కల్పించనున్నారు. -
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఆయుత చండీయాగానికి సంబంధించిన పనులు చకచక సాగుతున్నాయి. కేసీఆర్‌ను గురువారం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీర్వదించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆయుత చండీయాగం డిసెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. 27వ తేదీన ఈ యాగం ముగియనుంది. చివరి రోజు యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ యాగానికి దేశంలోని ప్రముఖలను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మెదక్ జిల్లా ఎస్పీ సుమతి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
'మోదీ మెప్పు కోసమే చండీయాగం'
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమిలో కలిసిపోవడానికే చండీ యాగం తలపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వపరంగానా లేదా వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారా అనేది కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సెక్యులర్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా యాగాలకు, పూజలకు అవకాశముందా అని ప్రశ్నించారు. తన మొక్కు తీర్చుకోవడానికి దేవుళ్లకు కేసీఆర్ నగలు సమర్పించిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.