ఎర్రవల్లి.. వేదవల్లి | Today is Last day of ayutha chandi yagam | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి.. వేదవల్లి

Published Sun, Dec 27 2015 3:06 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

ఎర్రవల్లి.. వేదవల్లి - Sakshi

ఎర్రవల్లి.. వేదవల్లి

♦ అరుణ వర్ణశోభితమైన యాగస్థలి
♦ నాలుగో రోజు 44 వందల సప్తశతి పారాయణాలు
♦11 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు
♦ ఇప్పటివరకు 11 వేల చండీ సప్తశతి పారాయణాలు
♦ కోటి నవార్ణ మంత్ర జపాలు పూర్తి.. యాగంలో ముగిసిన ప్రధాన ఘట్టం
♦ సుహాసిని, దంపతి పూజలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం నాలుగో రోజుతో యాగంలో 10 వేల సప్తశతి పారాయణాలు, కోటి నవార్ణ మంత్ర జపాలు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు ఎర్రవల్లి క్షేత్రానికి తరలివచ్చి సీఎంను ఆశీర్వదించారు. అరుణ వర్ణ వస్త్ర ధారణతో ఉదయం 9.30 గంటలకు సీఎం దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్విక్కులు కూడా ఎరుపు రంగు వస్త్రాలతో హోమగుండాల వద్దకు వచ్చారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన యజ్ఞ బ్రాహ్మణులు నరహరి సుబ్రహ్మణ్య భట్, తంగిరాల శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో మహా సరస్వతి, మహాకాళి, వరలక్ష్మి విగ్రహాల వద్ద కేసీఆర్, రుత్విక్కులు గురు ప్రార్థన చేశారు. దుర్గా దేవికి కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేశారు. గోపూజ, గణపతి హోమం, మహామంటప స్థాపన తదితర రోజువారీ పూజలు చేశారు. అనంతరం రుత్విక్కులు అమ్మవారిని ఆవాహన చేసుకున్నారు. గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా వచ్చి పూజలో పాల్గొన్నారు.

 ముగిసిన కీలక ఘట్టం
 100 హోమగుండాల చుట్టూ 1,100 మంది రుత్విక్కులు ఆశీనులై పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఉదయం 11.25 గంటలకు ఏకోత్తర వృద్ధి పద్ధతిలో పారాయణాలు ప్రారంభించిన రుత్విక్కులు మధ్యాహ్నం 1.05 గంటల వరకు ఏకబిగిన 44 వందల సప్తశతి పారాయణాలు, 11 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. ఈ నాలుగు రోజుల్లో కలిపి రుత్వికులు మొత్తంగా 11 వేల సప్తశతి పారాయణాలు, 1.10 కోట్ల చండీ నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. చండీయాగంలో 10 వేల పారాయణాలు, కోటి నవార్ణ మంత్రాలు జపించడమే ముఖ్య నియమం. రుత్వికులు 11 వేల సప్తశతి పారాయణాలు, 1.10 కోట్ల నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేయడంతో చండీయాగ ప్రధాన క్రతువు ముగిసినట్టయింది.

 తరలివచ్చిన ప్రముఖులు..
 హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ రాజశేఖరరెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, జస్టిస్ స్వరూప్‌రెడ్డి, జస్టిస్ గోపాల్‌రెడ్డి యాగంలో పాల్గొన్నారు. మంత్రులు టి.హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి,డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, రాజ్యసభ సభ్యుడు సుబ్బ రామిరెడ్డి, సినీ నటుడు నాగార్జున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నటుడు శివారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తదితరులు యాగానికి తరలివచ్చారు.

 నేడు సీఎం ప్రత్యేక వస్త్రధారణ
 చండీయాగం చివరి రోజున రుత్విక్కులు పసుపు వర్ణ వస్త్రాలను ధరించనున్నారు. ఈ నాలుగు రోజులు రుత్విక్కులతోపాటుగానే వస్త్రధారణ చేసిన కేసీఆర్ చివరి రోజు ప్రత్యేక పట్టు వస్త్రాలను ధరించనున్నారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి తన ప్రత్యేక దూత ద్వారా కేసీఆర్‌కు ఆశీర్వచనాలతోపాటుగా పట్టువస్త్రాలు పంపించారు. యాగం ముగింపు రోజున కేసీఆర్ వాటినే ధరిస్తారని యాగ నిర్వాహకులు తెలిపారు.
 
