అందరూ ఆహ్వానితులే
అయుత చండీయాగంపై సీఎం కేసీఆర్
♦ సర్వ మానవ క్షేమం కోసమే నిర్వహిస్తున్నాం
♦ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ యాగం చేస్తానని సంకల్పించాను
♦ నియమనిష్టలతో, కఠోర దీక్షతో చేస్తున్న యాగమిది
♦ యాగశాలలోకి ఎవరికీ ప్రవేశం లేదు
♦ భక్తులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి
♦ వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం
♦ రోజూ 50 వేల మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అయుత చండీ మహాయాగానికి అందరూ ఆహ్వానితులేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు ఆంక్షలేమీ లేవని, ఎలాంటి పాస్‌లు అవసరం లేదని చెప్పారు. అయితే అత్యంత నియమ నిష్టలు, కఠోర దీక్షతో చేస్తున్న మహా యాగమైనందున భక్తులు తమంతట తాము క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇది విశ్వశాంతిని, ప్రజాక్షేమాన్ని కాంక్షించి చేసే మహత్తర యాగమని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని చేసేదని చెప్పారు. ఈ యాగం వ్యక్తిగతమైంది కాదని, అందరికోసం జరిగే గొప్ప యాగమని పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలోని యాగశాల ప్రాంగణంలో సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాలుగేళ్ల కిందటి సంకల్పం
నాలుగేళ్ల కింద తెలంగాణ ఉద్యమ సందర్భంలో తీసుకున్న సంకల్పం మేరకే యాగం నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 2011లో శృంగేరి పీఠాధిపతి 60వ జన్మదిన సందర్భంగా శృంగేరిలో ఈ మహాయాగం నిర్వహించారని.. అక్కడికి వెళ్లిన తన మిత్రుడు రామ్మోహన్‌శర్మ ప్రసాదాన్ని తెచ్చి ఇచ్చి యాగం గురించి తనకు చెప్పారన్నారు. వ్యయ ప్రయాసలు, అత్యంత నిష్టతో చేసే యాగమైనప్పటికీ... అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ యాగం చేస్తానని అదే రోజున తాను సంకల్పం తీసుకున్నానని వెల్లడించారు. అనుకున్న ప్రకారం రాష్ట్రం ఏర్పడటంతో పరిపాలనా వ్యవహారాలు కుదుటపడ్డాక శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ ఆశీస్సులతో ముహూర్తం పెట్టుకున్నామని తెలిపారు.
50 వేల మందికి అన్న ప్రసాదం
ప్రతిరోజు 50 వేల మంది భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రతి రోజు 50 వేల మందికి సరిపడే అన్న ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణలో 8 వేల నుంచి 9 వేల మంది దర్శనం చేసుకునే వీలుంది. యాగశాలలోకి భక్తులెవరినీ అనుమతించరు. యాగం చూసేందుకు వీలుగా చుట్టూరా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఎండ తగలకుండా ఏర్పాట్లు ఉన్నాయి. యాగంతో పాటు రెండు విడతలుగా వెయ్యి మంది చొప్పున మహిళలు లలితా సహస్రనామ కుంకుమార్చన చేస్తారు. హరికథలు, భజనలు, వాగ్గేయకారుల గీతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి..’’ అని వివరించారు. యాగశాలకు వచ్చే భక్తులు ఇతరులకు అవకాశం కల్పించేలా ముందుకు సాగాలన్నారు. కొద్ది దూరంలో పది వేల మంది నిలబడి వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
యాగానికి రానున్న ప్రముఖులు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పూర్ణాహుతికి హాజరవుతున్నారని.. గవర్నర్లు నరసింహన్, రోశయ్య, విద్యాసాగర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమణ, జస్టిస్ చలమేశ్వర్, రాష్ట్ర హైకోర్టు సీజే దిలీప్ బోసాలే తదితరులు యాగానికి వచ్చేందుకు అంగీకరించారని సీఎం చెప్పారు. రవిశంకర్, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి, మాధవానంద స్వామి, మంత్రాలయం పీఠాధిపతి, శ్రీపీఠం మఠాధిపతి, వైజాగ్ నుంచి స్వరూపానందేంద్ర స్వామి వస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అష్టకాల రామ్మోహన శర్మను సంప్రదించాలని... సమయాన్ని బట్టి స్వాముల అనుగ్రహ భాషణలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు 40 వేల మందికి ఆహ్వానాలు పంపినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులను యాగానికి ఆహ్వానించినట్లు చెప్పారు.
భక్తులూ నియమాలు పాటించాలి
‘‘శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అక్కడి మఠాధిపతుల నియమాల ప్రకారం జరిగే ఈ యాగానికి ఆరేడు రాష్ట్రాల నుంచి 1,500 మంది రుత్విజ్ఞులు వస్తున్నారు. 1,100 మంది ఏక కంఠంతో పారాయణం చేస్తారు. కఠిన నియమాలను ఆచరిస్తారు. యాగశాలలో ఉదయం 7 గంటలకు ప్రవేశిస్తే 12 గంటల దాకా కనీసం మంచినీటిని కూడా ముట్టుకోనంత నిష్టగా ఉంటారు. అందుకే భక్తులు కూడా నియమాలు పాటించాలి..’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘ఇది మహోత్కృష్టమైన యాగం. సాధారణంగా నిర్వహించేది కాదు. జగద్గురు శంకరాచార్యులంతటి వారే మీరు పెద్ద సాహసం చేస్తున్నారన్నారు. నిర్విఘ్నంగా జరిగేందుకు తమ ఆశీస్సులుంటాయని దీవించారు. కష్టంతో కూడుకున్నదైనా అనుకున్న ఆశయం సిద్ధించింది కాబట్టే యాగం చేస్తున్నాం..’’ అని వివరించారు.
