
'టీడీపీలో ఉన్నప్పుడు కూడా యాగాలు చేశా'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన ముగిసింది. సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ నెల 27న తాను చేస్తున్న అయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబుతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు. యాగం వివరాలను ఏపీ సీఎంకు తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా యాగాలు చేశారా అని కేసీఆర్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అడిగారు. అప్పుడు కూడా యాగాలు చేశానని కేసీఆర్ జవాబిచ్చారు.
కాగా, ఇరువురు ముఖ్యమంత్రులు ఏకాంతంగా 15 నిమిషాలు చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన సమస్యలు చర్చకు రాలేదని సమాచారం. విజయవాడకు వచ్చిన కేసీఆర్ కు చంద్రబాబు 15 నుంచి 20 రకాల వంటకాలతో ప్రత్యేక విందు ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ ముగియగానే సాయంత్రం విజయవాడ నుంచి హైలికాప్టర్ లో కేసీఆర్ హైదరాబాద్ కు బయలు దేరారు.