 తల్లీ.. కేసీఆర్‌కు శక్తిని ప్రసాదించు: సోమయాజులు
 కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందుకు కేసీఆర్‌కు తగిన శక్తి ప్రసాదించాలని వేద పండితులు మాడుగుల మాణిక్య సోమయాజులు అమ్మవారిని ప్రార్థించారు. వేద విద్య వికాసానికి ఆరు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా సేవలందిస్తున్న మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులను శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా సోమయాజులుకు స్వర్ణ కంకణం తొడిగారు.
 
 అమ్మవారికి పూర్ణాహుతి
 తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు శనివారం చండీయగానికి తరలిచ్చారు. వీరికి కేసీఆర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్విక్కుల పారాయణం అనంతరం మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకాంబరి, బీమా, రక్తదంతిక, దుర్గ, బ్రామరి నవ దుర్గలకు సీఎంతోపాటు గవర్నర్ రోశయ్య, శరద్ పవార్, ఎన్వీ రమణ కలిసి బలిప్రదానం, సుహాసిని, దంపతీ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి హోమగుండంలో పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమతో పూర్ణాహుతి జరిపించారు. రోశయ్య, శరద్ పవార్, ఎన్వీ రమణలకు సీఎం వెండితో చేసిన దుర్గామాతా విగ్రహాలను అందజేశారు. ఇతర ప్రముఖులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి గోపాల కృష్ణ, మాధవీనందస్వామి, కపిలేశ్వర స్వామి, కమలానంద భారతి తదితరులు కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు.
 
 ఒకే ఒక్కడు!
 అన్నింటా తానై వ్యవహరిస్తున్న హరీశ్
 
తెలంగాణ ఉద్య మం.. గోదావరి పుష్కరాలు.. అయుత చండీయాగం.. ఏ సందర్భం అయినా అన్నింటా ఆయనే! ఉద్యమకారుడిగా.. ప్రజాప్రతినిధిగా ఆయన చూపు ఎప్పుడూ జనం వైపే! అధినేత స్కెచ్ వేస్తే దానికి తగిన ప్లాన్ గీసే మంత్రి హరీశ్‌రావు చండీయాగంలోనూ అన్ని తానై నడిపిస్తున్నారు. ఉదయం అతిథులు, ముఖ్య అతిథులకు ఆహ్వానం పలకడం.. సామాన్య భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టడం.. వాకీటాకీ పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడం వరకూ భిన్న పాత్రలు పోషిస్తున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో ధర్మపురి వద్ద భారీగా స్తంభించిపోయిన ట్రాఫిక్‌ను హరీశ్ నియంత్రించారు.

తాజాగా చండీయాగంలో ఎర్రవల్లి వద్ద రోజూ ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తుతున్నారు. శుక్రవారం ఆయన దాదాపు గంటపాటు శ్రమించి ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం కూడా ట్రాఫిక్ అదుపులోకి రాకపోవడంతో మంత్రి కాసేపు మైక్ అనౌన్సర్‌గా మారారు. ‘నేను హరీశ్‌రావును మాట్లాతున్నా..’ అని పరిచయం చేసుకుని.. సాధారణ, వీఐపీ, వీవీఐపీ మూడు దారుల గుండా భక్తులకు దారి కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ‘అమ్మా, ముందుకు కదలాలి. మీరు ముందుకు కదిలితేనే వెనుక వారికి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది.. కదలాలే తల్లీ... కదలాలే.. ముందుకు పదా బిడ్డా..’ అంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు. దీంతో క్యూలైన్లలో భక్తులు వేగంగా ముందుకు కదిలారు.

 అంచనాలకు మించి..
 చండీయాగం సంకల్పించిన సమయంలో రోజుకు 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్టుగా భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎర్రవల్లి గ్రామ సమీపంలో దాదాపు 50 వేల చదరపు అడుగులతో భారీ భోజనశాల ఏర్పాటు చేశారు. కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉత్కృష్ట యాగం కావడం, దానికితోడు వరుస సెలవులు రావడంతో భక్తులు అంచనాకు మించి నాలుగైదు రెట్లు ఎక్కువగా తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మంత్రి హరీశ్.. తానే స్వయంగా వంటశాలకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 80 పొయ్యిలపై రోజుకు 14 టన్నుల బియ్యం వండివారుస్తున్నారు.
 