వేర్వేరుగా దారులు..
ప్రముఖుల రాక దృష్ట్యా సాధారణ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దారుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఎంత మంది భక్తులు వచ్చినా సరిపడే ఏర్పాట్లున్నాయి. గౌరారం నుంచి వచ్చేటప్పుడు గంగాపూర్ (యూసుఫ్‌ఖాన్‌పేట) దగ్గర దారి రెండుగా చీలుతుందని భక్తులు గమనించాలి. కుడివైపున వీఐపీలను, ఎడమ వైపునకు భక్తులను అనుమతిస్తారు. అక్కడే 20 వేల వాహనాలకు పార్కింగ్ స్థలం, భోజనశాల కూడా ఉంటుంది. కరీంనగర్ నుంచి వచ్చేవారు ప్రజ్ఞాపూర్, గణేష్‌పల్లి, నర్సన్నపేట, ఎర్రవెల్లి మీదుగా యాగస్థలానికి చేరుకోవచ్చు..’’ అని వివరించారు.
యాగం జరిగే తీరిదీ..
ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు జరిగే అయుత చండీ పురశ్చరణ మహాయాగ వైదిక కార్యక్రమం జరిగే తీరును సీఎం కేసీఆర్ వెల్లడించారు. 23 నుంచి మహాయాగం ప్రారంభమవుతున్నా రెండు రోజుల ముందు నుంచే.. అంటే 21వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం గురు ప్రార్థన, గణపతిపూజతో మొదలయ్యే ఈ యాగం... 27న జరిగే కలశ విసర్జన మహదాశీర్వచనం, ప్రసాద వితరణతో ముగుస్తుంది.
21-12-2015 (సోమవారం)
గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, దేవనాంది, అంకురార్పణం, పంచగవ్య మేళనం, ప్రాశనం, గోపూజ, యాగ శాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహాసంకల్పం, సహస్ర మోదక మహాగణపతి హోమం, మహా మంగళ హారతి, ప్రార్థన, ప్రసాద వితరణం. సాయంకాలం వాస్తు రాక్షోఘ్నహోమం, అఘోరాస్త్ర హోమం.
22-12-2015 (మంగళవారం)
గురుప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదకశాంతి, ఆచార్యాది ఋత్విగ్వరణం, త్రైలోక్య మోహనగౌరి హోమం, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ. సాయంకాలం ఋత్విగ్వరణం, దుర్గాదీప నమస్కార పూజ, రక్షాసుదర్శన హోమం.
23-12-2015 (బుధవారం)
గురుప్రార్థన, గణపతి పూజ, గోపూజ, మహా మంటప స్థాపనం. చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ట, నవావరణార్చన, ఏకాదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజ శ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగ ప్రారంభం, మహా సౌరం, ఉక్తదేవతా జపములు, మంత్ర పుష్పం, విశేష నమస్కారములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణం. మధ్యాహ్నం (3 గంటలకు) ధార్మిక ప్రవచనం. సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్చరణం, విశేష పూజ ఆశ్లేష బలి, అష్టావధాన సేవ. రాత్రి శ్రీరామలీల హరికథ.
24-12-2015 (గురువారం)
గురుప్రార్థన, గోపూజ, ఏకాదశన్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, యోగినిబలి, మహా ధన్వంతరి యాగం, రాజశ్యామల, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణ. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం, సాయంత్రం కోటి నవాక్షరి పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టాదశసేవ, ప్రసాద వినియోగం, రాత్రి శ్రీరామలీల హరికథ.
25-12-2015 (శుక్రవారం)
గురు ప్రార్థన, గణపతిపూజ, ఏకాదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, నవగ్రహ హోమం, యోగినిబలి, రాజ శ్యామల, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణ. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం. సాయంత్రం కోటి నవాక్షరి జపం, పార్థివ లింగపూజ, అష్టావధాన సేవ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణం. రాత్రి శ్రీరామలీల హరికథ.
26-12-2015 (శనివారం)
గురుప్రార్థన, గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం. మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సువాసిని, దంపతిపూజ, మహామంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థప్రసాద వితరణం, మధ్యాహ్నం ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరి జపం, అష్టావధానసేవ, మహా మంగళ హారతి, విశేష నమస్కారాలు, తీర్థ ప్రసాద వితరణం. రాత్రి శ్రీమాతా భువనేశ్వరి చక్రి భజన.
27-12-2015 (ఆదివారం)
గురుప్రార్థన, పుణ్యాహవచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్ని ప్రతిష్ట, అగ్ని విహరణం, స్థాపిత దేవతా హవనం. సపరివార అయుత చండీయాగం, అయుత ల క్ష నవాక్షరీ అజ్యాహుతి, మహాపూర్ణాహుతి, వసోర్దారా, కుమారి, సువాసినీ, దంపతిపూజ, మహా మంగళ హారతి, ఋత్విక్ సన్మానం, కలశ విసర్జనం, అవభృత స్నానం. మహదాశీర్వచనం. ప్రసాద వితరణం, యాగ సంపూర్ణం.