
చండీయాగంలో అపశ్రుతి, అగ్నిప్రమాదం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత మహాచండీయాగంలో చివరిరోజు అపశృతి చోటుచేసుకుంది. యాగం నిర్వహిస్తున్న యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలో మంటలు చెలరేగి యాగశాల మంటపం పైభాగానికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనతో చెల్లాచెదురయ్యారు.
తొక్కిసలాట జరగకుండా పోలీసులు బారికేడ్లు తొలగించారు. యాగశాలలో ఉన్న ప్రముఖులు, ప్రజలను బయటకు పంపించారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒకేసారి పెద్ద మొత్తంలో హోమగుండంలో ఆవు నెయ్యి వేయండంతో మంటలు చెలరేగాయి. యాగ విరామ సమయంలో మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని,
యాగం యధావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.
వెనుదిరిగిన రాష్ట్రపతి
ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చండీయాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. చండీయాగంలో మంటలు వ్యాపించడంతో యాగప్రాంగణంలో కలకలం రేగింది. సరిగ్గా అదే సమయానికి హెలికాప్టర్ లో రాష్ట్రపతి అక్కడకు చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో రాష్ట్రపతి కిందకు దిగకుండానే వెనుదిరిగారు.