 నాలుగో రోజు.. అదే హోరు
 ఇప్పటిదాకా దర్శించుకున్నది 7 లక్షలపైనే
చండీయాగానికి నాలుగో రోజైన శనివారం జన ప్రవాహం మరింతగా పెరిగింది. పోలీసులు ఎక్కడికక్కడా కట్టడి చేసినా తోపులాటలు ఆగలేదు. పలుచోట్ల బారికేడ్లు విరిగాయి. యాగశాల ప్రధాన ద్వారం వద్ద కు వీవీఐపీలు మినహా ఎవరినీ అనుమతించలేదు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్యూలైన్లలో రద్దీ అధికంగా కనిపించింది. నిమిషానికి 500 మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ జనం క్యూలైన్ల నుంచి యాగ స్థలికి చేరుకోవాలంటే గంటల తరబడి సమయం పట్టింది. వృద్ధులు, చిన్నారులు నానా యాతన పడ్డారు. పోలీస్ కంట్రోల్ రూం వెనుక భాగంలోని క్యూలైన్ల బారికేడ్లు విరిగిపడ్డాయి. జనం బారికేడ్లను దాటుకుంటూ వెళ్లడంతో స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. బారికేడ్లు విరిగిపడిన ప్రదేశానికి వెళ్లాలంటూ కలెక్టర్‌కు, అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ క్యూలైన్ల వద్దకు వెళ్లి చేతులు జోడించి సహకరించాలని భక్తులను కోరారు. ఈ 4 రోజుల్లో 7 లక్షలకు పైగా భక్తులు చండీ మాతను దర్శించుకున్నట్టు అంచనా.
 
 చండీయాగం.. క్షణ క్షణం
   9:30 గంటలు: యాగస్థలికి చేరుకున్న కేసీఆర్ దంపతులు
  10.05: గణపతి హోమం
  10:22: యాగశాల చుట్టూ కేసీఆర్ ప్రదక్షిణలు
  11:15: పారాయణాలను ప్రారంభించిన రుత్విక్కులు
  12:45: 44 వందల సప్తశతి పారాయణాలు,
    11 లక్షల నవార్ణ మంత్రజపాలు పూర్తి చేసిన రుత్విక్కులు
  1:12: అమ్మవారికి వేద పండితుల మంగళ హారతులు
  1:40: భోజనశాలకు వెళ్లిన రుత్విక్కులు
  1:45: భోజన విరామానికి సీఎం
  4:55: తిరిగి యాగశాలకు రాక
  రాత్రి 9:00: కొనసాగిన ప్రవచ నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
 
 నేడు యాగానికి రాష్ట్రపతి
  కేంద్ర బలగాల అధీనంలో యాగస్థలి
  రేపు వేములవాడకు కేసీఆర్

అయుత చండీ మహాయాగానికి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారు. దీంతో శనివారమే కేంద్ర బలగాలు యాగస్థలిని తమ అధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 50 మందికిపైగా అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. రాష్ట్రపతి హెలిప్యాడ్, అక్కడ్నుంచి యాగస్థలికి వెళ్లే మార్గం, విశ్రాంతి గది తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రపతి సికింద్రాబాద్‌లోని విడిది నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి యాగస్థలికి చేరుకుంటారు. యాగంలో పాల్గొన్న అనంతరం తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాగశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు.

 నేటితో యాగం పూర్తి..
 అయుత చండీ మహాయాగం ఆదివారంతో ముగియనుంది. యాగం తర్వాత అక్కడే నిద్ర చేయాలనే నియమం మేరకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, నిర్వాహకులు రాత్రి యాగస్థలిలోనే నిద్రించనున్నారు. సోమవారం ఉదయం ఎర్రవల్లి నుంచి బయలుదేరి వేములవాడ వెళ్లి, రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
 
 నేడు యాగానికి బాబు
 సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం అయుత చండీయాగంలో పాల్గొననున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు చంద్రబాబుతో పాటు  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వైఎస్ చౌదరి యాగంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 10కు విజయవాడ నుంచి హైదరాబాద్  చేరుకునే చంద్రబాబు హెలికాప్టర్‌లో ఎర్రవల్లి వెళతారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ చేరుకు ని రాత్రికి బస చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement